
‘రిజర్వేషన్ల అమలు తర్వాతే ఎన్నికలు జరగాలి’
హామీలను విస్మరిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజు వస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని, ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆమె.. బీసీ రిజర్వేషన్లపై తాము వెనకడుగు వేసేది లేదన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం జులై 17న రాస్తారోకోకు పిలుపిచ్చినట్లు ఆమె చెప్పారు.
‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. బీసీ బిల్లులను ఆమోదించడానికి ఒత్తిడి కోసం ఈ నెల 17న రైలు రోకో నిర్వహిస్తున్నాం. ఖమ్మం మీదుగా ఢిల్లీకి వెళ్లే రైలు ఒక్కటి కూడా కదలకూడదు. అప్పుడే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రల నుంచి వచ్చే బిల్లులను మూడు నెలల లోపు పరిష్కరించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ బిజెపి ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘బీసీ బిల్లును ఆమోదించేలా బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ తీసుకోవాలి. రైతు భరోసా నిధులు పంపిణీ చేసి ఎన్నికలకు వెళ్దామని ప్రభుత్వం అనుకుంటున్నా రైతుల ఎవరు సంతోషంగా లేరు. స్థానిక ఎన్నికల కోసమే కంటి తుడుపుగా రైతు భరోసా నిధులు వేశారని రైతులు చెబుతున్నారు. వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు రైతులను వేధిస్తే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా రైతులను పలకరించిన పాపాన పోలేదు. సన్న వడ్లకు బోనస్ ను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాల్సిందే. మహిళలకు నెలకి రూ 2500 ఇస్తామన్న హామీని నెరవేర్చాల్సిందే. పెన్షన్లను నాలుగువేలకు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. హామీలను విస్మరిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.