వేషం మార్చి తెలంగాణ రాజకీయాలలో కవిత మార్పు తేగలరా?
x

వేషం మార్చి తెలంగాణ రాజకీయాలలో కవిత మార్పు తేగలరా?

తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కవిత అభిప్రాయపడుతున్నారు.


దేశంలో ప్రజాదరణ పొందిన మహిళ నాయకులను పోలిన వస్త్రధారణ, హావభావాలను ప్రదర్శిస్తు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత “జాగృతి.. .. జనం బాట” యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో ఆమె వేషధారణలో మార్పు చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రజలలో ఆమె చాలా మందిని చూస్తున్నారు.

ఇలా వేషం మార్చి, ప్రజలను ఆమె ఆకట్టుకోవాలనుకుంటున్నారు. రాజకీయాలలో వేషధారణకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. రాజకీయ నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడేపుడు ఒక వేషంతో కనిపిస్తారు. పాదయాత్రల్లో ఒక విధంగా కనిపిస్తారు. ఇందులో చాలా స్పష్టంగా కనిపించేలా, కొత్తగా కనిపించేలా, మార్పు సూచించేలా వేషం వేయడం చాలా కాలంగా వస్తున్నది.ఇలాంటి వేషధారణలో తెలుగు రాజకీయాల్లో ఎన్టీరామారావు రికార్డు సృష్టించారు. ఆయన ఎన్ని వేషాలు మార్చారో లెక్క లేదు. కవిత తండ్రి కెసిఆర్ నుదట నామం దిద్దుకుని భుజానికి కంకణం కట్టుకుని జనంలోకి వచ్చే వారు. ఈ మధ్యలో కాంగ్రెస్ నాయకుడు, ఇపుడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొన్న ఎన్నికల ముందు వైఎస్ ఆర్ రీతి పంచెకట్టులోకి మారారు. ఈ కోవలో ఇపుడు కవిత కట్టు బొట్టు మారాయి.


తెలంగాణ రాజకీయాలలో మార్పుతెచ్చే ప్రయత్నంలో ఇలా కొత్త కట్టు బొట్టుతో ఎంతవరకు విజయం సాధిస్తున్నది అనే అంశం రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చగా మారింది.

తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి దివంగత జయలలితను జడ కొప్పును పోలిన హెయిర్ స్టైల్, వెస్ట్ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ని పోలిన ఖద్దరు చీర ధరిస్తూ తనకో కొత్త ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నం ఆమె చేస్తుంది. మరొక వైపు ప్రజల సమస్యలపై బలమైన గళాన్ని వినిపిస్తుంది. తాను ఎవరో వాడిలా బాణాన్ని కాదని, ప్రజలు వదిలిన బా ణాన్ని అంటూ తానో స్వతంత్ర నాయకురాలిని అనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం సైతం చేస్తుంది. ఇన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల నుండి ఆమె యాత్రకు లభిస్తున్న ఆదరణ మాత్రం అంతంత మాత్రమే.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతిని నడిపి, జిల్లాలో సైతం తన సంస్థ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించిన అనుభవం కవితకు ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళటం ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పవచ్చు. ఈ అంశం కూడా ఆమెపట్ల ప్రజలలో కొంత వ్యతిరేకతను ఏర్పర్చిందనటం లో సందేహం లేదు. ఆమె భారతీయ రాష్ట్ర సమితిని (బి .ఆర్ .స్.) ను వీడాక తాను పెంచి పోషించిన నాయకులూ సైతం దూరం ఆమెకు అయ్యారు. ఇన్ని ప్రతికూలతలు అధిగమించి కవిత రాజకీయ పార్టీని స్థాపించటం, నాయకురాలుగా ఎదగటం అంత సులువు కాదు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించటం కోసమే కవిత పాద యాత్ర అనే ప్రచారం కూడా ఉంది.


అక్టోబర్ 25 న జాగృతి జనం బాట యాత్రను కవిత నిజామాబాదు నుంచి ప్రారంభించారు. వారం రోజులు పూర్తి ఐన తన యాత్రకు ప్రజలలో ఆశించిన గుర్తింపు రాకపోవటంతో తన ప్రసంగాలలో వాడి వేడి ని పెంచారు. తెలంగాణ సాధనే తన లక్ష్యం అని ఆమె స్పష్టం చేసారు.

తన యాత్రలో భాగంగా ఆమె కరీంనగర్ లో మాట్లాడుతూ పేదవాడికి నేటికీ నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని ఆవేదన చెందారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నల్లచట్టాలు అమలు చేయడం వల్ల కార్మికులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారని, వారికి ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


బీఆర్ఎస్‌లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని కవిత సొంత తండ్రి పార్టీని సైతం టార్గెట్ చేసారు. ఆత్మగౌరవం కోసమే తాను పార్టీతో విభేదించానని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారని కవిత అన్నారు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చాక వారు తనకు టచ్‌లోకి వచ్చారని ఆమె వెల్లడించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కవిత అభిప్రాయపడ్డారు. తన ప్రసంగాలలో వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వివిధ వర్గాల మద్దతు పొందటానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.

ప్రముఖ రాజకీయ విశేషకుడు తెలంగాణ విట్టల్ “ది ఫెడరల్ తెలంగాణ” తో మాట్లాడుతూ కవితను తక్కువ అంచనా వేయటం సరికాదు. కల్వకుంట్ల కుటుంబంలోనే ఆమె సక్సెస్ఫుల్ ఎంట్రప్రెన్యూర్ గా తన సొంత కెరీర్ లో విజయం సాధించింది. కుటుంబం నుంచి సరైన మద్దతు లేకపోవటం తో ఆమె రాజకీయాలలో కొంత వెనకపడ్డారు. కవితకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నవి. ఆమెకు రాష్ట్రంలోని కొంత మంది నాయకుల నుండి కూడా మద్దతు లభించే అవకాశం అవకాశం లేకపోలేదు అని విట్టల్ అన్నారు.

Read More
Next Story