
రాజీనామాపై పట్టు పట్టిన కవిత
జనవరి 5న మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ గుత్తా సుఖేందర్‌కు డిమాండ్.
తన రాజీనామాను ఆమోదించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్టు పట్టారు. తాను రాజీనామా లేఖను అందించి నాలుగు నెలలు అవుతున్నా దానిని శాసనమండలి ఆమోదించకపోవడంపై తాజాగా ఆమె స్పందించారు. బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. కాగా ఆమె రాజీనామా అంశంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్.. కవితను మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. కాగా ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆయన ఆమోద ముద్ర వేయలేదు. ప్రస్తుతం అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న క్రమంలో తన రాజీనామాపై కవిత పట్టు బిగించారు. తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి డిమాండ్ చేశారు.
కవిత, నాలుగు నెలలైనా ఆమోదం కాకపోవడంపై శుక్రవారం మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డిని కవిత కలిశారు. రాజీనామాతో పాటు ఒక్కసారి మండలిలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. తన అభ్యర్థనకు ఓకే చెప్పిన ఛైర్మన్.. ఈ నెల 5న మాట్లాడే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని కవిత వెల్లడించారు.
చైర్మన్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత.. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి టెర్రరిస్ట్ కసబ్‌తో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగవని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ వ్యాఖ్యలు వింటుంటే తాను ఆయన బిడ్డగా రక్తం మరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని కవిత సూచించారు. అలా చేస్తేనే ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు. ‘బబుల్ షూటర్’లుగా పేరున్నవారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి వారితోనే సమాధానాలు చెప్పించడం వల్ల ప్రజలకు విషయం అర్థం కావడం లేదని విమర్శించారు. బబుల్ షూటర్ వల్లే ట్రబుల్స్ వచ్చాయని, పేరు చెప్పకుండానే హరీష్‌రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

