
కేటీఆర్‌పై కవిత డైరెక్ట్ ఎటాక్..
జూబ్లీ ఓటమి నేపథ్యంలో హరీష్ రావుపైనా ఘాటు విమర్శలు చేసిన కవిత.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డైరెక్ట్ ఎటాక్ చేశారు. విభేదాల నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన కవిత అవకాశం దొరికినప్పుడల్లా.. బీఆర్ఎస్‌లోని కీలక నేతలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కానీ కేటీఆర్‌ను నేరుగా పేరుపెట్టి విమర్శించడం మాత్రం ఇదే తొలిసారి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయిన సమయం చూసుకుని కవిత.. కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఉంటే సరిపోదని, ప్రజల్లోకి రావాలని సూచించారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయిందని తేలిన నిమిషాల వ్యవధిలోనే కవిత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అది తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతలోనే ఆమె కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం మరింత సంచలనంగా మారింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే కవిత.. ఈ విమర్శలు చేస్తుందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.
సోషల్ మీడియాను వదులు కేటీఆర్..
‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. అందులో జూబ్లీ ఉపఎన్నికలో ఓడిపోయింది. ఇప్పటికి అయినా మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలి. బీఆర్ఎస్ కేడర్ వేలమంది మాతో టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాతం రెడ్డి, నిరంజన్ రెడ్డి గతంలో ఎలా ఉండేవారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయలు వారిక ఎలా వచ్చాయి? మేమే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారు కానీ కేడర్‌ను మాత్రం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. చేస్తాం’’ అని అన్నారు.
తప్పించుకోవడం హరీష్ రావు నేజం
‘‘బీఆర్ఎస్‌లో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడమే సరిపోతుంది. బీఆర్ఎస్ ఓడిపోగానే కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావు నైజం. కేటీఆర్, హరీష్‌లు పేరుకు కృష్ణార్జులని ట్వీట్ చేసుకోవడం తప్ప.. క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు. 15 మంది ఇండిపెండెంట్లు నా దగ్గరకి వచ్చారు. తాము నామినేషన్ ఉపసంహరించుకుంటున్నామని, ఎవరికి మద్దతు ఇవ్వమంటారని అడిగారు. కానీ నేను.. జూబ్లీ ఉపఎన్నికకు నాకు సంబంధం లేదని చెప్పాను. ఆ తర్వాత వాళ్లు హరీష్ దగ్గరకు వెళ్లి అదే అడిగారు. ఆయన కూడా అదే మాట అన్నారట. నేను బీఆర్ఎస్‌లో లేను కాబట్టి.. ఉపఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీస్ రావు ఆ పార్టీలో ఉన్నారు కదా.. పార్టీలోనే ఉంటూ ఆయన మోసం చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
కర్మ హిట్స్ బ్యాక్..
ఇదిలా ఉంటే శుక్రవారం జూబ్లీ ఉపఎన్నిక ఫలితాలు రాగానే.. కవిత సోషల్ మీడియాలో ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ పోస్ట్ పెట్టారు. ఇదే అవకాశంగా ఆమె బీఆర్ఎస్‌కు చురకలంటిస్తున్నారని అంతా అనుకున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అని అంతా చర్చించారు. కాగా ఇప్పుడు తాజాగా మెదక్‌లో నిర్వహించిన జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆమె కేటీఆర్, హరీష్ రావులపై డైరెక్ట్ ఎటాక్ చేయడంతో వారికే ‘కర్మ హిట్స్ బ్యాక్’ అన్న పోస్ట్ అని అంటున్నారు.

