![Kavitha | ‘కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం’ Kavitha | ‘కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం’](https://telangana.thefederal.com/h-upload/2024/12/10/497247-kavitha.webp)
Kavitha | ‘కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం’
సచివాలయంలో సోమవారం ఆవిష్కరించిందని తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సచివాలయంలో సోమవారం ఆవిష్కరించిందని తెలంగాణ తల్లి(Telangana Talli) విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ విగ్రహాన్నితాము తిరస్కరిస్తున్నామని తెలిపారు. అధికారం ఉంది కదా అని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయమని, తెలంగాణ తల్లి చేతి నుంచి తెలంగాణ ప్రత్యేక పండగ అయిన బతుకమ్మను తొలగించి, హస్తంపార్టీ గుర్తును పెట్టడం దురదృష్టకరమని ఆమె విమర్శించారు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కవిత.. తెలంగాణ భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తమకు ఎప్పటికీ ఈమె తెలంగాణ తల్లి అని, సచివాలయంలో ఆవిష్కరించిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదంటూ పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాస్తూ కాంగ్రెస్.. తెలంగాణ తల్లిని మార్చిందని మండిపడ్డారు.
‘‘ఉద్యమ కాలంలో పెద్దలు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదు? తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారు.. ఆ జాబితాలో మహిళలు ఎందుకు లేరు? స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని, కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు. ఉద్యమకాలం నాటీ ప్రతీకలను అవమానించే యత్నం చేస్తున్నారు. సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం’’ అని కవిత వెల్లడించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమకారులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. బీద తెలంగాణ తల్లిని పెట్టామని రేవంత్ అంటున్నారని, తెలంగాణ మహిళలు ధనికులు కావద్దనే ఆయన మాటలకు అర్థమా? అని ప్రశ్నించారు.