అందరి చిట్టా విప్పుతా.. అసలు ఆట ముందుంది: కవిత
x

అందరి చిట్టా విప్పుతా.. అసలు ఆట ముందుంది: కవిత

కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు కవిత మరోసారి సంచలన ఆరోపణలు


కేటీఆర్, హరీష్ రావు టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి ఘాటు విమర్శలు చేశారు. అసలు హిల్ట్ పాలసీకి ఆధ్యం పోసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇండస్ట్రియల్ భూములను చాలా సెలక్టివ్‌గా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారని, దాని వెనక ఏ గుంటనక్క ఉందో తనకు బాగా తెలుసని అన్నారు. ఇప్పటి వరకు తాను టాస్ మాత్రమే వేశానని, అసలు టెస్ట్ మ్యాచ్ మున్ముందు ఉందంటూ హెచ్చరించారు. ప్రతి నాయకుడి అవినీతిని బయటపెడతానని అన్నారు. ఏదో ఒక రోజున తాను సీఎం అవుతానని, ఆ రోజున అందరి భరతం పడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చేపట్టిన జనంబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తనకు తెలుస్తున్నాయని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నానని అన్నారు. అవతలి వారు చేసిన తప్పులను తనకు ఆపాదించాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా తాను ఏ పని చేయించుకోలేదని, రూపాయి సంపాదించుకున్నదీ లేదని ఆమె అన్నారు.

ఉద్యమంలో కూడా అక్రమాలు చేశారు

తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎవరెవరు ఎలాంటి అవినీతి చేశారో తనకు బాగా తెలుసని కవిత అన్నారు. ‘‘అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను, నా భర్త ఒకటే నిర్ణయం తీసుకున్నాం. నేను ఉద్యమంలో ఉంటా. ఆయన వ్యాపారం చూసుకుంటారు. ఇల్లు నడవాలంటే అలానే చేయాలి. మందిని దోచుకుని తినే బాపతి కాదు మేము. ఒకానొక సమయంలో నా నగలు పెట్టి మరీ బతుకమ్మ చేసినా. కానీ కొందరు ఉద్యమంలో కూడా అక్రమాలు, అవినీతి చేశారు. ఏ స్టూడియోల దగ్గర ధర్నాలకు కూర్చుని, వాళ్లో కాంప్రమైజ్ అయ్యారో కూడా నాకు బాగా తెలుసు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ బాటలను కాంగ్రెస్ రహదారులు చేస్తోంది

హిల్ట్ పాలసీ ఇప్పుడిది కాదని, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం బీఆర్ఎస్ హయాంలోనే మొదలైందని కవిత ఆరోపించారు. దానిపై ప్రభుత్వం కూడా కావాలనే చర్చలు తీసుకోవడం లేదన్నారు. ‘‘హిల్ట్ పాలసీకి బీఆర్ఎస్ బాటలు వేసింది. వాటిని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులుగా మారుస్తోంది. బీహార్ హయాంలో అనేక చెరువులు ప్రైవేట్ బిల్డర్లకు డెవల్‌మెంట్ పేరుతో ఇచ్చారు. వాటిలో ఉస్మాన్ కుంట కూడా ఒకటి. దానిని ప్రణీత్ అనే బిల్డర్‌కు ఇచ్చారు. అందులో మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌గా ఉన్నారు. కృష్ణారావు వెనక ఒక గుంట నక్క ఉండి ఇదంతా చేయించింది. దానిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఆ అనుమతులపై ఎవరు సంతకాలు పెట్టారు. ఆ సంతకాలు పెట్టడం వెనక ఎవరు ఉన్నారో అంతా తెలుసు’’ అని కవిత అన్నారు.

కప్పను తిన్న పాము రేవంత్..

ఈ సందర్భంగానే కవిత.. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడే కప్పను తిన్న పాములా ఉందని ఎద్దేవా చేశారు. కడుపు నిండింది కాబట్టే ఆయన ఏ అన్యాయం, అక్రమంపై చర్చలు తీసుకోవం లేదన్నారు. పైగా బీఆర్ఎస్ బాటలను రహదారులుగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారని చురకలంటించారు. ‘‘పాము ఇప్పుడే కప్పను తిన్నది.. కడుపు నిండింది కాబట్టి ఏం జరిగినా పట్టించుకోదు. అదే విధంగా రేవంత్ కూడా సీఎం పదవి వచ్చింది.. ఒక రాష్ట్రం ఏమైతే ఏంది? ప్రజలు ఎలా పోతే ఏంది? అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు’’అని విమర్శించారు.

తన భర్తపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన కవిత, బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కుటుంబ ఫోన్‌లను ట్యాప్ చేయించిందని ఆరోపించారు. “కేటీఆర్ నా భర్త ఫోన్‌ను ట్యాప్ చేయించాడు… ఇంతకీ సిగ్గుండదా?” అంటూ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తన భర్త ఎట్టి అవకతవకల్లోనూ పాల్గొనలేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా ఎవరిని సంప్రదించలేదని తెలిపారు.

Read More
Next Story