తీగ తగిలింది ఇలా.. కోర్టుకి కవిత అలా..
x
కవిత

తీగ తగిలింది ఇలా.. కోర్టుకి కవిత అలా..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. విచారించడానికి ఆమె కస్టడీని కోరనున్నారు.



తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం నాడు అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది. ఈరోజు ఆమెను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అంతకు ముందే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న కవిత రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. శనివారం ఉదయం వైద్యుల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని కవితకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.


అనంతరం ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు. కవితను జస్టిస్ కేఎం నాగపాల్ ధర్మాసనం ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాం సహా మనీలాండరింగ్ కేసులకు సంబంధించి విచారించడానికి కవిత కస్టడీని ఇవ్వాలని అధికారులు కోరనున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం ద్వారా బినామీ పేర్లతో భారీగా అక్రమార్జన చేశారన్న అభియోగాలు ఉన్నాయి కవితపై. భారీ బందోబస్తు నడుమ కవితను అధికారులు కోర్టుకు తరలించారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఈడీ కార్యాలయానికి చేరుకోవడమే ఇందుకు కారణం.


తీగ లాగింది వీళ్లే


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలిసారి కవిత పేరు వినిపించింది 2022 ఆగస్టు 21న. ఈ రోజునే ఈ కుంభకోణంలో కవిత హస్తం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మన్వీందర్ సింగ్ ఆరోపణలు గుప్పించారు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆప్ నేతలను కవిత కలిశారని, అక్కడే డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. అప్పట్లో వీరిపై కవిత పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు. తనకు సంబంధంలేని కేసులో కావాలనే తనను ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. కానీ బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన కొన్నాళ్లకే ఈడీ.. కవితకు నోటీసులు జారీ చేశారు. ఆమెను విచారణకు హాజరుకావాలని కోరింది.

గత ఏడాది అనగా 2023లో ఆమెను ఈడీ అధికారులు విచారించారు కూడా. అప్పుడే తనకు ఈడీ జారీ చేస్తున్న నోటీసులపై కవిత.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే శుక్రవారం కవిత నివాసంలో దాదాపు 5 గంటలు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఈరోజు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఆమెను హాజరుపరిచారు.



Read More
Next Story