
కేసీఆర్ ఇమేజీని కవితే డ్యామేజి చేసిందా ?
కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న వ్యాఖ్యలతో కేసీఆర్ ను పూర్తిగా కవిత ఇరుకునపడేసింది
‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ చచ్చుడో, చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించాను’ అని వందలసార్లు చెప్పుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అచేతనమైపోయారు. పార్టీలో కవిత(Kavitha) దూకుడుకు కేసీఆర్(KCR) కళ్ళెం వేయలేకపోయారు. కొడుకు(KTR)కేటీఆర్-కూతురు కవిత మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నియంత్రించలేకపోయారు. దాని ఫలితమే జనాల్లో బీఆర్ఎస్(BRS) పలుచనైపోయింది. చివరకు మంగళవారం పార్టీనుండి కూతురు కవితను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటికే కేసీఆర్ కు బాగా డ్యామేజి జరిగిపోయిందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అందుకనే పార్టీ డౌన్ ఫాల్ కు కవితే కారణమన్న ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. ఎలాగంటే సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)లో ఇరుక్కున్నారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలకపాత్రగా సీబీ(CBI)ఐ, ఈడీ(ED) దర్యాప్తులో తేలింది. వెంటనే కేసులు నమోదుచేసిన దర్యాప్తు సంస్ధలు కవితను అరెస్టు చేశాయి. మొదట్లో కేసు నమోదుచేసినా కవితను అరెస్టు చేయకుండా దర్యాప్తుసంస్ధలు కాలయాపన చేశాయి. దాంతో ఇదేవిషయాన్ని ప్రస్తావిస్తు ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth), కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణలు మొదలుపెట్టారు.
కాంగ్రెస్ నుండి ఎదరవుతున్న ఆరోపణలను కేసీఆర్, కీలక నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. ఈ ప్రచారం చేస్తున్న డ్యామేజీని కంట్రోల్ చేయటానికా అన్నట్లుగా చివరకు సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు కవితను సీబీఐ అరెస్టుచేసింది. అప్పటివరకు నరేంద్రమోదీని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కవిత అరెస్టు తర్వాత అసలు మోదీగురించి మాట్లాడటమే మానుకున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ ఎన్నికలసమయంలో పదేపదే హైలైట్ చేసి విపరీతంగా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేసీఆర్ ఏదశలో కూడా తిప్పికొట్టలేకపోయారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్నికల సమయంలోనే రాహుల్, రేవంత్, మంత్రులు పదేపదే ఆరోపణలు చేశారు.
సరే, తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అన్న రాహుల్, రేవంత్ ఆరోపణలను జనాలు నమ్మటం కూడా ఓటమికి కారణాల్లో ఒకటని విశ్లేషకులు తేల్చారు. తర్వాత కొంతకాలం కవిత మౌనంగానే ఉన్నారు. కవిత అమెరికాలో ఉన్నపుడు కేసీఆర్ కు రాసిన లేఖ లీకయ్యింది. అమెరికా నుండి రావటం రావటమే ఎవరి పేరును ప్రస్తావించకుండానే కవిత విరుచుకుపడ్డారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నట్లుగా మండిపడ్డారు. తండ్రికి తానురాసిన లేఖను ఎవరు లీక్ చేశారో తెలియాలని డిమాండ్ చేశారు. పనిలోపనిగా కేటీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించనని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇదేసమయంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనంచేసే ప్రయత్నాలు జరిగినట్లు పెద్ద బాంబు పేల్చారు. అప్పటివరకు ఆరోపణలుగానే ఉన్న రేవంత్ ఆరోపణలు కవిత వ్యాఖ్యలతో నిజమే అని జనాలు నిర్ధారించుకున్నారు. అన్నా-చెల్లెళ్ళ మధ్య గొడవలు రోడ్డునపడటంతో పార్టీ మరోసారి జనాల్లో పలుచనైపోయింది. కేటీఆర్-కవిత మధ్య ఇంత గొడవ జరుగుతున్నా కేసీఆర్ కవితను వారించలేకపోయారు.
మళ్ళీ రెండోసారి కవిత అమెరికా నుండి వచ్చీరావటంతోనే నాన్నకు ప్రేమతో అంటు కేసీఆర్ ను సమర్ధిస్తు ఈసారి డైరెక్టుగా మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనికి కారణం ఏమిటంటే కాళేశ్వరం అవినీతి, అవకతవకల్లో కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి హరీష్, సంతోషే కారణమని కవిత పెద్ద బాంబు పేల్చారు. కవిత చేసిన ఆరోపణలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న రేవంత్, మంత్రుల ఆరోపణలను నిర్ధారించినట్లయ్యింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కు కూడా అవినీతిలో భాగముందని కవిత ఆరోపణల ద్వారా జనాలందరికీ అర్ధమైంది. కవిత ఆరోపణలకు ఎలా కౌంటర్ చేయాలో పార్టీ నాయకత్వంకు దిక్కుతోచలేదు.
ఇక చేసేదిలేక చివరకు పార్టీ నుండి కవితను సస్పెండ్ చేస్తు అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న కవిత వ్యాఖ్యలు కేసీఆర్ తో పాటు యావత్ పార్టీని నిలువునా ముంచేసినట్లయ్యింది. కవిత మాటలనే రేవంత్, మంత్రులు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీ చర్చల్లో కాళేశ్వరంలో అవినీతి, అవకతవకలు జరగలేదని హరీష్ గొంతుచించుకుని వాదిస్తే మరోవైపు కవితేమో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పారు. కవిత ఆరోపణలు కేసీఆర్, హరీష్ దాఖలుచేసిన కోర్టు కేసులపైన కూడా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. మరో వైపు తమ వాదనలకు విరుద్ధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకత్వం గందరగోళంలో పడిపోయింది. అందుకనే వేరేదారిలేక చివరకు కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముందు లిక్కర్ స్కామ్, తర్వాత కేటీఆర్ పై ఆధిపత్య గొడవలు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు, చివరకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న వ్యాఖ్యలతో కేసీఆర్ ను పూర్తిగా కవిత ఇరుకునపడేసింది. తనమీద వస్తున్న ఆరోపణలకు కేసీఆర్ కు సమాధానం కూడా చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేసింది కవిత. జరిగింది చూస్తుంటే బీఆర్ఎస్ లేదా కేసీఆర్ కు రేవంత్ తదితరులు చేసిన డ్యామేజీకన్నా కూతురు కవిత చేసిన డ్యామేజీనే చాలా ఎక్కువని అర్ధమవుతోంది. పార్టీనుండి సస్పెండ్ అయ్యింది కాబట్టి కవత ఎలా స్పందిస్తారు ? ఇంకెంత డ్యామేజీ చేస్తారో చూడాలి.