25 నుండి కవిత ‘జనంబాట’
x
Kalvakuntla Kavitha in Yadadri Temple

25 నుండి కవిత ‘జనంబాట’

ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయపార్టీ పెడతాను


కల్వకుంట్ల కవిత ఈనెల 25వ తేదీనుండి ‘జనంబాట’ పట్టనున్నారు. సొంతూరు నిజామాబాద్ నుండి జనంబాట కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు చెప్పారు. యాదాద్రి(Yadadri)లోని యాదగిరీశుడిని దర్శించుకున్న కవిత(Kavitha) గురువారం ప్రత్యేకపూజలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు తాను చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకే జనంబాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలుగు నెలలు ఈ కార్యక్రమం(Janambata)జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అన్నీ వర్గాలవారిని కలుసుకుని వాళ్ళ నుండి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటానని కూడా చెప్పారు.

ఈమధ్యనే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కవిత ఈరోజు యాదాద్రి దేవాలయం దర్శనం చేసుకున్నారు. ప్రజా సమస్యలను అర్ధంచేసుకునే శక్తిని ప్రసాదించమని దేవుడిని కోరుకునేందుకే తాను దైవదర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. 4 నెలల యాత్రలో 33 జిల్లాల్లోని యువత, మేథావులు, విద్యావంతులు, రైతులు, మహిళలు అందరినీ కలుస్తానన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా దృష్టిపెడతానని హామీఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ యాదాద్రిని చక్కగా పునర్ నిర్మించినట్లు చెప్పారు.

తెలంగాణ జాగృతిగురించి మాట్లాడుతు సంస్ధ సివిల్ సొసైటీ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాలు పుష్కలంగా మాట్లాడుతానని కవిత అన్నారు. ఇప్పటివరకు అసలు జాగృతి వేదికనుండి రాజకీయాలే మాట్లాడనట్లుగా చెప్పారు. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయపార్టీగానే ఉండాల్సిన అవసరంలేదని గుర్తుచేశారు. ప్రజలు కోరుకుంటే పార్టీ పెట్టడంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయపార్టీలున్న విషయాన్ని గుర్తుచేశారు. కేరళలో అయితే గల్లీకి ఒకపార్టీ ఉందన్నారు. పార్టీలు ఉండటం గొప్పకాదని వాటితో ప్రజలకు మేలు జరగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

కవిత మాటలు విన్నతర్వాత పూర్తిస్ధాయిలో రాజకీయపార్టీ పెట్టడానికి అవసరమైన వేదికను జనంబాటలో ఏర్పాటు చేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. రాజకీయపార్టీ పెడితే జనాల స్పందన ఎలాగుంటుందనే విషయాన్ని స్వయంగా తెలుసుకునేందుకే జనంబాట పేరుతో ఏకంగా 120 రోజులు జనాల్లోనే తిరగాలని డిసైడ్ అయినట్లున్నారు. నాలుగు నెలల యాత్ర అయ్యేటప్పటికి 2026 ఫిబ్రవరి అయిపోతుంది. ఆ తర్వాత కొంతకాలం జనంబాట కార్యక్రమంపై విశ్లేషణలు జరుగుతాయి. దాంతో 2026 ఏడాదిలో ఆరుమాసాలు గడచిపోతాయి. కాబట్టి షెడ్యూల్ ఎన్నికలకు ఇక మిగిలుండేది సుమారు ఏడాదిన్నర మాత్రమే. వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి బహుశా 2026 చివరలో రాజకీయపార్టీని కవిత ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.

రాజకీయపార్టీ ఏర్పాటుచేసి నడపటం అన్నది మామూలు విషయం కాదు. ఎంతోమంది ఉత్సాహంగా పార్టీని ప్రకటించి మధ్యలోనే కాడిదింపేసిన జాబితా చాలా పెద్దదే ఉంది. పార్టీ నడపాలంటే ఆర్ధికబలం పుష్కలంగా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే. డబ్బున్న వాళ్ళకు కూడా రాజకీయపార్టీ పెట్టి నడపటం చాలా కష్టమే. ఈ విషయాలు కవితకు తెలియవని అనుకునేందుకు లేదు. ఈమధ్యనే వైఎస్ షర్మిల పార్టీ వ్యవహారం ఏమైందో అందరు చూసిందే. కాబట్టి కవిత రాజకీయపార్టీ ఏర్పాటు అన్నది ఏమవుతుందో చూడాల్సిందే.

Read More
Next Story