Kawal Jungle Safari |అభయారణ్యం అద్భుత అందాలు,సఫారీ రైడ్ చేద్దాం రండి
x
జంగిల్ సఫారీ రైడ్ లో పులిని వీక్షిస్తున్న సందర్శకులు (ఫొటో : కవ్వాల అటవీశాఖ సౌజన్యంతో)

Kawal Jungle Safari |అభయారణ్యం అద్భుత అందాలు,సఫారీ రైడ్ చేద్దాం రండి

ఉరుకుల పరుగుల జీవితం నుంచి సేద తీరాలంటే ప్రకృతి ఒడిలోని కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించాల్సిందే. పచ్చనిచెట్లు, వన్యప్రాణుల సంచారాన్ని చూసి ఆనందించాల్సిందే.


గలగల పారుతున్న గోదావరి నదీ జలాలు...దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తున్న కడెం నది...కొండలపై నుంచి జాలువారుతున్న కుంటాల, గాయత్రి, పొచ్చెర జలపాతాలు...మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతాన్ని కేంద్రప్రభుత్వం 2012వ సంవత్సరంలో కవ్వాల్ పులుల అభయారణ్యంగా(Kawal Jungle Safari) ప్రకటించింది. 2015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మల్, మంచిర్యాల్,ఆదిలాబాద్ , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించిన అభయారణ్యం పర్యాటకులకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. (sanctuary is full of amazing beauty)ఇటీవల కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించిన ‘ఫెడరల్ తెలంగాణ’ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం...




కవ్వాల్ కు ఎలా చేరుకోవాలంటే...

కవ్వాల్ పులుల అభయారణ్యానికి రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై 300కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. నాగ్ పూర్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుంచి 800కిలోమీటర్ల దూరంలో కవ్వాల్ ఉంది. హైదరాబాద్- న్యూఢిల్లీ రైలు మార్గంలో మంచిర్యాల్ రైల్వేస్టేషనులో దిగి కవ్వాల్ కు చేరుకోవచ్చు. హైదరాబాద్, నాగపూర్ విమానాశ్రయాల నుంచి కూడా కవ్వాల్ కు చేరుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులు, వన్యప్రాణి ప్రియులు, వీఐపీలు, విద్యార్థులు, అటవీశాఖ శిక్షణ సిబ్బంది, పర్యాటకులు కవ్వాల్ ను సందర్శిస్తుంటారు.



వన్యప్రాణులకు నిలయం...కవ్వాల్ అభయారణ్యం

పచ్చని ఎతైన చెట్లు, నదులు, నీటి సరస్సులు, జలపాతాలే కాకుండా ఈ అభయారణ్యం (Telangana Jungle Safari) ఎన్నెన్నో రకాల వన్యప్రాణులకు నిలయంగా మారింది. పులులు, చిరుతలే కాకుండా చీతల్, సాంబార్, మొరిగే జింకలు, నీలగాయి, అడవి దున్నలు, మొసళ్లు, దుప్పి, గడ్డి జింకలు, స్టార్ తాబేళ్లు, కోబ్రా, కొండచిలువలు, వివిధ రకాల పక్షులు,నెమళ్లు, సీతాకోకచిలుకలు, ఇలా ఎన్నెన్నో వన్యప్రాణులు అభయారణ్యంలో కనిపిస్తుంటాయి.బైసన్ కుంటలో అడవి దున్నలు, కల్పకుంటలో వివిధ రకాల వన్యప్రాణులు, అకొండపేట్ వివిధకాల పక్షులను తిలకించవచ్చని కవ్వాల్ అటవీశాఖ అధికారి ఆశిష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించేవారికి తమ జంగిల్ సఫారీ రైడ్ ఆనందానుభూతిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.



జలపాతాల జోరు

కవ్వాల్ అభయారణ్యంలో జాలువారుతున్న జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో నేరడిగొండ మండలం కుంటాల వద్ద ఎతైన కొండలపై నుంచి లోతైన లోయలోకి జాలువారుతున్న కుంటాల జలపాతం సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.45 మీటర్ల ఎత్తులో నుంచి జలాలు లోయలోకి జాలువారుతూ పర్యాటకులను పరవశింపజేస్తుంది.సోమేశ్వర స్వామిగా పేరొందిన శివుడు ఈ జలపాతం వద్ద కొలువు తీరడంతో మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవం చేస్తుంటారు. గోదావరి ఉప నది అయిన కడెం నదిపై గుట్టలపై నుంచి గాయత్రి జలపాతం నీరు జాలువారుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. రాళ్ల గుట్టలపై నుంచి బోథ్ సమీపంలోని పొచ్చెర గ్రామం వద్ద పొచ్చెర జలపాతం వర్షాకాలంలో జాలువారుతుంది. 20 మీటర్ల పైనుంచి నీరు గుట్టపై నుంచి జాలువారుతుంది. మూడు జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని ఇందన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



కడెం డ్యామ్ అందాలు

గోదావరికి ఉప నది అయిన కడెం నదిపై నిర్మల్ జిల్లా కడెం గ్రామం వద్ద నిర్మించిన జలాశయం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. మూడు వైపులా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండగుట్టలు, మధ్యలో నిల్వ ఉన్న నీటితో జలకళ ఉట్టిపడుతుంది. ఈ రిజర్వాయర్ చేపల పెంపకానికి కేంద్రంగా నిలిచింది. 76.8 కిలోమీటర్ల లెఫ్ట్ కెనాల్, 8 కిలోమీటర్ల రైట్ కెనాల్ తో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను కడెం నీరందిస్తుంది. కడెం దిగువన పెద్ద బెల్లాల్ వద్ద 300 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. కడెం రిజర్వాయర్ నిండా నీటితో జలకళ సంతరించుకుంది.



పచ్చని అందాల అర్బన్ పార్కులు

అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ లో పచ్చని అందాల అర్బన్ పార్కులు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఆదిలాబాద్ నగర శివార్లలోని దస్నాపూర్ సమీపంలో ఉన్న మావల అర్బన్ పార్కు పచ్చని చెట్లతో అలరారుతుంది. నిర్మల్ సమీపంలోని చించోలి అర్బన్ పార్కు పచ్చదనంతో వెల్లివిరిసింది. సారంగాపూర్ మండలం కౌట్లా గ్రామంలో అడెల్లి పోచమ్మ టెంపుల్ సమీపంలోని అర్బన్ పార్కు పచ్చని చెట్లతో దర్శనమిస్తుంది. అర్బన్ పార్కులు కూడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని కవ్వాల్ అటవీశాఖ డిప్యూటీ రేంజి ఆఫీసర్ ఎస్ తిరుపతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో బర్డ్ వాక్

కవ్వాల్ పులుల అభయారణ్యంలో పులులు, వన్యప్రాణులే కాకుండా వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఎతైన పచ్చని చెట్లు, దట్టమైన అడవిలో చెరువులు, కొండలు, గుట్టలతో అలరారుతున్న ఈ అభయారణ్యంలో వేలాది రకాల రంగురంగుల అరుదైన పక్షులు, వాటి కిలకిలరావాలతో కవ్వాల్ మార్మోగుతుంటుంది. నాడు ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీంఅలీ కవ్వాల్ అరణ్యంలో పక్షులను చూసి ఇక్కడ అరుదైన జాతుల పక్షులున్నాయని ప్రపంచానికి మొదటిసారి తెలిపారు.అడవిలో పక్షులను తిలకించేందుకు పక్షిప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో జన్నారం అటవీశాఖ అధికారులు బర్డ్ వాచర్స్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. బైనాక్యులర్స్, కెమెరాలు మెడలో వేసుకొని అడవిలో సంచరిస్తూ అరుదైన పక్షులను చూసి పక్షిప్రేమికులు ఆనందానుభూతి చెందుతున్నారు. జన్నారం కేంద్రంగా గతంలో పలుసార్లు బర్డ్ వాచర్స్ శిబిరాలు నిర్వహించారు. ప్రజల నుంచి బర్డ్ వాచింగ్ కు స్పందన పెరగడంతో జనవరి 18,19, ఫిబ్రవరి 1,2 తేదీల్లో స్పెషల్ బర్డ్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు జన్నారం ఫారెస్ట్ రేంజి అధికారిణి సుష్మారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



జంగిల్ సఫారీ బుకింగ్

కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని సందర్శించాలంటే జంగిల్ సఫారీ( jungle safari ride) బుకింగ్ చేసుకోవచ్చని అటవీశాఖ ఉద్యోగి రమేష్ ‘పెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సోమవారం నుంచి గురువారం వరకు ఆరుగురు సభ్యులతో సఫారీ రైడ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు వీకెండ్ సఫారీ టూర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 6.30 గంటలకు, 9.30 గంటలకు మధ్యాహ్నం 3.30 గంటలకు సఫారీ రైడ్ ఉంటుందని చెప్పారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ అధికారులను ఫోన్ నంబర్లు 94403 37315,94410 57771 లలో సంప్రదించవచ్చు.



హరిత హోటల్ లో బస చేయవచ్చు...

కవ్వాల్ అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న జన్నారం, కడెం లలోని హరిత హోటళ్లలో బస చేయవచ్చు. ఏసీ, నాన్ ఏసీ గదులు, కాటేజీలు, డార్మిటరీలు, బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.

పులుల మేటింగ్ సీజనులో టైగర్ రిజర్వ్ మూసివేత
పులుల మేటింగ్ సీజనులో వాటికి అంతరాయం కల్పించకుండా ఉండేందుకు జులై నుంచి సెప్టెంబరు వరకు మూడు నెలలపాటు వర్షాకాలంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను మూసి ఉంచుతారు.









Read More
Next Story