KCR | కేసీఆర్, హరీష్ కు హైకోర్టు బిగ్ షాక్
x
High court shocks KCR and Harish

KCR | కేసీఆర్, హరీష్ కు హైకోర్టు బిగ్ షాక్

పిటీషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు(Telangana High Court) చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుదద్దీన్ ధర్మాసనం నిరాకరించింది


జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలన్న కేసీఆర్(KCR), హరీష్(Harish Rao) వాదనను హైకోర్టు కొట్టేసింది. కేసీఆర్, హరీష్ దాఖలుచేసిన పిటీషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు(Telangana High Court) చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుదద్దీన్ ధర్మాసనం నిరాకరించింది. వీళ్ళ పిటీషన్లను పరిశీలించిన హైకోర్టు స్టే అవసరంలేదని అభిప్రాయపడింది. అంటే పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ముందుకు వెళ్ళవచ్చని అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం(Kaleshwaram), మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతి, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ తో విచారణ చేయించిన విషయం అందరికీ తెలిసిందే. కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్యాబినెట్ ఆమోదించింది. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రిపోర్టును ప్రవేశపెడతామని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించారు.

అసెంబ్లీలో కమిషన్ రిపోర్టును సభ్యులందరికీ అందచేసి చర్చించిన తర్వాతే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు. అయితే ఇదే విషయమై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైకోర్టులో కేసులు వేశారు. కేసుల్లో ఏమని చెప్పారంటే అసలు కమీషన్ ఏర్పాటే చెల్లదని, కమిషన్ ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై స్టే ఇవ్వాలని కోరారు. గురువారం ఈ కేసు విషయమై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. శుక్రవారం ఉదయం విచారణ మొదలైన తర్వాత కేసీఆర్, హరీష్ కోరినట్లుగా స్టే ఇవ్వలేమని తేల్చేసింది. అసెంబ్లీలో చర్చలు జరిగిన తర్వాతే బాధ్యులపై చర్యలు ఉంటాయన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హామీని కోర్టు పరిగణలోకి తీసుకున్నది. అందుకనే విచారణ దశలోనే కేసీఆర్, హరీష్ అడిగినట్లుగా స్టే ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ రిపోర్టును రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు. కాపీలను సభ్యులకు అందించిన తర్వాత జరిగిన అవినీతి, అవకతవకలపై అసెంబ్లీలో చర్చించవచ్చు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభలోనే నిర్ణయించవచ్చని అర్ధమవుతోంది. పిటీషన్లు దాఖలుచేసిన కేసీఆర్, హరీష్ కూడా ఎంఎల్ఏలే కాబట్టి వాళ్ళు చెప్పుకోవాల్సింది అసెంబ్లీలోనే చెప్పుకోవచ్చని అడ్వకేట్ జనరల్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అలాగే కమిషన్ రిపోర్టును వెబ్ సైట్ లో పెట్టుంటే వెంటనే తొలగించమని ఆదేశించింది.

కమిషన్ రిపోర్టులో ఏముంది ?

దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్ళకే ఎందుకూ పనికిరాకుండా పోయింది. కాళేశ్వరంకు అనుబంధంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి ఏడోప్యాకేజీలో మూడుపిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. భూమిలోకి కుంగిపోవటంతో పిల్లర్లకు పగుళ్ళొచ్చేశాయి. అలాగే డ్యాం ప్లాట్ ఫారమ్ చీలికలు వచ్చేశాయి. దీంతో మేడిగడ్డలో నీటినిల్వకు అవకాశంలేకుండాపోయింది. దీని ఫలితంగా కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోతోంది. ఇదే విషయమై ఘోష్ కమిషన్ దాదాపు 117 మందిని విచారించింది. విచారణలో కేసీఆర్, హరీష్ రావులు కూడా పాల్గొని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో పాల్గొన్నారు. ఇదే విషయమై కమిషన్ ఇరిగేషన్, ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకుంది.

అందరినీ విచారించిన కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందచేసింది. లీకైన రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలకు కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆరే అని నిర్ధారించింది. కేసీఆర్ తో పాటు హరీష్, అప్పటి ఆర్ధికశాఖ మంత్రి, ఇప్పటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఉన్నతాధికారుల పాత్రను కూడా చెప్పింది. హోలు మొత్తంమీద ఎవరెవరి పాత్ర ఎంత ? ఎవరెవరి బాధ్యతలు ఎంతన్న విషయాన్ని కమిషన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దాంతో కమిషన్ రిపోర్టు ఆధారంగా తమపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతోందనే టెన్షన్ కేసీఆర్, హరీష్ లో పెరిగిపోయింది. అందుకనే కమిషన్ నియామకమే చెల్లదని, కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో కేసులు వేశారు. ఆ కేసులను విచారించిన కోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించింది.

Read More
Next Story