ఇంతలో కేసీయార్లో ఎంత మార్పు
నివేదిత అభ్యర్ధిత్వంపై నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో పాటు టికెట్ కోసం పోటీపడిన మిగిలిన ఆశావహులతో కూడా కేసీయార్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టికెట్ ఫైనల్ చేశారు.
తొందరలో జరగబోతున్న కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా లాస్య నివేదితను కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపికచేశారు. అభ్యర్ధిగా నివేదితను ఎంపిక చేయటంలో ఆశ్చర్యంలేదు. అయితే నివేదిత అభ్యర్ధిత్వంపై నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో పాటు టికెట్ కోసం పోటీపడిన మిగిలిన ఆశావహులతో కూడా కేసీయార్ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత టికెట్ ఫైనల్ చేశారు. అందరితో మాట్లాడిన తర్వాత ఆశావహులను కన్వీన్స్ చేసిన తర్వాతే అభ్యర్ధిని ఎంపికచేశారు. నివేదిత మాజీ ఎంఎల్ఏ జీ. శాయన్న రెండోకూతురు. శాయన్న టీడీపీ, టీఆర్ఎస్ తరపున వరుసగా నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. 2023, ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించారు.
అందుకని 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో శాయన్న పెద్ద కూతురు నందితకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నందిత 2024, ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఇపుడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఉపఎన్నికలోనే పార్టీ అభ్యర్ధిగా ఎవరిని పోటీచేయించాలనే విషయమై కేసీయార్ అందరితోను సంప్రదించారు. రెండు మూడు మీటింగులు పెట్టుకుని చివరకు నందిత చెల్లెలు నివేదితను అభ్యర్ధిగా డిసైడ్ చేశారు. నిజానికి శాయన్న మరణించగానే పెద్దకూతురు నందితను అభ్యర్ధిగా డిసైడ్ చేసినట్లే, నందిత మరణించగానే ఆమె చెల్లెలు నివేదిత అభ్యర్ధిగా డిసైడ్ అయిపోయింది. పార్టీ నేతలతో చర్చలు, ఆశావహులతో సమావేశాలంతా ఉత్తుత్తిదే.
ఒకపుడు అంతా ఏకపక్షమే
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2023 ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపికచేసినపుడు కేసీయార్ దాదాపు నెలరోజులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో నుండి బయటకురాలేదు. నేతల్లో ఎవరినీ తనవద్దకు రానీయలేదు. టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకునే సీనియర్లు, ఆశావహులు ఎంతగా ప్రయత్నాలు చేసుకున్నా తనను కలవటానికి కేసీయార్ ఎవరికీ అవకాశాలు ఇవ్వలేదు. ప్రకటించిన టికెట్లలో మార్పులు చేయాలని చెప్పటానికి సీనియర్ నేతలు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. కేసీయార్ తో మాట్లాడే అవకాశం రావటంలేదని సీనియర్లు కేటీయార్ తో మాట్లాడేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యారు. పార్టీలో అంతా తనిష్టప్రకారమే జరుగుతుందని, అభ్యర్ధుల ఎంపికలో తనదే ఫైనల్ డెసిషన్ అని కేసీయార్ చెప్పకనే చెప్పేశారు. అభ్యర్ధుల ఎంపికలో తాను ఎవరితోను మాట్లాడాల్సిన అవసరంలేదని కూడా యాక్షన్ ద్వారా చూపించారు.
మొత్తం 119 టికెట్ల ప్రకటనలో కేసీయార్ ఇదే పంథాను అనుసరించారు. అభ్యర్ధుల ఎంపికపై ఫాంహౌస్ లో పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన కేసీయార్ చివరకు జనాల్లో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంఎల్ఏలకే టికెట్లు ప్రకటించారు. ఎన్నికలకు దాదాపు రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించిన కేసీయార్ తప్పని పరిస్ధితుల్లో 12 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్ధులను చివరినిముషంలో మార్చారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ ఓటమికి కారణం ఏమిటంటే జనాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలకే మళ్ళీ టికెట్లు ఇవ్వటం కూడా ఒక కారణమని పోస్టు మార్టమ్ లో తేలింది. దాంతో చేసేదేమీలేక ప్రధాన ప్రతిపక్షనేతగా ఫాంహౌస్ కే పరిమితమైపోయారు.
ఇంతలో అంత మార్పా ?
అలాంటిది నందిత కారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఉపఎన్నికలో అభ్యర్ధిని ఎంపికచేయటంలో కేసీయార్ లో మార్పొచ్చినట్లుంది. నివేదిత అభ్యర్ధిత్వం లాంఛనమే అయినా సీనియర్లు, ఆశావహులు మన్నె కృషాంక్, గజ్జెల నగేష్, ఎర్రోళ్ళ శ్రీనివాస్ తో కూడా మాట్లాడి వాళ్ళ సమక్షంలోనే నివేదితను అభ్యర్ధిగా ప్రకటించారు. కాలము, ఓటమి ఎంతటివారిలో అయినా మార్పులు తీసుకొస్తుందనేందుకు నిదర్శనమే నివేదిత ప్రకటన. నిజానికి నివేదితను అభ్యర్ధిగా ప్రకటించటం లాంఛనమే కాబట్టి నేతలు, ఆశావహుల్లో ఎవరితోను కేసీయార్ మాట్లాడక్కర్లేదు. అయినా మాట్లాడారంటే కారణం అభ్యర్ధి గెలుపుకు నేతలు, ఆశావహులు సిన్సియర్ గా పనిచేయాలి కాబట్టే.
మొన్నటి ఎన్నికల్లో కేసీయార్లో ఈ ఆలోచన లోపించింది. తాను ఎవరిని అభ్యర్దిగా ప్రకటించినా నేతలు, ఆశావహులు నోరుమూసుకుని పనిచేస్తారని, జనాలు ఓట్లేసి గెలిపిస్తారనే భ్రమల్లో ఉండేవారు. అందుకనే అంతటి ఒంటెత్తుపోకడలకు పోయారు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల అభ్యర్ధుల ఎంపికపై కేటీయార్ ఎక్కువగా కసరత్తు చేశారని పార్టీవర్గాలు చెప్పాయి. భ్రమలు, ఒంటెత్తుపోకడలే బీఆర్ఎస్ ను అధికారానికి దూరంచేసింది. అందుకనే ఇపుడు బుద్ధిగా అందరితో మీటింగులు పెట్టుకుని అభ్యర్ధిని ప్రకటించారు.