రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
x

రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు

రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.


కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. గురువారం (రేపు) రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు.

సన్నబియ్యానికి మాత్రమే క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేసీఆర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రైతులందరికీ బోనస్‌ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై యూ టర్న్‌ తీసుకుని రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తోందని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో దాదాపు 90 శాతం మంది రైతులు యాసంగి సీజన్‌లో ముతక వరిని సాగు చేస్తారని ఆయన చెప్పారు. కీలకమైన ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, రాజకీయ లబ్ధి కోసం రైతులను కాంగ్రెస్‌ దోపిడీ చేస్తోందన్నారు.

"ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా వైఖరి మార్చుకోవడం ఆ పార్టీ అసలు రంగును బయటపెడుతోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను తప్పుదోవ పట్టించారు. ఎన్నికలకు ముందు ఇదే ప్రకటన చేసి ఉంటే రైతులు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పేవారని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రైతు బంధు, రైతు భరోసా, ఇతర ప్రయోజనాలన్నీ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరినీ మోసం చేసిందని" కేసీఆర్ అన్నారు.

ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొనాలని పార్టీ క్యాడర్‌ను బీఆర్‌ఎస్ చీఫ్ కోరారు. రైతుల న్యాయమైన డిమాండ్‌ల కోసం వారి పక్షాన పోరాడాలని, వరి ధాన్యం కొనుగోళ్లతో సహా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు పార్టీ నిబద్ధతను తెలియాజేయాలని క్యాడర్ కి సూచించారు.

“మన రైతులకు సంఘీభావంగా, వారు ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలి. రైతుల హక్కులను పరిరక్షించడానికి BRS తన నిబద్ధతలో దృఢంగా ఉంది. వారితో కలిసి పోరాడుతూనే ఉంటుంది” అని కేసీఆర్ అన్నారు, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి BRS నాయకులు ప్రతిరోజూ హార్వెస్టింగ్, స్టోరేజీ పాయింట్లతో పాటు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని కోరారు.

Read More
Next Story