
‘రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు’
ప్రభుత్వమే ధ్వంసం చేస్తూ పర్యావరణ వినాశనంవైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో వనజీవి రామయ్యలు వేల సంఖ్యలో రావాలని అన్నారు కేసీఆర్.
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న నినాదాన్ని తన జీవన నాదంగా మార్చుకున్న వ్యక్తి వనజీవి రామయ్య. ఆయన మరణంపై పర్యావరణ ప్రియులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని అన్నారు. పర్యావరణ రక్షణ కోసమే ఆక్ష్న బతికిన వనజీవి రామయ్య మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకున్న వ్యక్తి ఆయన కోటికి పైగా మొక్కలు నాటి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారాయన. పచ్చదన ప్రాముఖ్యతను చాటి చెప్పాలన్న ఆయన ధ్యేయం మహోన్నతమైనది’’ అని కేసీఆర్ కొనియాడారు.
అనంతరం పచ్చని అడవులను రక్షించాల్సిన ప్రభుత్వమే ధ్వంసం చేస్తూ పర్యావరణ వినాశనంవైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో వనజీవి రామయ్యలు వేల సంఖ్యలో రావాలని అన్నారు కేసీఆర్. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.