కవిత పోస్టర్ నుండి కేసీఆర్ మాయం
x
Kavitha Jana Jagruthi poster

కవిత పోస్టర్ నుండి కేసీఆర్ మాయం

బీఆర్ఎస్ అధినేతగా కాకపోయినా తండ్రిగా కేసీఆర్ ఫొటోను పెట్టుకునే అవకాశముంది


బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి బుధవారం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత(Kavitha) ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఏమిటంటే అక్టోబర్ 25, 2025 నుండి ఫిబ్రవరి 13,2026 వరకు తెలంగాణలో యాత్ర చేయబోతున్నారు. అన్నీవైపుల నుండి కవితపై బీఆర్ఎస్(BRS)బాణాలు ఎక్కుపెడుతోంది కదా వాటిని తట్టుకుని నిలబడాల్సిన అవసరం చాలావుంది. కవితపైన కాంగ్రెస్, బీజేపీ కన్నా బీఆర్ఎస్సే ఎక్కువ ఆరోపణలు చేస్తోంది. తనను తాను ప్రూవ్ చేసుకుని జనాల్లో నిలబడేందుకు కవిత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సుమారు 112 రోజుల యాత్రను కవిత ప్రారంభించబోతున్నారు. మధ్యలో అక్కడక్కడ గ్యాప్ వచ్చినా మొత్తం 33 జిల్లాల్లోను యాత్రలు చేయటానికి కవిత రెడీ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో ఈరోజు విడుదలచేసిన యాత్రలో తన ఫొటో కేసీఆర్ ఫొటో ఎక్కడా కనబడలేదు. ఎల్లో కలర్ పోస్టర్ లో ఎడమవైపు కార్నర్లో పైన జై తెలంగాణ అని, అలాగే కుడిపైపు కార్నర్లో చివర జై జాగృతి అని నీలిరంగు అక్షరాలున్నాయి. రెండుఅక్షరాలకు మధ్యలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయ్ శంకర్ బొమ్మలు చిన్నవిగా కనబడుతున్నాయి. మధ్యలో కవిత పెద్ద ఫొటోలో కనబడుతున్నారు. ఫొటోలో ఆకుపచ్చ రంగులో ‘జాగృతి జనంబాట’ అని తెల్లటి అక్షరాలున్నాయి. దానికింద నీలిరంగులో ‘మేథావులతో సమాలోచన-ప్రజలతో మమేకం’ అని రాసుంది. దానికింద నీలంరంగు స్ట్రిప్ లో యాత్ర మొదలయ్యే, ముగిసే తేదీలున్నాయి. దానికింద ఎర్రటి అక్షరాల్లో తెలంగాణ జాగృతి అనుంది. తెలంగాణ-జాగృతి అనే ఎర్రటి అక్షరాల మధ్యలో ఆకుపచ్చ రంగులో తెలంగాణ మ్యాప్ దాని మధ్యలో దీపం కనబడుతోంది.

పోస్టర్ మొత్తంమీద తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బొమ్మ ఎక్కడా కనబడలేదు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసింది కాబట్టి అధినేత కేసీఆర్ ఫొటో ఉపయోగించలేదని సమర్ధించుకున్నారు. అయితే కవిత వాదనలోని డొల్లతనం కనబడుతోంది. ఎలాగంటే బీఆర్ఎస్ అధినేతగా కాకపోయినా తండ్రిగా కేసీఆర్ ఫొటోను పెట్టుకునే అవకాశముంది. ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోను వేసినపుడు తండ్రి కేసీఆర్ ఫొటోను వాడుకోవటంలో తప్పులేదు, వేస్తే అడిగే వాళ్ళు కూడా లేరు. అయినా కేసీఆర్ ఫొటోను పోస్టర్లో కవిత ఉపయోగించాలని అనుకోలేదు.

ఎందుకంటే తండ్రి మీద కూడా కవితకు బాగా మండుతోంది. దగ్గరి బంధువులు తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ లాంటి వాళ్ళ చెప్పుడుమాటలు విని, వాళ్ళచేతుల్లో కేసీఆర్ బంధీగా మారిపోయారని కవితకు బాగా కోపంగా ఉంది. చెప్పుడుమాటలు వినే తనను చివరకు పార్టీనుండి సస్పెండ్ చేసినట్లు కేసీఆర్ పై బాగా కోపంగా ఉన్నారు. చెప్పుడుమాటలు విని సొంతబిడ్డ అయిన తనను కూడా కేసీఆర్ దూరంగా పెట్టారని కవిత గతంలో చాలా ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. సొంతబిడ్డనే పరాయిదాన్ని అయిపోయానని కవిత మీడియా ముందే కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలున్నాయి. తండ్రి-కూతురు వ్యవహారం ఎంతదాకా వెళ్ళింది అంటే కవితను ఫామ్ హౌసులోకి అడుగుకూడా పెట్టనీయనిలేదు. పదిమందితో కలిసి కవిత ఫామ్ హౌస్ కు వస్తే కేసీఆర్ కనీసం చూడటానికి కూడా ఇష్టపడలేదు. చిన్నకొడుకు అమెరికాకు వెళుతున్నపుడు ఆశీస్సులు కావాలని ఫామ్ హౌస్ కు వచ్చిన కవితను తండ్రి బెడ్ రూమ్ బయటే ఆగిపోవాల్సొచ్చింది. కేవలం మనవడిని మాత్రమే గదిలోకి పిలిపించుకున్న విషయం స్వయంగా కవితే చెప్పారు.

పార్టీలో తనకు చోటులేదని తేలిపోయిన తర్వాతే కాళేశ్వరం అవినీతి, అక్రమాల్లో హరీష్, సంతోష్ తదితరుల పాత్రుందని మీడియా సమావేశంలో చెప్పారు. దాని ఫలితంగానే పార్టీనుండి కవిత సస్పెన్షన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ మాత్రం మంచోడు మిగిలిన వాళ్ళంతా చెడ్డోళ్ళని కవిత పదేపదే చెబుతుండటం. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళో తెలుసుకోలేని స్ధితిలో కేసీఆర్ దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారా ? కుటుంబంలో కేటీఆర్ తో ఎప్పుడో, ఎక్కడో కవితకు చెడింది. దాంతో కవిత-కేటీఆర్ అని తేల్చుకోవాల్సిన పరిస్ధితుల్లో సహజంగానే కేసీఆర్ కొడుకు కేటీఆర్ వైపు మొగ్గుచూపించి కూతురును దూరం పెట్టేశారు. దాన్ని తట్టుకోలేకే సమానత్వం కోసం పోరుబాటబట్టి చివరకు పార్టీనుండి సస్పెండ్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే కవిత తాజాగా ఆవిష్కరించిన జాగృతి జనంబాట పోస్టర్లో కేసీఆర్ ఫొటో మాయమైపోయింది.

Read More
Next Story