KCR fever |అంతా కేసీఆర్ ‘జ్వరం’మీదే ఆధారపడుందా ? ..ఆందోళనలో నాయకత్వం
x
BRS chief KCR

KCR fever |అంతా కేసీఆర్ ‘జ్వరం’మీదే ఆధారపడుందా ? ..ఆందోళనలో నాయకత్వం

బహిరంగసభకు కరీంనగర్ నే ఎందుకు కేసీఆర్ ఎంచుకున్నారంటే ఇక్కడ బీసీల జనాభా చాలా ఎక్కువ


బహిరంగసభ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో జ్వరం పెరిగిపోతున్నట్లుంది. ఈనెల 14వ తేదీన కరీంనగర్లో బీసీల రిజర్వేషన్(BC Reservations) అంశంపై భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ డిసైడ్ చేసింది. రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీజేపీ(BJP)లకు ధీటైన జవాబుచెప్పాలన్నది నాయకత్వం ఆలోచన. అందుకనే బహిరంగసభను ఏరికోరి కరీంనగర్(Karimnagar) ను ఎంపికచేసుకుంది. కరీంనగర్ ఒకరకంగా కేసీఆర్(KCR) కు అచ్చొచ్చిన పట్టణమనే చెప్పాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో కరీంనగర్లో గంగుల కమలాకర్, హుజూరాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చొప్పదండిలో మేడిపల్లి సత్యం, మానుకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ ఎంఎల్ఏలున్నారు.

బహిరంగసభకు కరీంనగర్ నే ఎందుకు కేసీఆర్ ఎంచుకున్నారంటే ఇక్కడ బీసీల జనాభా చాలా ఎక్కువ. ఎలాగూ నిర్వహించబోయేది బీసీల రిజర్వేషన్ అంశంమీదే. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఎంఎల్ఏ, మాజీమంత్రి కమలాకర్ కూడా బీసీ నేతే. కాబట్టి అన్నీ విధాలుగా బహిరంగసభ సక్సెస్ అవుతుందనే కరీంనగర్ ను కేసీఆర్ ఎంపికచేశారు. అయితే సడెన్ గా కేసీఆర్ కు జ్వరం మొదలైంది. నాలుగురోజులుగా కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారనే విషయం నేతలు, క్యాడర్లో టెన్షన్ పెంచేస్తోంది. జ్వరమైనా కేసీఆర్ సభకు హాజరవుతారనే ప్రచారం కూడా జరుగుతున్నా అది అనుమానంగానే ఉంది. ఎందుకంటే గడచిన నెలరోజుల్లో వైరల్ ఫీవర్ కారణంగా కేసీఆర్ మూడుసార్లు ఆసుపత్రిలో చేరారు. ఇపుడు అధినేత ఫామ్ హౌస్ లోనే ఉన్నప్పటికీ జ్వరంతోనే నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీవర్గాల టాక్.

14వ తేదీకి కేసీఆర్ జ్వరం పెరిగిపోతే బహిరంగసభకు హాజరుకాలేరు. ఇపుడు వాతావరణం కూడా బావోలేదు. కాబట్టి కేసీఆర్ అనారోగ్యంపై భారీవర్షాల ప్రభావం ఎంతోకొంత పడుతుంది. కేసీఆర్ గనుక బహిరంగసభకు హాజరుకాకపోతే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే, ఏమీలేదు సభ ఫ్లాప్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ బహిరంగసభ అంటే వచ్చేజనాలు కేసీఆర్ కోసమే వస్తారు. అలాంటిది సభకు కేసీఆర్ రావటంలేదన్నా, వచ్చేది అనుమానమే అన్నా కూడా జనాలు హాజరయ్యేది డౌటే. ఇదేజరిగితే బీఆర్ఎస్ బహిరంగసభ ఫ్లాప్ అన్న ప్రచారం బాగా పెరిగిపోతుంది. ఆనెగిటివ్ ప్రచారం పార్టీ భవిష్యత్ మీద తీవ్రంగానే పడుతుంది.

అసలే ఇపుడు పార్టీ పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. ఒకవైపు కల్వకుంట్ల కవిత తిరుగుబాటుతో పార్టీలో గందరగోళంగా ఉంది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై కమిషన్ల విచారణలు, కేసుల విచారణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంకోవైపు పార్టీని వదిలిపెడుతున్న గువ్వల బాలరాజు లాంటి నేతలు. చివరగా కేసీఆర్ పైన ఎనుముల రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ పెరిగిపోతోంది. ఇన్నిసమస్యల మధ్య కరీంనగర్ బహిరంగసభ సక్సెస్ అయితేనే నేతల్లో ఎంతోకొంత ఆత్మవిశ్వాసం నిలుస్తుంది. ఏ కారణం వల్లయినా సభ ఫెయిలైతే పార్టీని వదిలేసే మాజీ ఎంఎల్ఏలు, ద్వితీయశ్రేణి నేతల జాబితా పెరిగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

కాబట్టి కరీంనగర్ బహిరంగసభ సక్సెస్ అన్నది కేసీఆర్ జ్వరంమీదే ఆధారపడుంది. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి కేసీఆర్ బహిరంగ వేదికల మీద కనబడ్డది చాలా తక్కువ. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంచేసినా పాల్గొన్న బహిరంగసభలు తక్కువే. ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన 17 సీట్లలోనూ ఒక్కదానిలో కూడా గెలవకపోవటం తీవ్రమైన ప్రభావం చూపింది. ఎన్నికల ఫలితాలతో బహుశ కేసీఆర్ మానసికంగా బాగా దెబ్బతిన్నట్లున్నారు. అందుకనే అప్పటినుండి ఫామ్ హౌసుకు మాత్రమే పరిమితమైపోయారు. ఈమధ్య హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బహిరంగసభ నిర్వహించినా కేసీఆర్ ప్రసంగం జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈవిషయాన్ని స్వయంగా కేసీఆర్ కు రాసిన లేఖలో కవితే చెప్పింది. ఎల్కతుర్తి సభ తర్వాత పార్టీ ప్లాన్ చేసింది కరీంనగర్ బహిరంగసభే. అందుకనే అందరిలోను కేసీఆర్ జ్వరంపై టెన్షన్ పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Read More
Next Story