కేసీయార్ ఇంత భయపడుతున్నారా ? ఇదే నిదర్శనమా ?
నో డౌట్ కేసీయార్ భయపడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది.
నో డౌట్ కేసీయార్ భయపడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది. విద్యుత్ రంగంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దుచేయాలని కేసీయార్ హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
అన్నీ కోణాల నుండి వినిపిస్తున్న ఆరోపణల్లో నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ ఇప్పటికే కేసీయార్ హయాంలో జెన్కో, డిస్కంల్లో పనిచేసిన విద్యుత్ ఉన్నతాధికారులతో పాటు అప్పట్లో విద్యుత్ ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను కూడా విచారించింది. విద్యుత్ రంగంలోని నిపుణులతో పాటు సంబంధమున్న అనేకమంది ఇంజనీర్లు, రిటైర్డ్ ఉన్నతాధికారులు కూడా విచారణకు హాజరై తమ వాగ్మూలాలను ఇచ్చారు. కేసీయార్ ఒంటెత్తుపోకడల వల్ల ప్రభుత్వంపై సుమారు రు. 6 వేల కోట్ల అదనపు భారం పడిందన్న విషయాన్ని నిపుణులు ఉదాహరణలతో సహా కమిషన్ కు అందించారు. ఇందులో భాగంగానే కమిషన్ విచారణకు హాజరుకావాలంటు కేసీయార్ కు నోటీసు ఇచ్చింది. అయితే కమిషన్ నోటీసు ప్రకారం కేసీయార్ విచారణకు హాజరుకాలేదు.
విచారణకు హాజరుకాకపోవటం ఒకఎత్తయితే కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తు కేసీయార్ 12 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో నరసింహారెడ్డి పైన అనేక ఆరోపణలు చేశారు. కమిషన్ ఛైర్ పర్సన్ గా ఉండే అర్హత నరసింహారెడ్డికి లేదని కేసీయార్ తేల్చేశారు. అంతటితో ఆగని కేసీయార్ నరసింహారెడ్డిని ఛైర్మన్ గా దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. నరసింహారెడ్డికి లేఖ రాయటమే కాకుండా దాన్ని మీడియాకు లీక్ కూడా చూశారు. దాంతో కేసీయార్ విచారణ వ్యవహారంపై అందరిలోను ఆసక్తి పెరిగిపోయింది. కేసీయార్ లేఖ నేపధ్యంలో ఛైర్మన్ ఏమిచేస్తారనే సస్పెన్స్ పెరిగిపోతోంది. లేఖపైన జస్టిస్ స్పందిస్తు ప్రొసీజర్ ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.
ఈ నేపధ్యంలోనే కేసీయార్ కమిషన్ ఏర్పాటును ప్రశ్నిస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. న్యాయనిపుణల ప్రకారం కేసీయార్ కు నోటీసులిచ్చి విచారణకు పిలిపించే అధికారం కమిషన్ కు ఉంది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి చంద్రకుమార్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘కమిషన్ నోటీసులకు కేసీయార్ సమాధానం చెప్పాల్సిందే’ అన్నారు. ‘కేసీయార్ ను అరెస్టుచేసి విచారణ చేసే అధికారం కమిషన్ కు ఉంటుంద’ని స్పష్టంచేశారు. సీనియర్ లాయర్ బీవీ కృష్ణయ్య మాట్లాడుతు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు. కమిషన్ విచారణకు హాజరుకాననేందుకు కేసీయార్ కు అవకాశంలేదన్నారు. ‘బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ నోటీసులిచ్చి కేసీయార్ ను విచారణకు పిలిపించే అన్నీ అధికారాలు కమిషన్ కు ఉన్న’ట్లు చెప్పారు.
బహుశా కమిషన్ అధికారాల పరిధిపై కేసీయార్ కూడా న్యాయనిపుణులతో చర్చించినట్లున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా కమిషన్ ఏర్పాటునే చాలెంజ్ చేస్తు కోర్టులో పిటీషన్ వేశారు. కమిషన్ తనను అరెస్టు చేస్తుందేమో అన్న భయం కేసీయార్లో పెరిగిపోతున్నట్లుంది. లేకపోతే కమిషన్ ఏర్పాటును ప్రశ్నించటమే కాకుండా ఛైర్మన్ గా నరసింహారెడ్డిని తప్పుకోమని డిమాండ్ చేసిన కేసీయార్ ఇంత సడన్ గా కోర్టులో పిటీషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? తనను విచారించే విషయంలో కమిషన్ కున్న అధికారాలపై కేసీయార్ కు క్లారిటి వచ్చుంటుంది. అందుకనే కమిషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. తనపైన వస్తున్న ఆరోపణలకు కమిషన్ ముందు హాజరై తన వాదన వినిపించే అవకాశం కేసీయార్ కుంది. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కమిషన్ ఏర్పాటును ప్రశ్నించటం, నరసింహారెడ్డిని ఛైర్మన్ గా దిగిపోమనటం నిజంగా అనవసరం. లేఖ రాసి మీడియాకు రిలీజ్ చేసి నానా కంపుచేసిన కేసీయార్ చివరకు కోర్టులో పిటీషన్ వేశారంటేనే ఎంత భయపడుతున్నారో అర్ధమైపోతోంది. మరి కేసీయార్ పిటీషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.