కేసీయార్ లక్కు బాగాలేదు పాక్షిక విజయమే
x
KCR

కేసీయార్ లక్కు బాగాలేదు పాక్షిక విజయమే

కేసీయార్ పైన వచ్చిన ఆరోపణలపై కమిషన్ విచారణ చేయవచ్చని సుప్రింకోర్టు తేల్చి చెప్పినట్లయ్యింది.


బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కు లక్కు బాగున్నట్లు లేదు. కోర్టులో సగం విజయం మాత్రమే దక్కింది. విద్యుత్ రంగంలో కేసీయార్ హయాంలో అవకతవకలు, అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. తనపై విచారణ జరిపేందుకు లేదని కేసీయార్ సుప్రింకోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రింకోర్టు కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డి స్ధానంలో మరొకరిని నియమించమని మాత్రమే చెప్పింది. అంటే కేసీయార్ పైన వచ్చిన ఆరోపణలపై కమిషన్ విచారణ చేయవచ్చని సుప్రింకోర్టు తేల్చి చెప్పినట్లయ్యింది.

విషయం ఏమిటంటే కేసీయార్ హయాంలో విద్యుత్ సరఫరా నిమిత్తం ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందం చేసుకున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ శాఖలపైనా సమీక్షలు చేసింది. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ పైన కూడా సమీక్ష జరిగింది. అప్పటికే ఆరోపణలు వినబడుతున్న విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులు అనేక వివరాలందించారు. దాని ప్రకారం విద్యుత్ శాఖ సుమారు రు. 80 వేల కోట్ల అప్పుల్లో ఉన్నట్లు తేలింది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరు ఆశ్చర్యపోయారు.

మరింత లోతుగా సమీక్షలు జరిపిన ప్రభుత్వానికి దిమ్మతిరిగే విషయాలు కనిపించాయి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం అనవసరంగా కేసీయార్ ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని, రెండు విద్యుత్ ఉత్పత్తిప్లంట్ల వల్ల పెద్దగా ఉపయోగంలేదన్న విషయం బయపడింది. దాంతో పదేళ్ళ హయాంలో బాగా అవినీతి జరిగిందని నిర్ణయానికి వచ్చిన రేవంత్ వెంటనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించారు. నరసింహారెడ్డి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆరోపణలపై శాఖలోని ఉన్నతాధికారులను, విద్యుత్ రంగంలోని నిపుణులను కూడా పిలిపించి విచారించారు. ఎవరేమి చెప్పినా కామన్ పాయింట్ ఏమిటంటే కేసీయార్ నిర్ణయాల్లో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయనే.

అందుకనే విచారణ నిమిత్తం కేసీయార్ కు కమిషన్ నోటీసులు జారీచేసింది. అయితే విచారణకు కేసీయార్ హాజరుకాకపోగా ఛైర్మన్ ను ఉద్దేశించి 12 పేజీల లేఖను రాశారు. అందులో జస్టిస్ ను తప్పుపట్టారు. కమిషన్ ఛైర్మన్ గా పనికేరారని కేసీయార్ తేల్చేశారు. విచారణకు వచ్చేదిలేదని తెగేసిచెప్పారు. మీడియాతో ఛైర్మన్ మాట్లాడిన మాటలు విన్న తర్వాత తాను తప్పుచేశానని నరసింహారెడ్డి అప్పటికే నిర్ణయానికి వచ్చినట్లుందని కేసీయార్ మండిపోయారు. కమిషన్ ఛైర్మన్ గా వెంటనే తప్పుకోవాలని నరసింహారెడ్డిని డిమాండ్ చేశారు. అయితే కేసీయార్ లేఖను పట్టించుకోని జస్టిస్ విచారణకు హాజరవ్వాలని రెండో నోటీసు జారీచేశారు. దాంతో వెంటనే నోటీసులను ఛాలెంజ్ చేస్తు హైకోర్టులో కేసు వేశారు. అయితే ఆ కేసును హైకోర్టు కొట్టేసింది. నరసింహారెడ్డిపై కేసీయార్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని అభిప్రాయపడింది.

ఇక లభంలేదని కేసీయార్ వెంటనే సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. కమిషన్ను రద్దుచేయాలని, తనపై జరిపేందుకు లేదని తన పిటీషన్లో కేసీయార్ చెప్పారు. అయితే కేసీయార్ వాదన అంతా విన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డిని తప్పించాలని ఆదేశించారు. ఛైర్మన్ గా నరసింహారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. న్యాయంచేయటమే కాకుండా న్యాయం చేస్తున్నట్లు కనిపించటం కూడా ముఖ్యమే అని చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి కమిషన్ కు కొత్త ఛైర్మన్ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో ప్రభుత్వం కూడా కమిషన్ కు కొత్త ఛైర్మన్ ను నియమించేందుకు అంగీకరించింది. ఇంతవరకు కేసీయార్ విజయం సాధించినట్లే అనుకోవాలి.

అయితే ఇదే సమయంలో తనపైన విచారణే జరిపేందుకు లేదన్న కేసీయార్ వాదనను చీఫ్ జస్టిస్ కొట్టేశారు. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి అన్నీ అధికారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. కాబట్టి కేసీయార్ పైన ఆరోపణలను కమిషన్ విచారిస్తుంది. కమిషన్ నోటీసుల ప్రకారం కేసీయార్ విచారణకు హాజరవ్వాల్సిందే అని చెప్పకనే సుప్రింకోర్టు చెప్పినట్లయ్యింది. అందుకనే కమిషన్ ముందు విచారణకు హాజరై కేసీయార్ తనపైన వస్తున్న ఆరోపణలు తప్పని నిరూపించుకోక తప్పదు.

Read More
Next Story