కెసిఆర్ కోలుకున్నారు, ఇక పార్టీ  కోలుకుంటుందా?
x

కెసిఆర్ కోలుకున్నారు, ఇక పార్టీ కోలుకుంటుందా?

కెసిఆర్ కోలుకున్నారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యూహాలు, బిజెపి ఎత్తుగడలు, పెరుగుతున్న మోదీ ఇమేజ్ మధ్య భారత్ రాష్ట్ర సమితి ఒక నాటి టిఆర్ ఎస్ లాగా బలపడుతుందా.


భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) అధినేత కెసిఆర్ కోలుకుని పార్లమెంటు ఎన్నికలకు పార్టీ ని సమాయత్తం చేయాలన్న రెన్నెళ్ల ఎదురుచూపులు ఫలించాయి. పార్టీ పరాజయం, ఆ తర్వాత తుంటి ఎముకకు చికిత్సతో కెసిఆర్ ఇంటికే పరిమితం కావడంతో పార్టీ కళ తప్పింది. ఆయన లేని లోటు కనిపించకుండా ఉండేందుకు కెసిఆర్ కుమారుడు, కెటి రామారావు, మేనల్లుడు టి హరీష్ రావు చాలా కష్టపడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్లు విపరీంగా విమర్శులు కుప్పించారు. ఫెయిల్ అన్నారు, ఆర్నెళ్లే గడవు అన్నారు. డీలా పడిన బిఆర్ ఎస్ కార్యకర్తలో జోష్ నింపేందుకు అనేక సమావేశాలు నిర్వహించారు. అయినా సరే కెసిఆర్ లేని లోటు తీరలేదు. కెసిఆర్ కనిపించకుండా, వినిపించకుండా పోవడం పార్టీని కుదిపేసింది.


ఒక విధంగా చెబితే, బిఆర్ ఎస్ కళ తప్పిందనక తప్పదు.కెసిఆర్ ఇలాగే మరికొంత కాలం విశ్రాంతి తీసుకుంటే చాలా నష్టం జరుగుతుందున్న భయాలు నాయకుల్లో మొదలయ్యాయి. మరొక వైపు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లను వెనక్కు తీసుకునేందుకు రేవంత్ టీమ్ పని చేస్తూఉంది. అపుడే కొంత మంది బిఆర్ ఎమ్మెల్యేలు ‘నియోజకవర్గం అభివృద్ధి’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం బాగా వివాదాస్పదమయింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం నుంచి , కాంగ్రెస్ నుంచి గోడదూకి అప్పటి టిఆర్ ఎస్ లో జంప్ అయిన వాళ్లంతా 'నియోజకవర్గం అభివృద్ది' అనే మాటే వాడారు. దీనితో రకరకాల ఉహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లోకి రివర్స్ మైగ్రేషన్ మొదలయిందన్నారు. ఇలాంటపుడు కెసిఆర్ కోలుకుని, ఇల్లొదలి బయటకు రావడం పార్టీని ఉత్సాహపరిచింది. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం కూడా పార్టీని నమ్ముకున్న వారిలో ఉత్సాహాన్ని నింపింది.


కాలి తుంటికి శస్త్రచికిత్స కావడంతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌ రెండు నెలల తర్వాత బయటకొచ్చారు. గజ్వేల్‌ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్‌... ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి వచ్చిన ఆయనతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు.


గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో... స్పీకర్ గడ్డం ప్రసాద్‌ తన కార్యాలయంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం అనంతరం అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్‌ఎల్పీ లీడర్‌గా బాధ్యతలు తీసుకున్నారు.




డిసెంబరు 3న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో BRS 39 స్థానాలకే పరిమితమైంది. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ అధికారం చేపట్టగా... అదే నెల 9న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయన కాలుకి సర్జరీ జరగ్గా... కేసీఆర్‌ అందరూ ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణం చేయలేదు. తాజాగా కోలుకొన్న గులాబీ బాస్‌ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు.

1985 లో తొలిసారి ఎమ్మెల్యేగా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టారు కేసీఆర్‌. ఎమ్మెల్యేగా, ఎంపీగా చట్ట సభలకు వరుసగా ఎన్నికవుతున్నారు. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు ఎన్నిక కాగా, గజ్వేల్ నుంచి 2014 నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ ఎంపీగా కూడా ఆయన గెలుపొందారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించిన ఆయన గురువారం ప్రమాణం చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత కేసిఆర్ బయటకు రావడంతో నేతలు ఆయన్ను కలుసుకొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

కెసిఆర్ కోలుకున్నారు. అయితే, రేవంత్ రెడ్డి వ్యూహాలు, బిజెపి ఎత్తుగడల మధ్య, పెరుగుతున్న మోదీ ఇమేజ్ మధ్య భారత్ రాష్ట్ర సమితి ఒక నాటి తెలంగాణ రాష్ట్ర సమితిలాగా బలపడుతుందాఅనేది ప్రశ్న.

Read More
Next Story