కేసీఆర్‌కు కోపమొచ్చింది
x
కేసీఆర్

కేసీఆర్‌కు కోపమొచ్చింది

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. వందరోజుల్లో రాష్ట్రానికి దుర్బర పరిస్థితి పట్టించారని ఆగ్రహించారు.


పంట పొలాలకు సాగు నీరందక పంట ఎండి పోతోందని తెలంగాణ రైతులు కలత చెందుతున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కోపమొచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన బయటకు వచ్చారు. జిల్లాల పర్యటన చేపట్టారు. రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, పంటలు ఎండిపోయాయని, తెలంగాణ అభివృద్ధిలో తిరోగమనం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తొలిరోజు జిల్లాల పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వం మారిన వందరోజుల్లోనే ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ఆ ఆలోచనతోనే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలను కోరారు.

‘‘మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. ప్రభుత్వం మారిన కొన్నాళ్లలోనే ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారణాలేంటి? రైతుల కష్టాలు కడలిలా ఎందుకు మారాయి? అసలు ఏం జరిగిందని రైతులను ప్రశ్నిస్తే.. నీళ్లు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని చెప్తున్నారు. నీళ్లు రావడం కష్టం అని ముందే చెప్పి ఉంటే అసలు పంట వేసేవాళ్లం కాదని రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ రైతులు ఇబ్బందులు పడలేదు. అన్ని వేళల్లో కూడా రైతులకు అనుకూలమైన విధానాలనే బీఆర్ఎస్ తీసుకొచ్చింది. రైతుబంధు పేరిట వారికి అండగా నిలిచింది. మా హయాంలో తెలంగాణలో వ్యవసాయం అత్యద్భుతమైన దశకు చేరింది. ఇప్పుడు అదే వ్యవసాయం అధఃపాతాళానికి వెళ్తుందేమో అన్న ఆందోళన కలుగుతుంది’’అని కేసీఆర్ చెప్పారు.
హోరుమంటున్న పొలం బోర్లు
తెలంగాణలో పొలం బోర్లు బంద్ అయ్యి 8ఏళ్లు అయిందని, ఇప్పుడు ఎక్కడ చూసిన పల్లెల్లో బోర్ల హోరే వినిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రస్తుత ప్రభుత్వం తెలివి తక్కువ తనమీ ప్రధాన కారణమని మండిపడ్డారు. ‘‘అద్భుతమైన తెలంగాణకు వందరోజుల్లోనే అదోగది పడుతుందని అనుకోలేదు. ఇప్పటికి కూడా సాగర్‌లో 14-15 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ఆపని ఎందుకు చేయట్లేదు. ఏం అడిగినా కేఆర్ఎంబీ అంటున్నారు’’అని చురకలంటించారు. అసలు కేఆర్ఎంబీ అంటే ఎవరని కేసీఆర్ ప్రశ్నించారు.
సీఎంకు ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయ్
‘‘కేఆర్ఎంబీ ఏమైనా సూపర్ బాసా? కేంద్రమంత్రులు తియ్యగా మాట్లాడగానే తమను తాము మైమరిచి పోయి అన్ని ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు తామేం చేయలేమని, అంతా బీఆర్ఎస్ చేసిందని మాపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎంకు ఉన్న సమయంలో ఢిల్లీకి వెళ్లడానికే సరిపోతుంది. ఇంక రాష్ట్రం, రైతుల గురించి ఏం పట్టించుకుంటారు. చిల్లర రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలే చేద్దాం.. అభివృద్ధి వద్దంటే మస్తుగా చేద్దాం. అధికారం వస్తుంటుంది.. పోతుంటుంది. బీఆర్ఎస్ అనేది సముద్రమంత పార్టీ.. మా నుంచి ఒక్కరినో ఇద్దరినో నేతలను లాక్కుని ఏదో సాధించేశామని అనుకోవద్దు. బీఆర్ఎస్‌లో ఎప్పటికప్పుడు నేతలు పుట్టుకొస్తుంటారు’’అని సీఎం రేవంత్ టార్గెట్ విమర్శలు గుప్పించారు.
కానరాని కరెంట్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో కరెంటు కోతలు జరిగితే వార్తగా మారేదని, కానీ ఇప్పుడు ఎక్కడైనా కరెంటు ఉంటే వార్తగా మారుతుందని సెటైర్లు వేశారు. ‘‘అగ్రగామిగా ఉన్న రాష్ట్రంలో అంధకారం ఎందుకు అలుముకుంటుంది? ఈ రాష్ట్ర అభివృద్ధి రికార్డుకు ఎందుకు చెదలు పట్టాయి? ఇందుకు ప్రభుత్వ అసమర్థత, అలసత్మం కారణం కాదా? హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా మేము మారిస్తే.. ఇప్పుడు పవర్ లెస్ సిటీగా మార్చారు. రాత్రింబళ్లు పోరాడి నేషనల్ పవర్ గ్రిడ్‌కు హైదరాబాద్‌ను అనుసంధానం చేయించాం. ఒక్క క్షణం కూడా కరెంట్ కట్ లేకుండా జాగ్రత్తులు తీసుకున్నాం. కానీ ఇప్పుడు కరెంటు అంటే తెలియని కాలానికి వెళ్లినట్లు మారిపోతయింది రాష్ట్రంలో పరిస్థితి’’అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.
చూస్తూ ఉండలేకే ప్రశ్నిస్తున్నా
ప్రభుత్వం మారిన తర్వాత కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడినా తాను పట్టించుకోలేదని, నోరు మెదపకుండా చూస్తూ ఊరుకున్నానని కేసీఆర్ చెప్పారు. ‘‘కానీ ఇప్పుడు ఎకరాలకు ఎకరాల పచ్చని పొలాలు ఎండుతుంటే చూస్తూ కూర్చోలేను. అందుకే ప్రశ్నిస్తున్నా.. రైతులను ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. రాత్రింబవళ్లు పోరాడి మీకు నిద్ర లేకుండా చేస్తాం. పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు అతికి పోవద్దు.. మీ డ్యూటీని మీరు చేయండి. మేము కూడా ఇలానే చేసి ఉంటే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది ఉండేది కాదు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులను నేను ఒక్కటే కోరుతున్నా.. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు’’అని కోరారు కేసీఆర్.
కేసీఆర్ పర్యటన వివరాలు
లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. జిల్లాల పర్యటనను ఈరోజు ఉదయం మొదలుపెట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు రైతులతో ముచ్చటించారు. రైతన్నల కన్నీళ్లు తుడికి వాళ్లలో ధైర్యాన్ని నింపడానికే ఆరోగ్యం సహకరించకున్నా కేసీఆర్.. ప్రజల్లోకి వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటన కోసం తన కుటుంబీకులతో దట్టీ కట్టించుకుని, అభిమాన కార్యకర్తల నడుమ కేసీఆర్.. బస్సెక్కి తన పర్యటనను ప్రారంభించారు. ఆయన నేరుగా జనగామ జిల్లా దేవరుప్పల దరావత్ తండాను సందర్శించారు. ఇందులో భాగంగానే ఉదయం 10:30 గంటలకు ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. 11:30 గంటలకు అర్వపల్లి, తుంగతుర్తి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 1:30 గంటకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడే భోజనం చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిడమనూరులో పర్యటించారు.


Read More
Next Story