
భేటీలతో కేసీఆర్ బిజీ బిజీ..!
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇప్పుడున్నంత బిజీగా ఎప్పుడూ లేరనే చెప్పాలి. వరుస భేటీలతో ఆయన పదిరోజులుగా బిజీబిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీ కార్యకర్తలు, నేతలకు కూడా అందుబాటులో లేకుండా.. ఏదో ఒక సందర్భంగా మీటింగ్ పెట్టినప్పుడో, సభ పెట్టాల్సి ఉంటేనో కలిసే కేసీఆర్.. ఇప్పుడు మాత్రం ప్రతి రోజూ భేటీలు నిర్వహిస్తూ చాలా బిజీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును రెండు నెలలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే కమిషన్.. కేసీఆర్, హరీష్ రావు, ప్రస్తుతం బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చింది. జూన్ నెలలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. దీంతో అలెర్ట్ అయిన కేసీఆర్, హరీష్ వరుసగా భేటీలు అయ్యారు.
కమిషన్ నోటీసులు వచ్చిన మరుసటి రోజే హరీష్ రావు.. ఆఘమేఘాలపై ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో సుమారు రెండు గంటలపాటు భేటీ అయ్యారు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారు అనేది పార్టీ వర్గాలకు కూడా తెలియదేమో అన్నంత రహస్యంగా జరిగిందా భేటీ. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్‌తో హరీష్ రావు మరోసారి ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాట పట్టారు. అప్పుడు కూడా అంతే రెండు గంటల పాటు వారు చర్చించుకున్నారు. ఆ సమయంలో కమిషన్ నోటీసులు ఇచ్చి ఉండటంతో.. వాటిని ఎలా ఎదుర్కోవాలి? అన్న అంశంపైనే కేసీఆర్, హరీష్ రావు చర్చించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పుడేమో తన కుమార్తె కవిత రాసిన ఆరు పేజీల లేఖ సంచలనం రేకెత్తించడం, ఆమె కొత్త పార్టీ పెట్టే ప్లాన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో కేసీఆర్.. కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇలాంటి సమయంలో తండ్రీకొడుకుల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. వీరు దేనిగురించి చర్చించుకున్నారని అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేసీఆర్‌ను భేటీల్లో బిజీగా చూడటం ప్రభుత్వం మారిన తర్వాత ఇదే మొదటి సారి.
కవితపైనే చర్చా..!
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ టాపిక్‌గా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ విషయంపైనే స్పందిస్తున్నాయి. అమెరికా నుంచి తిరిగి రాగానే ఎయిర్‌పోర్ట్‌లో కవిత చేసిన వ్యాఖ్యలు మరింత కీలకంగా మారాయి. దీంతో కవిత విషయంలో ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్ భావిస్తున్నారని, ఆ విషయంపై మాట్లాడుకోవడానికే ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కవితను.. వార్నింగ్ ఇచ్చి వదిలేయాలా? లేదా పార్టీ నుంచి తొలగించాలా? క్రమశిక్షణ చర్యల పేరిట కొన్ని రోజుల పాటు పార్టీకి దూరంగా ఉంచి వ్యక్తిగతంగా మందలించాలా? అన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
జూన్ 2 కార్యక్రమాల గురించా..!
కాగా మరోవైపు కేసీఆర్, కేటీఆర్ భేటీలో రాజకీయం, కవిత అంశం ఏమీ లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయిందని చెప్తున్నారు.