
కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టుకు కేసీఆర్
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఛాలెంజ్ చేస్తూ రెండు పిటిషన్‌లు వేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఛాలెంజ్ చేయాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు డిసైడ్ అయ్యారు. అందుకే కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో ఇరువురూ వేరువేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఒకటి, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుందని వారు పిటిషన్‌లలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ పిటిషన్‌లు బుధవారం కోర్టు విచారణకు రావొచ్చని సమాచారం. అయితే కమిషన్ నివేదికను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆ తర్వాత దీనిని పబ్లిక్ డాక్యుమెంట్‌గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ కమిషన్ నివేదిక కాపీలు అందించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నివేదికను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది.
ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగాయాలేవా అనే అంశంపై పీసీ ఘోష్ కమిషన్ దాదాపు ఒకటిన్నర ఏడాది విచారణ జరిపింది. దాదాపు 120 మంది అధికారులను విచారించింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ వంటి పలువురు కీలక నేతలను కూడా విచారించి దాదాపు 650 పేజీల నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది. కాగా ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించడం కోసం త్రిసభ్య కమిటీ మరొకదాన్ని ఏర్పాటు చేసి పరిశీలింపజేసింది. అనంతరం ఆ నివేదికను 30 పేజీలను తగ్గించింది. ఇప్పుడు దానినే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దానిని అడ్డుకోవడానికే కేసీఆర్.. కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారన్న చర్చ కూడా మొదలైంది.