‘‘తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న 29 శాఖల్లో 22 శాఖలను మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా సమీక్షించలేదు’’ ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అంతేకాకుండా పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్.. ఒక ప్రజాప్రతినిధిలా కాకుండా భూస్వామిలా పాలన చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వంద రోజుల పాలనను ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా 12-14 సీట్లు గెలిచే విధంగా రేవంత్, కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. 2024లో మరోసారి 2004 చరిత్ర రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని సంస్థాగత యంత్రాంగాలను కేసీఆర్ ధ్వంసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
శాఖల్లో అసలేం జరుగుతుంది?
22 శాఖల్లో సమీక్ష నిర్వహించామని కేసీఆర్ చెప్పినవన్నీ అవాస్తవాలేనని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా కేసీఆర్.. శాఖల సమీక్ష చేయలేదు. రాష్ట్రంలో ఉన్న 29 శాఖల్లో అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ శాఖలకు సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటివరకు ముట్టుకున్నట్లు కూడా లేదు. ప్రతి ఒక్కదాన్ని క్రమబద్దీకరించడమే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ముందు ఉన్న అసలు పెద్ద సవాల్ ఇదే. ఇందుకు సమర్థులైన అధికారులను నియమించడంపై దృష్టి పెట్టాం. తనకు డబ్బు తెచ్చిపెట్టే శాఖల గురించే కేసీఆర్ ఆలోచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలోకి వెళ్తున్నా కేసీఆర్ తన సొంత లాభంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రుణాలను భరించడానికి ప్రతి ఏటా మాకు రూ.77 వేల కోట్లు కావాలి. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లు చెల్లించడానికి రూ.55 వేల కోట్లు అవసరం’’ అని రేవంత్ వెల్లడించారు.
ఆ డబ్బంతా ఏమైందో
‘‘రాష్ట్రంలో పెరిగిన ఆదాయం అంతా ఏమైంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. ఎన్నికల ముందు ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వం అధికంగా ఆదాయం పొందిందన్నది వాస్తవం. ఆ డబ్బంతా ఏమైందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సేవా రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆదాయ రంగంలో ఉన్న లొసుగులను పరిష్కరించి రాష్ట్ర ఆదాయాన్ని నెలల వ్యవధిలోనే కొంత పెంచాం’’ అని వివరించారు. అంతేకాకుండా తొలిసారి పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులను ఇచ్చామని, వారిని నియమించడంలో వారి నేపథ్యం కన్నా పనితీరుకే ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.
నేను సిఫార్సే చేయగలను
‘‘కాంగ్రెస్ అనేది ఒకే వ్యక్తి అన్ని నిర్ణయాలు తీసుకోగలిగిన ఓ ప్రాంతీయ పార్టీ కాదు. నేను కేవలం అభ్యర్థులను రికమెండ్ చేయడం, సహచరులతో చర్చించడం మాత్రమే చేయగలను. తుది నిర్ణయం ఎప్పుడూ పార్టీ హైకమాండ్‌దే ఉంటుంది. కేసీఆర్ తరహాలో నాకు.. పార్టీ, ప్రభుత్వం, కుటుంబం మూడు ఒకటి కాదు. వీటిని అవి ఎలా ఉండాలో అదే విధంగా వేరువేరుగా ఉంచాను. మా ముందు ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు చెప్పిన ప్రతిదాన్నీ చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒకదాని తర్వాత ఒకటిగా అమలు చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీదంతా బూటకమే
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామంటున్న బీజేపీ వ్యాఖ్యలన్నీ బూటకాలేనంటూ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము కచ్ఛితంగా 400 మార్క్‌ను అందుకుంటామని బీజేపీకి అంత నమ్మకం ఉంటే దేశమంతా పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకు పరుగులు పెడుతున్నారు. జేడీ(యూ), జేడీ(ఎస్), టీడీపీ ఇంకా చిన్నచిన్న పార్టీలతో పొత్తులు వాళ్లకెందుకు? 2019 ఎన్నికలప్పుడు బీజేపీ ఇప్పటి మాదిరిగా పొత్తుల కోసం పరుగులు తీయలేదు. మరి ఇప్పుడెందుకు పొత్తుల కోసం తొందరపడుతుంది. 2014లో బీజేపీకి తమ గెలుపుపై నమ్మకం అంతగా లేదు. అప్పుడు పొత్తుల కోసం దేశమంతా కలియతిరిగారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకే లేదు. వాళ్లు తాము చెప్పుకుంటున్నంత బలంగా లేరు’’అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాలన కష్టంగానే ఉంది
అనుభవం లేనందున ప్రభుత్వాన్ని నడపడం రేవంత్‌కు కష్టమైన పనే అన్న అంశంపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అవును ప్రభుత్వాన్ని నడపడం కష్టంగానే ఉందని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉండటానికి నా అనుభవలేమి కారణం కాదు. నేను ప్రతిపక్షంలో చాలా కాలం ఉన్నాను. అన్ని సమస్యలు వివరంగా తెలుసు. దానికి తోడుగా నాకు ఎంతో అనుభవం ఉన్న గ్రూప్ ఉంది. గత ప్రభుత్వం చేసిన దారుణ పాలన వల్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం కష్టంగా ఉంది. అప్పటి సీఎం కేసీఆర్ ఏమీ చేయలేదు. పదేళ్లలో ఒక్కసారి కూడా శాఖల సమీక్ష నిర్వహించలేదు’’
సమీకరణాలను బీఆర్ఎస్ మార్చొచ్చు
‘‘లోక్‌సభ ఎన్నికలు జాతీయ సమస్యలపై జరుగుతాయి. కానీ వాటిలో స్థానిక వాసన తప్పక ఉంటుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల బరిలో సీరియస్‌గా పోటీ చేయాలని బీఆర్ఎస్ భావిస్తే కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలను వారు మార్చొచ్చు. కానీ అసలు పోరు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే జరుగుతుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా 12-14 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది’’ అని వెల్లడించారు.
ఓ ప్లాన్ ఉంది
ఒకవేళ తెలంగాణలో అధిక ఎంపీ సీట్లను బీజేపీ గెలిస్తే రాష్ట్రాన్ని మరో హిమాచల్ ప్రదేశ్‌గా కమలం పార్టీ మార్చేస్తుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ‘‘అంత అధిక సంఖ్యలో బీజేపీ సీట్లు రావడం చాలా కష్టం. ఒకవేళ నిజంగా వస్తే పీకే చెప్పినట్లే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వారికి చెక్ చెప్పడానికి ఒక మంచి వ్యూహం కావాలి. నా దగ్గర ఒక ప్లాన్ కూడా ఉంది. అందులో భాగంగానే పార్టీలో చేరాలని ఆసక్తి చూపుతున్న ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నాం. ఇంకా కొంతమంది మాతో టచ్‌లో ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌ను కూడా ఆహ్వానించాం. ఎంపీ టికెట్ ఇస్తామని, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అందిస్తామని ఆఫర్ చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్ గూటికి చేరారు’’అని తెలిపారు.
ఫోన్ టాపింగ్ పెద్ద సమస్యే
‘‘నిజంగా ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం బర్నింగ్ టాపిక్‌గా ఉంది. అసలు ఇది ఎలా బయటకు వచ్చింది. సస్పెండ్ అయిన డీఎస్‌పీ స్థాయి అధికారి హార్డ్ డిస్క్‌లను నాశనం చేయడానికి ప్రయత్నించి, వాటి ముక్కలను మూసీనదిలో పడేశారు. ఎన్నికల ముందు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ను ఎవరు ముందకు నడిపించారు? వారంతా కేసీఆర్ సన్నిహితులే. నాకు ఇది ముందు నుంచే తెలుసు. కానీ ఎవరినో టార్గెట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎన్నికల తర్వాత ఎస్‌ఐబీ ఛార్జ్ తీసుకున్న పోలీసు అధికారులు అంతా నాశనం చేయబడిందని గుర్తించారు. అప్పుడు పోలీసులకు నేను జోక్యం చేసుకోను మీరు ఏం చేయాలో అదే చేయండి అని చెప్పాను. ఇందులో జాతీయ స్థాయి భద్రత ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రాజకీయ ప్రతీకారంపై నాకెప్పుడూ ఆసక్తి లేదు. నేను పార్టీ, ప్రజలు, ప్రభుత్వం గురించే ఆలోచిస్తా. ప్రముఖ సంస్థ నవయుగ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ సంతోష్‌పై కేసు నమోదైంది’’అని వివరించారాయన.
నేతల్లో అసంతృప్తి వాస్తవమే
‘‘నామినేటెడ్ పదవులను నేతలకు తొలిసారి కేటాయించాం. అందుకోసం అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నాం. అందరినీ తృప్తి పరచడం అసాధ్యం. కానీ మాకు సాధ్యమైనంతవరకు నేతల సంతృప్తి కోసం ప్రయత్నిస్తున్నాం. ఇక రాజ్యసభ, లోక్‌సభ సీట్ల విషయంలో నేను అభ్యర్థులను రికమెండ్ మాత్రమే చేయగలను. పార్టీ హైకమాండ్‌దే ఫైనల్ డెసిషన్’’
బీఆర్ఎస్ అతిపెద్ద వైఫల్యం కాళేశ్వరమే
‘‘సాగు నీరు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. అసలు మేము అధికారంలోకి వచ్చింది శీతాకాలంలో. ఆ సీజన్‌లో వర్షాలు పడవు. అలాంటప్పుడు వేసవిని దృష్టిలో పెట్టుకుని నీళ్లు నిల్వ చేయాల్సిన బాధ్యత ఎవరిది? బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అతిపెద్ద వైఫల్యం కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ మేము నీళ్లను నిల్వ చేయలేం. అందుకు మేడిగడ్డ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయి ఉండటం మొదటి కారణం అయితే.. రెండవది అది బ్యారేజ్.. రిజర్‌వాయర్ కాదు. మేడిగడ్డ ఒక్కటనే కాదు.. అన్నారం ప్రాజెక్ట్ కూడా సురక్షితం కాదు. అన్నారం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేస్తే అది భారీ విపత్తుకు దారితీస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకూడదని మేము నిశ్చయించుకున్నాం. సాగునీటి విషయంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’’అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.