కేసీఆర్ అటు దిక్కే చూడటంలేదా ?
x
KCR

కేసీఆర్ అటు దిక్కే చూడటంలేదా ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటారు అనే విమర్శకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తాజా నిదర్శనం.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటారు అనే విమర్శకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే తాజా నిదర్శనం. ఎలాగంటే ఒకపుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ జెండా పాతాలని చెప్పి ఎంత హడావుడి చేశారో అందరు చూసిందే. రెగ్యులర్ గా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో బహిరంగసభలు, నేతలతో సమావేశాలు నిర్వహించేవారు. అక్కడి నుండి ముఖ్యమైన నేతలను హైదరాబాద్ కు పిలిపించుకుని తరచూ సమీక్షలు నిర్వహించేవారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ కు పెద్ద కమిటీని కూడా నియమించారు. సభ్యత్వనమోదు చేయించారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీకూడా చేయించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేస్తుందని ప్రకటించారు. ఎన్ని లోక్ సభ సీట్లలో పోటీచేయాలనే విషయాన్ని కూడా నేతలతో చర్చించారు.

సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత చప్పుడు చేయకుండా ఫామ్ హౌసులో కూర్చున్నారు. నేతలను, పార్టీని పట్టించుకోకుండా మొత్తాన్ని కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా పోటీచేస్తుందని ప్రకటించిన కేసీఆర్ మళ్ళీ ఆ మాటే ఎత్తలేదు. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి బయటకు వచ్చారు. ఎన్ని బహిరంగసభలు నిర్వహించినా, రోడ్డుషోల్లో పాల్గొన్నా 17 సీట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. దాంతో అప్పటినుండి నేతలతో సమావేశాలు కూడా బంద్ చేసేశారు. అప్పుడప్పుడు నేతలఫ్యామిలీలతో కలిసి సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలకు మాత్రం రెడీ అవుతున్నారు. ముంచుకొస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి కేసీఆర్ తో మాట్లాడేందుకు మహారాష్ట్రలోని నేతలు చాలామంది ప్రయత్నించారు. అయితే ఎవరికీ అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రయత్నంచేసి, ప్రయత్నంచేసి చివరకు విసిగిపోయిన చాలామంది నేతలు పార్టీని వదిలేశారు.

ఇపుడు విషయం ఏమిటంటే కేంద్రఎన్నికలకమీషన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా కేసీఆర్ చప్పుడు చేయటంలేదు. అంటే గతంలో ఏపీని వదిలేసినట్లే మహారాష్ట్రాను కూడా వదిలేసినట్లే అనుమానంగా ఉంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 22వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. 29వ తేదీ నామినేషన్లు దాఖలకు ఆఖరు రోజు. నామినేషన్ల పరిశీలన తేది 30. నామినేషన్ల ఉపసంహరణ తేది నవంబర్ 4. పోలింగ్ నవంబర్ 20వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23వ తేదీ. ఒకపుడు మహారాష్ట్ర విషయంలో ఎంత హడావుడి చేశారంటే హైదరాబాద్ నుండి 600 కార్లతో వెళ్ళేవారు. తెలంగాణాతో సరిహద్దులు పంచుకుంటున్న మహారాష్ట్రలోని షోలాపూర్, ఔరంగాబాద్, నాందేడ్, నాగ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు పై నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పోటీచేస్తుందని ఒకపుడు ప్రకటించారు.

బీఆర్ఎస్ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీచేసి సత్తా చాటుతామని హెచ్చరించారు. పార్టీ పటిష్టం కోసం రైతుసంఘాల నేతలు, కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీల్లోని కొందరు అసంతృప్త నేతలనే కాకుండా మరికొందరు ఓబీసీ కులసంఘాల నేతలను కూడా పార్టీలో చేర్చుకుని చాలా హడావుడి చేశారు. కేసీఆర్ మహారాష్ట్రలోని ఏదో ఒక పార్లమెంటు స్ధానం నుండి పోటీచేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అప్పట్లో అంత హడావుడిచేసిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మౌనం వహించారు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో బోర్లాపడటంతో అప్పటినుండి మహారాష్ట్ర ఊసే ఎత్తటంలేదు.

తెలంగాణా రాజకీయాలనే పట్టించుకోని కేసీఆర్ ఇక మహారాష్ట్రగురించి ఇంకేమి పట్టించుకుంటారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయినా సరే మహారాష్ట్రలోని పార్టీ నేతలు కేసీఆర్ ను సంప్రదించేందుకు చాలాసార్లు ప్రయత్నంచేసినా ఉపయోగం కనబడలేదని సమాచారం. దాంతో చాలామంది పార్టీని వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే మహారాష్ట్రలోని 288 సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల దాఖలకు ఎక్కువ సమయం కూడా లేదు. మరీ పరిస్ధితుల్లో కేసీఆర్ నుండి ఎలాంటి చప్పుడు వినబడటంలేదు. దాంతో మహారాష్ట్రను కేసీఆర్ పూర్తిగా వదిలేసినట్లే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆ ముక్కేదో నోరుతెరిచి చెబితే అందరికీ క్లారిటి వస్తుంది కదా.

Read More
Next Story