నెత్తిన పెట్టుకున్నపుడు కుక్కలు, నక్కలని తెలీదా..కేసీయార్ ?
x
KCR media meet photo from BRS website

నెత్తిన పెట్టుకున్నపుడు కుక్కలు, నక్కలని తెలీదా..కేసీయార్ ?

కేసీయార్ తత్వం మొదటినుండి ఇంతే. తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళు పునీతులు, మహానేతలు. కాదన్న వాళ్ళు బొంతపురుగులు, గొంగడిపురుగులు.


‘కుక్కలు, నక్కల్ని గుంజుకుని కాంగ్రెసోళ్ళు చంకలు గుద్దుకుంటున్నరు’..

‘ఒకరిద్దరు చిల్లరగాళ్ళుపోతే బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీలేదు’.. ఇది బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలను ఉద్దేశించి కేసీయార్ చేసిన వ్యాఖ్యలు. కేసీయార్ తత్వం మొదటినుండి ఇంతే. తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళు పునీతులు, మహానేతలు. కాదన్న వాళ్ళు బొంతపురుగులు, గొంగడిపురుగులు. ఇపుడు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరుతున్న వాళ్ళంతా కుక్కలు, నక్కలు, చిల్లరగాళ్ళు. ఇదే నిజమైతే మరి ఇదే కుక్కలు, నక్కలు, చిల్లరగాళ్ళకే కదా కేసీయార్ పదవులిచ్చి నెత్తినపెట్టుకున్నది. కుక్కలు, నక్కలు, చిల్లరగాళ్ళనే కదా టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి లాక్కున్నది. తాను లాక్కున్నపుడేమో తెలంగాణా అభివృద్ధిని కాంక్షిస్తు బీఆర్ఎస్ లో చేరిన మహానేతలు.

అదే నేతలు ఇపుడు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వెళిపోతుంటే కుక్కలు, నక్కలు, చిల్లరగాళ్ళయిపోయారా ? మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళిపోతున్న నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడిన కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ కనబడింది. తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే.......అన్న సామెతలాగుంది కేసీయార్ మాటలు. అధికారంలో ఉన్నపుడు ఇతర పార్టీల విషయంలో కేసీయార్ ఏ విధంగా వ్యవహరించారో ఇపుడు కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరిస్తోంది. తెలంగాణా రాజకీయాలు భ్రష్టుపట్టాయంటే అందుకు ముఖ్యకారుకుడు కేసీయారే. 2014లో అత్తెసరు మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత యధేచ్చగా ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.

ఉద్యమకారుడునని, తెలంగాణా కోసం చావునోట్లో తలపెట్టానని, తెలంగాణా పితామహుడనని కేసీయార్ తనకు తాను ఎన్ని భుజకీర్తులు తగిలించుకున్నా, ఎంత ప్రచారంచేయించుకున్నా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జనాలు ఇచ్చింది కేవలం 64 సీట్లు మాత్రమే. తన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు లేకుండా చేయాలని టీడీపీ, కాంగ్రెస్ ను చీల్చి చెండాడారు. అధికారాన్ని సుస్ధిరం చేసుకోవటం కోసం ప్రతిపక్షాలను ఉనికిలో లేకుండా చేయటానికి చాలా ప్రయత్నాలు చేశారు. కేసీయార్ దెబ్బకు టీడీపీ నామరూపాలు లేకుండాపోయింది కాని కాంగ్రెస్ ఎలాగో నిలదొక్కుకున్నది. కేసీయార్ దెబ్బకు నానా అవస్తలు పడి తట్టుకు నిలబడిన కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అప్పటినుండి కేసీయార్ కు సమస్యలు మొదలయ్యాయి. జనాలు తనను అధికారంలోకి దింపేశారన్న ఆక్రోసం కేసీయార్లో బాగా పెరిగిపోయింది.

బీఆర్ఎస్ ఓడిపోయిందన్న విషయాన్ని ఇప్పటికీ కేసీయార్ తట్టుకోలేకపోతున్నట్లు తన మాటల్లోనే అర్ధమైపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టడంతోనే కేసీయార్లో ఇంకా అహంకారం తగ్గలేదని తెలిసిపోతోంది. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కోవటం చీప్ పాలిటిక్సని కేసీయార్ కామెంట్ చేయటమే విచిత్రంగా ఉంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ కు 2014లో తెరలేపింది తానే అన్న విషయాన్ని కేసీయార్ మరచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నపుడు తాను ఎలా వ్యవహరించారో ఇపుడు అదే దారిలో రేవంత్ నడుస్తున్నారని కేసీయార్ గుర్తించటంలేదు. అధికారంలో ఉన్నపుడు తాను చేసిన చిల్లరపనులను మరచిపోయి అవేపనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది చిల్లర పనులనటం కేసీయార్కే చెల్లింది.

ఇక్కడ విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది రేపటి పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు రాకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుందన్న టెన్షన్ కేసీయార్లో పెరిగిపోతోంది. ఆ టెన్షనే కేసీయార్ను ఇలా మాట్లాడించింది. పోనీకదాని కాంగ్రెస్ ప్రభుత్వంపై నాలుగు నెలలు నోరిప్పలేదట. అధికారంలోకి వచ్చిన మూడోరోజు నుండే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, జనాలను మోసంచేసి, అబద్ధాలు చెప్పి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిందని కేటీయార్, హరీష్ రావులు పెట్టిన శాపనార్ధాలు కేసీయార్ కు తెలీవా ?

ఇదే విషయమై తెలంగాణావాణిలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు మోటె చిరంజీవి మాట్లాడుతు ఇంతకుముందు కేసీయార్ చేసిందే ఇపుడు రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కేసీయార్ వాడుతున్న భాషనే తెలంగాణాలో మిగిలిన నేతలు మాట్లాడుతున్నట్లు చెప్పారు. కేసీయార్ వల్లే రాజకీయాల్లో హుందాతనం పోయిందన్నారు. కేసీయార్ అవసరాల కోసం అప్పట్లో ఫిరాయింపులకు పాల్పడితే అదే దారిలో ఇపుడు కాంగ్రెస్ నడుస్తోందన్నారు. రాజకీయాల్లో చిల్లర భాషకు ఆధ్యుడు కేసీయారే అని చిరంజీవి స్పష్టంచేశారు.

Read More
Next Story