కేసీఆర్ నోట మళ్ళీ అదే మాట..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోట మళ్ళీ అదే మాట వినిపించింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, తాను పీఎం రేసులో ఉండబోతున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోట మళ్ళీ అదే మాట వినిపించింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, తాను పీఎం రేసులో ఉండబోతున్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియా ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలలో పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో ఇదే విషయాన్ని మరోమారు నొక్కి చెప్పారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని, తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని కేసీఆర్ అన్నారు. అవసరమైతే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, ఈ కూటమికే ఏదొ ఒక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీకి సున్నా లేదా ఒక్క సీటు వస్తుందని, దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడం ముఖ్యమని హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం బీజేపీకి అలవాటని విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ నరేంద్ర మోడీ సృష్టించిన రాజకీయ కుంభకోణం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేసీఆర్ స్పందిస్తూ.. అది మోడీ సృష్టించిన రాజకీయ కుంభకోణమని ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఈ కేసులో ఇవాళ్టి వరకు ఒక్క రూపాయి రికవరీ చేయలే.. ఎవడి నుండి ఎవడు తీసుకున్నడో ఎవరికి తెల్వది. ఢిల్లీ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి.. నేను, అర్వింద్ కేజ్రీవాల్ మోడీ కంట్లో నలుసులాగ ఉన్నామని చెప్పి.. ఆయన ఏజెంట్లను పంపించి గవర్నమెంటును కూలగొట్టాలని చూసిండు. వచ్చిన వాళ్లని పట్టి నేను ఇక్కడ జైలులో వేశా.. వేయడమే కాకుండా ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బీఎల్ సంతోష్ ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్.. ఆయనని పట్టుకరండని తెలంగాణ పోలీసులని ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకు పంపించిన. ఆ కోపం మనసులో పెట్టుకుని మమల్ని రాజీకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు అర్వింద్ కేజ్రీవాల్ ను, ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు. వాళ్లు కడిగిన ముత్యం లా బైటకి వస్తారు.. అది స్కామ్ కాదు వట్టి ట్రాష్ అని" కేసీఆర్ అన్నారు.