
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆర్భాటం
ఎన్నికలకు ముందు కేసీఆర్ పత్రికలకు పంచిన కోట్లు రూ.266
ఎన్నికలకు మూడు నెలల ముందు పది భాషల పత్రికలకు ప్రకటనల విందు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లకు పైగా పాలించిన కేసీఆర్ పత్రికల్లో ప్రకటనల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని తాజాగా వెలుగుచూసింది. అనుమతి లేని, నిర్మాణం పూర్తి కాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరిట కేసీఆర్ సర్కారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 వ సంవత్సరం సెప్టెంబరు 16, 17 తేదీల్లో తెలుగు కాకుండా మరో పది భాషల్లో పత్రికలకు రూ.22.13 కోట్ల ప్రజాధనంతో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చింది.నిర్మాణం పూర్తికాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పేరిట రూ.22.13 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ సర్కారు వ్యర్థం చేసింది.టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినపుడు రూ. 244.17 కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల పేరిట పత్రికలకు లబ్ధి చేకూర్చారు.
పూర్తికాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమస్యలతో సతమతమవుతుంటే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు తేది 16-9-2023న నార్లపూరులో ప్రాజెక్టు ప్రారంభోత్సవం, మళ్లీ తెల్లవారి 17-9-2023వతేదీన అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవం కొల్లాపూరులో కూడా చేశారు.ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.
తెలుగుతో పాటు హిందీ, మరాఠీ పత్రికల్లోనూ ప్రకటనలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రకటనను 13 తెలుగు దినపత్రికలతో పాటు , 7 ఇంగ్లీషు, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మరాఠీ పత్రికలు, 296 ఇతర చిన్న, చితకా పత్రికలు 322 మ్యాగజైన్ల ప్రకటనల కోసం రూ.22,13,55,038 ఖర్చు చేశారు. రకరకాల సమస్యలతో పూర్తికాని ప్రాజెక్టుకు 22.13 కోట్ల ఖర్చుతో ప్రారంభోత్సవ ప్రకటనలు జారీ చేయడం ప్రజాధనాన్ని వ్యర్థం చేయడమేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేసిన పనిగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పప్పుబెల్లాల్లా పత్రికలకు డబ్బు పంపిణీ
ఈనాడు దినపత్రికకు 1,67,31,000రూపాయలను ఫుల్ పేజీ ప్రకటన కోసం చెల్లించారు. అలాగే సర్క్యులేషన్ తక్కువగా ఉన్నా తమపార్టీ పత్రిక అయిన నమస్తే తెలంగాణకు రూ. 1,02,96,00 రూపాయలను విడుదల చేశారు. తెలుగు పత్రికలకు రూ.6.57 కోట్లు, ఆంగ్ల పత్రికలకు రూ.7.16కోట్లు, హిందీ పత్రికలకు రూ.3.3కోట్లు, ఉర్దూ పత్రికలకు రూ.98లక్షలు, మరాఠీ పత్రికలకు 1.23 కోట్లను పప్పు బెల్లాల్లా పంచారు.టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినపుడు తెలంగాణలో ప్రగతి పథకాల పేరిట ప్రకటనలను పత్రికలకు కేసీఆర్ విడుదల చేశారు. పంజాబ్ రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు పత్రికలకు రూ. 244 కోట్ల రూపాయలను ప్రకటనల పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని పంచారు. బీఆర్ఎస్ గా మారినపుడు ఈనాడుకు రూ.1.8కోట్లు, సాక్షికి రూ.1.7కోట్లు, తన సొంత పత్రిక అయిన నమస్తే తెలంగాణకు 1.3కోట్లు పంపిణీ చేశారు. కొన్ని కనిపించని పత్రికల పేరిట కూడా ప్రకటనల డబ్బును పంచారు.
పది భాషా పత్రికల్లో కేసీఆర్ సర్కారు ప్రకటనలు
కేసీఆర్ సర్కారు 2023-24 సంవత్సరంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. 2022వసంవత్సరం లో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, జాతీయ పార్టీ భారతీయ రాష్ట్ర సమితిగా మారింది.దీనికోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు కోసం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సంక్షేమ పథకాల పేరుతో దేశంలో అన్ని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. దీనికోసం కేవలం ఒక సంవత్సరంలో రూ. 244.17 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. తెలుగే కాక, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, మరాఠి, ఒరియా, గుజరాతి, బెంగాలి, పంజాబీ ఒక్కటేమిటి దేశంలోని అన్ని చిన్న , చితకా పత్రికలలో కూడా ప్రకటనలు ఇచ్చారు.
పదేళ్లు అయినా పూర్తి కానీ ప్రాజెక్టు
దక్షిణ తెలంగాణ జిల్లాలకు సాగు,తాగునీరు అందించేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొద్ది రోజులలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి జూన్ 2015 లో పాలనాపరమైన మంజూరు ఇచ్చారు.రూ.32,000 కోట్ల అంచనాలతో 4 సంవత్సరాల్లో (జూన్ 2019)లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు.
అనుమతి లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభం
కృష్ణానది అంతర్ రాష్ట్ర నది. ఈ నదిపై ఎటువంటి ప్రాజెక్టు లేదా ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించాలన్నా రకరకాల కేంద్ర ప్రభుత్వ శాఖలతో అనుమతులు తీసుకున్న తరువాతే పని మొదలుపెట్టాలి. కానీ పాలమూరు రంగారెడ్డి ఎటువంటి అనుమతులు లేకుండానే తొందరపాటుగా పనులు చేపట్టారు. ఈ కేసు కాస్తా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లడం, ట్రిబ్యునల్ వారు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారని తెలంగాణకు రూ.920 కోట్ల ఫైన్ విధించింది.
సుప్రీంకోర్టులో ఏపీ కేసు
తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేయడం ఒక అలవాటుగా మారిందని, ఈ పనులు ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టామని సమర్థించుకోవడం జరుగుతుందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.కృష్ణానదిలో నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటికంటే ఎక్కువగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తీసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీమ్‌కోర్టులో కేసు వేసింది.ఈ ప్రాజెక్టు కోసం భూమి సేకరించి సరైన పరిహారం ఇవ్వనందున చాలామంది ప్రజలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
అనుమతిలేని ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడు?
అనుమతి లేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రకరకాల కోర్టు కేసులు ఇతర సమస్యలతో చివరి దశకు చేరుతుందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా అన్న సమస్య ఏర్పడింది.నవంబర్ 2023 వరకు ప్రాజెక్టుపై రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి 70శాతం పనులు పూర్తి చేశారు. అయితే ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా రూ.20 వేల కోట్లు కావాలని ప్రాజెక్టు ఛీఫ్ ఇంజనీరు ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించారు.ఈ విషయంపై విచారణ జరిపి, ప్రజాధనాన్ని ఎన్నికల్లో లబ్ధి కోసం వాడిన దోషులపై చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విన్నవించింది. ఈ మేరకు జులై 11వతేదీన తాము గవర్నరుకు వినతిపత్రాన్ని సమర్పించామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం. పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
Next Story