KCR and Farmhouse|మాటమీద నిలబడిన కేసీఆర్
x
BRS chief KCR

KCR and Farmhouse|మాటమీద నిలబడిన కేసీఆర్

అప్పుడే కేసీఆర్ డిసైడ్ అయినట్లున్నారు చెప్పిన మాటకే కట్టుబడుండాలని.


బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పిన మాటమీదే నిలబడాలని గట్టిగా డిసైడ్ అయినట్లున్నారు. ప్రత్యేకతెలంగాణా ఏర్పడినతర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి. ఆఎన్నికల్లోను తర్వాత 2018లో రెండోసారి ఎన్నికలను ఎదుర్కొన్నపుడు జనాలకు చాలా హామీలిచ్చారు. అవి ఏవిధంగా అమలుచేశారో అందరు చూసిందే. ఇక 2023 ఎన్నికల్లో కేసీఆర్(KCR) ఎన్ని హామీలిచ్చినా జనాలు నమ్మలేదు. ఇదేసమయంలో ఎన్నికల మొదటి ప్రచారసభలోనే ఒకమాట చెప్పారు. అదేమిటంటే ‘ఎన్నికల్లో గెలిపిస్తే సచివాలయంలో ఉంటా ఓడగొడితే ఫామ్ హౌసులో రెస్ట్ తీసుకుంటాను’ అని. ఇదే విషయాన్ని కేసీఆర్ ఎన్నికల ప్రచారసభల్లో పదేపదే చెప్పారు. కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పినా జనాలు మాత్రం కాంగ్రెస్ ను గెలిపించారు. దాంతో అప్పుడే కేసీఆర్ డిసైడ్ అయినట్లున్నారు చెప్పిన మాటకే కట్టుబడుండాలని.

అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చి ఇప్పటికి 13 మాసాలయినా కేసీఆర్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వచ్చిందిలేదు. ఎన్ని ప్రకృతివిపత్తులు వచ్చినా, జనాలు ఎన్ని ఇబ్బందులుపడుతున్నా కేసీఆర్ అయితే జనాల్లోకి వచ్చి ఓదార్చిందిలేదు. గట్టిగా చెప్పాలంటే జనాలను కేసీఆర్ వాళ్ళఖర్మకు వాళ్ళని వదిలేశారు. అధికారంలో ఉంటేనే జనాలగురించి పట్టించుకుంటానని లేకపోతే హ్యాపీగా ఫామ్ హౌసులో(Farmhouse)నే రెస్టు తీసుకుంటానన్న చెప్పిన మాటకే కట్టుబడున్నారు. నిజానికి కేసీఆర్ ధోరణి ప్రజాస్వామ్యంలో చాలా విచిత్రమైనదనే చెప్పాలి. అధికారంతో సంబంధంలేకుండా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళే అసలైన నేతలు. కష్ట, నష్టాల్లో తమకు తోడుగా ఉండేవాళ్ళనే జనాలు కూడా గుర్తుంచుకుంటారు. అధికారంలో ఉంటేమాత్రమే జనాలగురించి పట్టించుకుంటాను ప్రతిపక్షంలో ఉంటే పట్టించుకోను అనే ధోరణి చాలా విచిత్రమైనది.

ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేసేటపుడు, తర్వాత బడ్జెట్ సమావేశంలో మొదటిరోజు అసెంబ్లీకి వచ్చినపుడు మాత్రమే కేసీఆర్ మీడియాకు కనిపించారు. అప్పుడు మాట్లాడుతు ప్రభుత్వాన్ని చీల్చిచెండాడేస్తానని, చీరేస్తానని, అగ్గిపుట్టిస్తానని, వదిలిపెట్టకుండా వెంటాడుతానని పడికట్టుపదాలు చాలానే వినిపించారు. తీరాచూస్తే అవన్నీ నీటిమీద రాతలే అని అర్ధమైపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన 13 మాసాలుగానే కాదు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా సచివాలయంకు వచ్చింది తక్కవే. క్యాబినెట్ సమావేశం అప్పుడు మాత్రమే మంత్రులందరితో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలోనే అధికారులనూ కలిసేవారు. క్యాబినెట్ సమావేశం అయిపోతే మళ్ళీ ఫామ్ హౌసుకే పరిమితం. ఎప్పుడైనా ఒకసారి పూనకం వచ్చినట్లుగా వరుసగా రెండుమూడురోజులు అన్నీ శాఖలను సమీక్షించేవారు. అదయిపోతే మళ్ళీ మామూలే ఫామ్ హౌస్ కే పరిమితం.

పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న మాటేకాని సచివాలయంకు వచ్చింది మాత్రం చాలా తక్కువ. 2024 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో జనాల్లోకి వచ్చిన కేసీఆర్ తర్వాత నుండి అడ్రస్ లేరు. ఫామ్ హౌసులోనే కూర్చుని ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఎప్పుడైనా నేతలను అక్కడికే పిలిపించుకుని సమావేశమవుతున్నారు. రెండుఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు అన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఓడిపోతే ఫామ్ హౌసుకే పరిమితం అవుతానన్న మాటకు మాత్రం కట్టుబడున్నారనే అనుకోవాలి. కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మని పదేపదే రేవంత్ రెడ్డి(Revanth reddy)తో పాటు మంత్రులు ఎన్నిసార్లు కోరినా పెడచెవిన పెట్టారు. అసెంబ్లీకి హాజరైతే తననే రేవంత్ అండ్ కో చీల్చిచెండాడుతారని అనుమానించారో ఏమో తెలీదు. అందుకనే అసెంబ్లీ సమావేశాలవైపు చూడటంకూడా లేదు. ప్రత్యేక తెలంగాణా డిమాండును నెరవేర్చిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(Manmohan Singh) మరణించిన తర్వాత నివాళులు అర్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా ఒకరోజు సమావేశమైంది. మన్మోహన్ మంత్రివర్గంలో కేసీఆర్ రెండేళ్ళు మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి హాజరై మన్మోహన్ గురించి నాలుగు మాటలు మాట్లాడుతారని అందరు అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం తనపద్దతే తనదని నిరూపించారు.

కేటీఆర్ కవర్ చేస్తున్నారా ?

కేసీఆర్ వైఖరిని కవర్ చేయలేక కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నానా అవస్ధలు పడుతున్నారు. కేసీఆర్ మార్గనిర్దేశంలోనే పార్టీ అంతా నడుస్తోందని పదేపదే చెప్పుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వానికి తాముచాలు కేసీఆర్ అవసరంలేదని బిల్డప్పులు ఇస్తున్నారు. అయితే జనాలేమీ అమయాకులు కాదు జరుగుతున్నదాన్ని గ్రహించలేకపోవటానికి. కేసీఆర్ వైఖరి వల్ల పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల్లో కూడా నిరాసపెరిగిపోతోందన్నది వాస్తవం. పార్టీ భవిష్యత్తుమీద నమ్మకం లేకనో మరేదైనా కారణాలవల్లో ఇప్పటికి పదిమంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. జిల్లాల్లో ద్వితీయశ్రేణినేతల్లో కొందరు బీజేపీలో చేరుతున్నారు. కేసీఆర్ వైఖరిలో మార్పురాకపోతే ఇంకెంతమంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరుతారో చూడాలి. జనాలనే కాదు చివరకు పార్టీ నేతలకు కూడా కేసీఆర్ అందుబాటులో లేని కారణంగానే పార్టీ నేతల్లో చీలికవచ్చేసి కొందరు కవి(Kavitha)తే కాబోయే సీఎం అని మరికొందరు కేటీఆరే కాబోయే సీఎం అని మీటింగుల్లో నినాదాలు చేస్తున్నారు. కేసీఆర్ ఉండగానే కేటీఆర్, కవిత మద్దతుదారులు కాబోయే సీఎంలని నినాదాలు ఇస్తున్నారంటే పార్టీలో పరిస్ధితి ఎంతగందరగోళంగా తయారవుతోందో అర్ధమైపోతోంది.

Read More
Next Story