కేసీయార్ ను సమస్యలు కమ్ముకుంటున్నాయా ?
x
KCR surrounded by problems

కేసీయార్ ను సమస్యలు కమ్ముకుంటున్నాయా ?

ఈ సూత్రం రాజకీయాలకు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. తెలంగాణాలో కేసీయార్ పరిస్ధితికి ఇపుడీ సూత్రం సరిగ్గా సరిపోతుంది.


హీరోలు జీరోలవ్వటం, ఓడలు బండ్లవ్వటం ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప విషయం. హీరోలు ఎప్పటికీ హీరోలుగానే ఉంటామంటే కుదరదు. ఈ సూత్రం రాజకీయాలకు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. తెలంగాణాలో కేసీయార్ పరిస్ధితికి ఇపుడీ సూత్రం సరిగ్గా సరిపోతుంది.

గడచిన కొద్దికాలంగా కేసీయార్ కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా తగులుతునే ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన బీఆర్ఎస్ ఒక్క సీటులో కూడా గెలవలేదు. బీఆర్ఎస్ పరిస్ధితి ఎంత దయనీయంగా తయారైందంటే మొత్తం 17 పార్లమెంటు సీట్లలో ఒక్కదానిలో కూడా గెలవలేదు. రెండు నియోజకవర్గాల్లో రెండోస్ధానంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. మిగిలిన 15 నియోజకవర్గాల్లో మూడోస్ధానంలోనే ఉండిపోయింది. మరీ అన్యాయం ఏమిటంటే ఏడు నియోజకవర్గాల్లో అసలు డిపాజిట్లే దక్కలేదు. ఈ లెక్కలు చూస్తే చాలు కేసీయార్ అధ్యక్షతన బీఆర్ఎస్ పరిస్ధితి ఎలాగుందో అంచనావేయటానికి. ఇక మరో రెండు కీలక విషయాలు చూస్తే కేసీయార్ కు బద్ధవిరోధి అయిన చంద్రబాబునాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చారు. అలాగే కేంద్రంలో నరేంద్రమోడి మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే కేసీయార్ను సమస్యలు కమ్ముకోవటం మొదలైంది. ఎన్నికల్లో ఓటమి మామూలే అయినా కేసీయార్ కు ప్రబలవిరోధి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ సీఎం అయినదగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ప్రతిరోజు నానా రచ్చచేస్తున్నారు. తమ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా రేవంత్ ప్రభుత్వం ఖాతాలో వేసేసి నానా రకాలుగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్లు జోస్యం కూడా చెప్పారు. అయితే అందుకు భిన్నంగా జగన్ దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుండటాన్ని కేసీయార్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటే అతిశయోక్తికాదు.

పైగా కేంద్రంలో మోడి ప్రభుత్వం ఏర్పాటు అవ్వటంలో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తుండటం బహుశా కేసీయార్ కు బాగా ఇబ్బందనే చెప్పాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు మనిషే. ఇద్దరికీ కేసీయార్ కామన్ శతృవు. వీళ్ళకి అదనంగా కేంద్రంలో నరేంద్రమోడి ఉండనే ఉన్నారు. రేవంత్ ఇబ్బంది పెట్టదలచుకుంటే కేసీయార్ పరిస్ధితి చాలా దారుణంగా తయారవుతుందనటంలో సందేహంలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీయార్ తాజాగా కోర్టు స్పందించిన తీరుతో మరింత ఇబ్బందులో పడబోతున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీయార్ ను అరెస్టుచేసి విచారించాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

పదేళ్ళలో జరిగిన అవినీతి, అక్రమాలకు తోడు ట్యాపింగ్ విషయంపై రేవంత్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే చాలు కేసీయార్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. తెలంగాణాలో రేవంత్, ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడి ముగ్గురికి ముగ్గురూ కేసీయార్ కు బద్ధశతృవులనే చెప్పాలి. అందుకనే ఏరూపంలో కేసీయార్ ను సమస్యలు ఎప్పుడు చుట్టుముడుతాయో ఎవరు చెప్పలేకున్నారు.

Read More
Next Story