
నేతలకు కేసీఆర్ దర్శనభాగ్యం ?
ఉపఎన్నికలు ముగిసేవరకు (Hyderabad)హైదరాబాద్, నందినగర్లోని తన ఇంట్లోనే మకాం వేయాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం
కారుపార్టీ నేతలకు అదృష్టం పట్టబోతోంది. అదేమిటంటే కేసీఆర్ దర్శనభాగ్యం లభించటమే. తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల(Jubilee Hills by poll) సందర్భంగా పార్టీలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ప్రతిరోజు మాట్లాడి కేసీఆర్(KCR) దిశానిర్దేశం చేయాల్సుంది. అందుకని ఇప్పటిలా ఫామ్ హౌసులోనే ఉంటే కష్టమని అనుకున్నట్లున్నారు. అందుకనే ఉపఎన్నికలు ముగిసేవరకు (Hyderabad)హైదరాబాద్, నందినగర్లోని తన ఇంట్లోనే మకాం వేయాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎన్నికల్లో ఓడిపోయినా కేసీఆర్ మకాం మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌసే(Yerravalli Farm House) అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఫామ్ హౌస్ లోకి ప్రవేశించాలంటే ముందు సార్ అనుమతి ఉండాల్సిందే. లేకపోతే ఎంతటి వాళ్ళొచ్చినా కనీసం గేట్లు కూడా తీయరు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కాదు ఇపుడు కూడా అదేపద్దతి. దొరగారు ఎవరితో అయినా మాట్లాడాలని అనుకుంటే వారిని మాత్రమే పిలిపించుకుంటారు. వారితో వచ్చేవారికి ఫామ్ హౌస్ లోకి అనుమతి బంద్. అందుకనే ఎవరికైతే కబురువస్తోందో వారు మాత్రమే ఫామ్ హౌస్ కు వెళతారన్న విషయం పార్టీలోని అందరికీ తెలిసిందే. కూతురు కల్వకుంట్ల కవితైనా, కొడుకు కేటీఆర్ అయినా, మేనల్లుడు తన్నీరు హరీష్ రావు అయినా ఇదే పద్దతి. అందుకనే సార్ దర్శనభాగ్యం దొరకటం ఎవరికీ అంత ఈజీకాదు.
ఇలాంటి నేపధ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పుణ్యమా అని అందరినీ కేసీఆర్ రెగ్యులర్ గా కలుసుకోబోతున్నట్లు తెలిసింది. ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నా పాల్గొనకపోయినా కనీసం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో అయినా ప్రతిరోజు కలవాలని అనుకున్నారు. ఎందుకంటే ప్రచారం తీరుతెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, దిశానిర్దేశం చేయటం చాలా అవసరమని కేసీఆర్ అనుకున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఈ ఉపఎన్నికలో గెలవటం బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకనే ఈ ఎన్నికను కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలుగా తీసుకున్నది. ఇందులో భాగంగానే ఈరోజు సుదీర్ఘంగా ఫామ్ హౌస్ లో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలోకి వచ్చే నేతలతో భేటీ అయ్యారు.
సో, పార్టీవర్గాలు చెప్పింది వాస్తవమే అయితే శుక్ర లేదా శనివారం నుండి కేసీఆర్ పార్టీలోని ప్రజాప్రతినిధులు, నేతలకు హైదరాబాద్ లోని నందినగర్ ఇంట్లోనే కొద్దిరోజులు అందుబాటులో ఉంటారు. ఇక ప్రచారంలో పాల్గొనే అంశం అంటారా ? కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు కాబట్టి దానిగురించి ఆలోచించటం అనవసరమే.