
కేసీఆర్ తప్పు ఒప్పుకున్నట్లేనా..?
కాళేశ్వరం కమిషన్ నివేదిక చర్చకు రెడీ అవుతున్న క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించడానికి తెలంగాణ అసెంబ్లీ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు. కాగా వాటికి బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీనిపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాకపోతే.. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కేసీఆర్ ఒప్పుకున్నట్లేనని ఆయన అన్నారు. ఏ తప్పూ చేయకపోతే ఆయన సమావేశాలకు హాజరై తన వాదన వినిపిస్తారని, అలా చేయకపోతే తప్పు జరిగినట్లేనని అన్నారు కోమటిరెడ్డి. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. నిజంగా కాళేశ్వరం నిర్మాణంలో ఏ తప్పూ జరగకపోతే కేసీఆర్‌కు అంత భయం ఎందుకని, అసెంబ్లీ సమావేశాలు షురూ అవుతాయని తెలియగానే కోర్టుకు ఎందుకు పరుగులు పెట్టారంటూ చురకలంటించారు.
గప్పాలు చెప్పిన కేసీఆర్.. గడప దాటరేం..
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అన్నీతానై కట్టించానని, కుర్చీ వేసుకుని కుర్చుని మరీ కట్టించానని చెప్పిన కేసీఆర్.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు. కేసీఆర్ హయాంలోనే రికార్డ్ స్థాయిలో కట్టించిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలింది. కాళేశ్వరంపై విచారణ జరిపిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. సమగ్ర విచారణ జరిపి ఆయన ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఏ తప్పూ చేయకపోతే కేసీఆర్‌కు భయమెందుకు. హుటాహుటిన హైకోర్టుకు పరుగులు తీశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పు అని భావిస్తే కేసీఆర్.. కోర్టుకు కాకుండా అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలి. ప్రతిపక్ష నేతగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నాయకులు వాకౌట్ చేయకుండా ఉంటారా? తప్పించుకుని పారిపోతారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తి చర్చ ఉంటుంది..
‘‘అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది. అన్ని అంశాలపై చర్చిస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రాజెక్ట్‌కు అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీకి రాకుంటే తప్పు ఒప్పుకున్నట్లే. తప్పు జరిగితే తప్పని బాధ్యతగా ఒప్పుకోవాలి. ఇప్పటికయినా నిజాలు చెప్పడానికి కేసీఆర్.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని భావిస్తున్నా. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష్య కోట్లు తిన్న వాళ్లని వదిలేస్తామా? ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. కాళేశ్వరంపై పెట్టిన ఫోకస్ డిండి, పాలమూరు లాంటి ప్రాజెక్ట్‌లపై ఎందుకు పెట్టలేదు?’’ అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కేసీఆర్, హరీష్‌కు కోర్టు షాక్..
అయితే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు.. హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. వారి పిటిషన్లను కొట్టివేసింది. ఆగస్టు 22న విచారణ జరిపిన న్యాయస్థానం తర్వాత కేసీఆర్, హరీష్ కోరినట్లుగా స్టే ఇవ్వలేమని తేల్చేసింది. అసెంబ్లీలో చర్చలు జరిగిన తర్వాతే బాధ్యులపై చర్యలు ఉంటాయన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హామీని కోర్టు పరిగణలోకి తీసుకున్నది. అందుకనే విచారణ దశలోనే కేసీఆర్, హరీష్ అడిగినట్లుగా స్టే ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ రిపోర్టును రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు. కాపీలను సభ్యులకు అందించిన తర్వాత జరిగిన అవినీతి, అవకతవకలపై అసెంబ్లీలో చర్చించవచ్చు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభలోనే నిర్ణయించవచ్చని అర్ధమవుతోంది. పిటీషన్లు దాఖలుచేసిన కేసీఆర్, హరీష్ కూడా ఎంఎల్ఏలే కాబట్టి వాళ్ళు చెప్పుకోవాల్సింది అసెంబ్లీలోనే చెప్పుకోవచ్చని అడ్వకేట్ జనరల్ వాదనతో కోర్టు ఏకీభవించింది. అలాగే కమిషన్ రిపోర్టును వెబ్ సైట్ లో పెట్టుంటే వెంటనే తొలగించమని ఆదేశించింది.