
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
చంద్రబాబునాయుడు జన్మదినం(Chandrababu Birthday) సందర్భంగా శుభాకాంక్షలు చెబుతు అభినందనలతో ముంచెత్తారు
రాజకీయాల్లో శాశ్వత శతృవులుండరు..శాశ్వత మిత్రులుండరు అన్నది నానుడి. ఇపుడు ఈ విషయం ఎందుకంటే తెల్లవారి లేస్తే ఆంధ్రా వ్యతిరేకతనే బూచిగా చూపించి లబ్దిపొందిన, పొందాలని చూస్తుంటారు బీఆర్ఎస్ నేతలు. అలాంటి నేతలు ఆదివారం చంద్రబాబునాయుడు జన్మదినం (Chandrababu Birthday) సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అభినందనలతో ముంచెత్తారు. ఊరికే శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా చంద్రబాబు అంతటోడు, ఇంతటోడంటు పొగడ్తలతో ముంచెత్తారు. అంతేమరి, మన ప్రత్యర్ధులే మనల్ని అభినందనలతో ముంచెత్తితే ఆ కిక్కే వేరుగుంటుందబ్బా అనిపిస్తుంది కదా. జన్మదినం సందర్భంగా కేసీఆర్ శుభాకాంక్షలు చెబితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం చంద్రబాబును అభినందనలతో ముంచెత్తారు.
‘నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురోరాగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాల’ని కేసీఆర్(KCR) ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షమైన పాలన అందించేందుకు దేవుడు చంద్రబాబుకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక కేటీఆర్(KTR) తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతు చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ‘ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంచిపనులు చేసి’నట్లు చెప్పారు. ‘చంద్రబాబు తీసుకొచ్చిన హైటెక్ సిటీ(Hitech City) సహా ఐటి అభివృద్ధిని తాము కొనసాగించిన’ట్లు చెప్పారు. చంద్రబాబు చేసిన మంచిపనులను తమ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా లేదా రాజకీయ లబ్ధికోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇదే చంద్రబాబును ఇదే కేటీఆర్ ఎన్ని మాటలంటారో అందరికీ తెలిసిందే. తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు చంద్రబాబును లేదా ఆంధ్రా పాలకులను కేసీఆర్, కేటీఆర్ ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇపుడు జన్మదినం సందర్భంగా చంద్రబాబు చేసిన మంచిపనులు చాలానే ఉన్నాయని కేటీఆర్ తెలంగాణ భవన్లో చెప్పటం విన్నవాళ్ళకు ఆశ్చర్యమేసింది. అందుకనే ‘మన ప్రత్యర్ధే మనల్ని అభినందిస్తుంటే వినేటపుడు భలే దిల్ ఖుష్ అవుతుంద’నే సినిమా డైలాగ్ బాగా పాపులరైంది.