కవిత రాజకీయాలెందుకు మసకబారుతున్నాయి?
x

కవిత రాజకీయాలెందుకు మసకబారుతున్నాయి?

కెసిఆర్ కూతురు కవిత ఎపుడూ సెన్సేషనే. టిఆర్ ఎస్ మొదటి టర్మ్ లో పవర్ఫుల్ లేడీ గా సెన్సేషన్. రెండో టర్మ్ లో ఓటమి, లిక్కర్ స్కాం సెన్సేషన్. అదే సెన్సేషన్ మళ్లీ...


గత పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి సభ్యుడు అరవింద్ ధర్మపురి చేతిలో పరాజయాన్ని చవి చూసినప్పటి కెసిఆర్ కూతురు హవా తగ్గడమే తప్ప కోలుకుంటున్నట్లు కనిపించదు. తాను మళ్ళీ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికకావడమే తన లక్ష్యం అంటూ వ్యవహరిస్తూ వచ్చినా మొన్న శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పరాజయం అనంతరం నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు.

గత కొన్నేళ్ళ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సాగించిన సన్నాహక కార్యక్రమాలను హఠాత్తుగా నిలిపివేశారు. సామాజిక కార్యక్రమాలకు సహకారం, దేవాలయాల పునర్ నిర్మాణం, అభివృధ్ది కార్యక్రమాలు, అధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనడం, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దేవాలయం లాంటి ప్రసిధ్ద దేవాలయాలలో హనుమాన్ చాలీస వంటి పారాయణాలు నిర్వహించడం ద్వారా హిందు ఓటు బ్యాంకును ఆకర్శించాలని కవిత ప్రయత్నాలు సాగించారు.
వీటినన్నంటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.
తాను ఏర్పాటు చేసుకున్న తెలంగాణ జాగృతిని, భారత జాగృతి గా మార్చారు. జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. బిజెపి భావజాలానికి అనుకూలంగా అనేక అంశాలపై ఆమె మాట్లాడుతూ వచ్చారు. ఢిల్లీ లో దీక్ష నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడి విచారణను ఎదుర్కొంటున్నప్పటికీ గత కొన్ని నెలల క్రితం వరకు ఆమె పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు కదిలారు.
పార్టీ బాధ్యతలు అంతంత మాత్రమే...
లిక్కర్ స్కాం మచ్చ వల్ల 2023 నవంబర్ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కవితకు పెద్దగా బాధ్యతలు అప్పగించలేదు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలు స్వీకరిద్దామన్న అందుకు అనుమతి లభించలేదు. నిజామాబాద్, భోధన్ శాసనసభ నియోజవర్గాలపైనే ఆమె ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించారు. రెండు చోట్ల బిఆర్ఎస్ అభ్యర్ధులు పరాజయం పాలయ్యారు. ఆమె ముస్లింమైనారిటీలకు సన్నిహితంగా కావడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది.
శాసనసభ ఎన్నికలకు ముందు ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, కొన్నింటి నుంచి ఆహ్వానాలు అందుకోవడం ద్వారా స్వంత ఖర్చుతో మీడియాలో ప్రచారాలలో స్థానం సంపాదించుకుని వార్తలలో ఉండటానికి పోటీపడిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకి, బిసి వర్గాలకు సంబంధిచిన అంశాలకు పరిమితమైనట్టుగా కనిపిస్తోంది.
లోక్ సభ పోటీపైనా అనుమానాలే...
ఒకరకంగా చెప్పాలంటే ఆమె తన కార్యక్షేత్రానికి వెళ్ళకుండ ఉండటంతో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు దూరమైనట్టు తేలిస్తోంది. నిజామాబాద్ ను పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి కొత్త అభ్యర్ధులు పార్టీ ముందుకు తీసుకువస్తుందనే ప్రచారం ప్రారంభమైంది. బిఆర్ఎస్ నాయకత్వమే ఆమె ను పార్లమెంట్ ఎన్నికల నుంచి దూరంపెట్టినట్టు కూడ అనుమానాలు వస్తున్నాయి.

తెలంగాణ భవన్ లో శాసనసభ ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కవిత వాడిగా వేడిగా ప్రసంగించారు. అయితే, నియోజకవర్గానికి రావడమే లేదు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లలో మూడింటిలో బిఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం లేక నియోజకవర్గానికి రావడమే మానేశారని టాక్.

ధర్మపురి ఎక్కడ?
కాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పై న కవితపైన ఫైర్ బ్రాండ్ గా చెలరేగిన బిజెపి అభ్యర్ధి అరవింద్ ధర్మపురి ఇటీవలి శాసనసభ ఎన్నికలలో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ పరాజయం పాలుకావడంతో ఆయన కూడా బిఆర్ఎస్ విమర్శలు చేయడం తగ్గించారు. ఆయన గొంతుకూడా ఎక్కడా వినిపించడం లేదు. ఆయన వార్తల్లో కనిపించక ఎన్నాళ్లయిందో. కెసిఆర్ కుటుంబంపైన, కవిత పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అరవింద్ కూడా టిక్కెట్ రావడం అనుమానమే అంటూ బిజెపిలో ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆయన బిఆర్ఎస్ పట్ల సానుకూలంగా మారారా అని కొంతమంది అనుమానిస్తున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల నుంచి బిఆర్ఎస్ –అరవింద్ మధ్యల సాగుతున్న రాజకీయ దాడులు, సవాళ్ళు, ప్రతిసవాళ్ళు పార్లమెంట్ ఎన్నికల ముందర తగ్గడం అన్ని రాజకీయ పక్షాలను ఆశ్ఛర్యానికి గురిచేస్తోంది.అయితే, లిక్కర్ స్కాం పై రెండు పార్టీల నేతల పెదవులపై తాళం వేసే విధంగా లిక్కర్ స్కాం విచారణ మళ్లీ మొదలవుతూ ఉంది. సిబిఐ చార్జ్ షీట్ లో ఇపుడు నిందితురాలిగా ఆమె పేరు చేరింది. కెసిఆర్ కుటుంబ సభ్యుల మీద ఎన్ని విమర్శలున్నా, కవితలాగా అపకీర్తి సిబిఐ, ఇడి చుట్టూ తిరిగి అపకీర్తి పాలయిన వాళ్లు లేరు.
గత పార్లమెంట్ ఎన్నికలలో కవిత ఓవర్ ఎక్స్ పోజర్ బిజెపి విజయానికి దోహదం చేయగా, శాసనసభ ఎన్నికలలో ఓటమి నుంచి బిఆర్ఎస్ ను కాపాడటం ఎవరివల్ల కాలేదు.కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొడమే ధ్యేయంగా బిఆర్ఎస్, బిజెపి లుపనిచేస్తున్నాయి. ఈ ధ్యేయం వాటిని దగ్గరకు చేరుస్తుందా, ఇంకా దూరం చేస్తుందా చూడాలి. ఈ పరిణామం అంతిమంగా కవితకు రాజకీయకష్టాలనుంచి గట్టేందుకు ఉపయోగపడుతుందా అనేది పెద్ద ప్రశ్న.
Read More
Next Story