
Komatireddy | రాజగోపాలరెడ్డిపై కీలక నిర్ణయం ?
ఎంఎల్ఏ ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు
వివాదాస్పదంగా తయారవుతున్న మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటి కీలకమైన నిర్ణయం తీసుకున్నది. రాజగోపాలరెడ్డి(Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని, వచ్చే సమావేశంలో వాటిపై చర్చిస్తామని క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లురవి(Mallu Ravi) మీడియాకు చెప్పారు. ఆదివారం సమావేశమైన కమిటి వరంగల్(Warangal) జిల్లా నేతల వివాదంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రి కొండాసురేఖ(Konda Surekha) దంపతులకు మరో ముగ్గురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, కొందరు సీనియర్ నేతలతో ఏమాత్రం పడటంలేదు. అందుకనే ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కు కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలన్నింటిపైనా కమిటి చర్చించినట్లు మల్లు తెలిపారు. వరంగల్ నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నలుగురు నేతలను వరంగల్ కు పంపాలని డిసైడ్ చేసినట్లు చెప్పారు. తాను మంటలు పెట్టడానికి లేనని, ఫైర్ ఇంజన్ లాగ మంటలు ఆర్పుతానని రవి సరదాగా వ్యాఖ్యానించారు. బహుశా ఆ నలుగురు నేతలు క్షేత్రస్ధాయిలో సమాచారాన్ని సేకరించి మళ్ళీ కమిటీకి రిపోర్టిస్తారు. ఆ తర్వాత గ్రూపులపై ఏమి నిర్ణయం తీసుకోవాలో కమిటి ఆలోచిస్తుంది. నియమించబోయే నలుగురు నేతలపేర్లను తొందరలోనే ప్రకటిస్తామని రవి చెప్పారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారంపైన కూడా కొంత చర్చ జరిగినట్లు తెలిపారు.
రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలను కమిటి పరిశీలించాలని అనుకున్నట్లు చెప్పారు. ఎంఎల్ఏ ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారన్న వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎనుముల రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఎంఎల్ఏ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. మీడియాతో, బహిరంగంగానే రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోలేదన్న మంట ఎంఎల్ఏలో రోజురోజుకు పెరిగిపోతోంది. తనపైన ఎంఎల్ఏ చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలతో రేవంత్ ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. తొందరలోనే జరగబోయే కమిటి సమావేశంలో రాజగోపాలపై ఏమి చర్చిస్తారనే విషయం ఇఫుడు పార్టీలో ఆసక్తిగా మారింది.