అవినీతిలోనూ బాహుబలేనా? రంగంలోకి విజిలెన్స్ డీజీ
విజిలెన్స్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వారం రోజులుగా కీలక ఫైళ్ల కోసం వెతుకుతున్నారు. అయినా అవి ఎక్కడున్నాయో, ఏమో..
తెలంగాణ బాహుబలి ప్రాజెక్ట్‌గా అభివర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ల కుంగుబాటుపై దర్యాప్తు ముమ్మరమైంది. తీగలాగితే డొంకంతా కదిలేలా ఓవైపు విజిలెన్స్ మరో వైపు అంతర్గత దర్యాప్తు జరుగుతోంది. 'ఈ ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అధికారులు, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు వందల కోట్లు కాజేశారు. వీళ్లందరి అంతు తేలుస్తాం. ఏ ఒక్కర్నీ వదలం. నిజం చెప్పాలంటే చైనాలో అయితే ఇలాంటి అధికారులకు, ప్రభుత్వ నేతలకు ఉరిశిక్ష వేస్తారు' అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే దర్యాప్తు సాగుతోంది. విజిలెన్స్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వారం రోజులుగా కీలక ఫైళ్ల కోసం వెతుకుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దూకుడు పెంచింది. విజిలెన్స్ అధికారులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని మరోసారి సందర్శించారు. ఈసారి నేరుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ ఈఈ, డీఈలతో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లింక్-వన్‌పైనే దర్యాప్తు అధికారులు రిపోర్ట్ తయారు చేస్తున్నారు..
రికార్డులు ఎందుకు గల్లంతయ్యాయి...
'కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రికార్డులు భద్రపరిచే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు' అన్నారు సాక్షాత్తు రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోమంత్రి పొన్నం ప్రభాకర్. వీళ్ల అనుమానాలకు తగ్గట్టే కీలకమైన్ ఫైల్స్, హార్డ్‌డిస్క్‌లు మాయం అయ్యాయి. ఇప్పుడు దీనిపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. మాయమైన రికార్డులకు వెనుక ఉన్న అసలు సూత్రదారులు ఎవరనే కూపీ లాగడానికి ఏకంగా డీజీ స్థాయి అధికారే రంగంలోకి దింపింది ప్రభుత్వం.
మేడిగడ్డ బ్యారేజీ రికార్డులు భద్రమేనా?
హైదరాబాద్‌లోని జలసౌధ నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు ఉన్న కాళేశ్వరం కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. వందల ఫైల్స్, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు భావించారు. అయితే ENCలకు సంబంధించిన క్యాంపు ఆఫీసులు, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోదాలు చేసిన విజిలెన్స్ బృందాలకు కొన్ని కీలకమైన రికార్డులు మాత్రం లభించలేదు. వీటిలో కొన్ని హార్డ్ డిస్కులు మిస్సయ్యాయన్న విషయం గమనించి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్ రాజీవ్ రతన్ స్వయంగా ఎంట్రీ ఇచ్చారు.
డీజీ వస్తే ఏమవుతుందీ?
రెండ్రోజులుగా విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నుంచి బ్యారేజీ, పంప్‌హౌజ్‌లకు సంబంధించిన విషయాలపైన ఆరా తీస్తున్నారు. రెండో రోజు కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌజ్ కింది భాగంలోని మోటర్లను, కంట్రోల్ రూంలను, ఫోర్ బే, అప్రోచ్ కెనాల్, డెలివరీ చానల్‌ను డీజీ రాజీవ్ రథన్ బృందం పరిశీలించింది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి గతేడాది వరదల తీరుపైన ఇరిగేషన్ అధికారులు డీజీకి వివరించారు. అన్నారం బ్యారేజీ బుంగల మరమ్మత్తులను సైతం విచారణ అధికారుల బృందం పరిశీలన చేసింది.
హార్డ్‌డిస్క్‌లు ఎలా మాయం అయ్యాయి?
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం ఉన్న హార్డ్ డిస్క్‌లు ఎలా అదృశ్యం అయ్యాయనేది మిస్టరీగా మారిపోయిందన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ హార్డ్ డిస్క్‌ల్లో ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు స్టోర్ చేసి ఉన్నాయి. అధికార వర్గాలు మాత్రం ఈ విషయంపై స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. ప్రాజెక్టుకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు అదృశ్యం కావడం వెనుక ఇరిగేషన్ అధికారుల ప్రమేయం ఉందనేది ఓపెన్ సీక్రెట్‌గా మారింది. ఇప్పుడు వీటిని వెతికితీసేందుకు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని చెప్తున్న కాంగ్రెస్... ఆధారాలు బయట పెట్టి ప్రాణహిత-చేవెళ్లకు పునాది రాయి వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.