
హరీష్ రావు చేతికి కారు స్టీరింగ్ ?
పార్టీలో యాక్టివ్ పార్ట్ తీసుకుని నడిపించేంత సీన్ కేసీఆర్ లో కనబడటంలేదు. కవితకు పార్టీతో సంబంధంలేదు. ఇక మిగిలింది ఎవరు ? కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మాత్రమే
హెడ్డింగ్ చూసి కారుపార్టీలో కేటీఆర్ మద్దతుదారులు, అభిమానుల్లో కలవరపాటు తప్పకపోవచ్చు. కారు స్టీరింగ్ మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) చేతికి ఇప్పటికిప్పుడు కాకపోయినా రేపు లేదా తొందరలోనే అందక తప్పదనే సంకేతాలు బలంగా కనబడుతున్నాయి. కారణాలు ఏమిటంటే ఫార్ములా ఈ కార్ రేసు డెవలప్మెంట్లు చూస్తుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు ఇబ్బందులు తప్పేట్లు లేదు. పేరుకు కేసీఆరే(KCR) పార్టీ అధినేత అయినప్పటికీ పార్టీ భారమంతా కేటీఆరే మోస్తున్నారు. కేటీఆర్ భారాన్ని పంచుకోవటానికి చెల్లెలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఇపుడు పార్టీలో లేరు. కేటీఆర్ భారాన్ని హరీష్ కొంత మోస్తున్నా అదంతా అనధికారికమనే చెప్పాలి. పార్టీ మొత్తంమీద చెప్పుకోదగ్గ గట్టినేతలు ఎవరైనా ఉన్నారా అంటే అది కేటీఆర్, హరీష్ మాత్రమే.
2023 అసెంబ్లీ ఎన్నికలో పార్టీ ఓడిపోయిన దగ్గరనుండి అధినేత కేసీఆర్ జనాల్లోకి వచ్చిందేలేదు. అనారోగ్యాలు, ఓటమి నైరాశ్యం లాంటి రకరకాల కారణాలతో కేసీఆర్ ఫామ్ హౌసుకు మాత్రమే పరిమితమైపోయారు. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో గెలుపు పార్టీకి ఎంతటి ప్రతిష్టాత్మకమైనా కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. జూబ్లీహిల్స్ లో పార్టీ ఓడిపోగానే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతి మంజూరుచేయటం కాకతాళీయమేనా ? ఫార్ములా కారు కేసు ఒక లొట్టపీసు కేసని, కేసులో ఏమీలేదని కేటీఆర్ పైకి ఎంత చెబుతున్నా లోలోపల తనలోని టెన్షన్ తెలిసిపోతోంది. హైకోర్టుతో పాటు గవర్నర్ కు ఏసీబీ అందించిన నివేదికలో ఫార్ములా కారు రేసు పేరుతో కేటీఆర్ పాల్పడిన అధికార దుర్వినియోగం, అవినీతి కళ్ళకు కట్టినట్లు సాక్ష్యాలతో సహా చూపించిందని సమాచారం.
మూడు, నాలుగురోజుల్లోనే కేటీఆర్ పై యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీ రెడీ అవుతోందనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇక్కడ యాక్షన్ అంటే అరెస్టుచేయటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే కేసు నమోదైంది, చాలాసార్లు విచారణ కూడా జరిగింది. కాబట్టి కేటీఆర్ ను అరెస్టుచేసి తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలుచేయటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే అప్పుడు పార్టీ పరిస్ధితి ఏమిటి ? పార్టీని, నేతలను ముందుకు నడిపించేంత సమర్ధుడైన నేత హరీష్ కాకుండా ఇంక ఎవరున్నారు ? అన్న ప్రశ్నలు మొదలైనట్లు తెలుస్తోంది.
పార్టీలో యాక్టివ్ పార్ట్ తీసుకుని నడిపించేంత సీన్ కేసీఆర్ లో కనబడటంలేదు. కవితకు పార్టీతో సంబంధంలేదు. ఇక మిగిలింది ఎవరు ? కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మాత్రమే. నిజానికి పార్టీ పగ్గాలను కేటీఆర్ కు అప్పగించేయాలని కేసీఆర్ చాలాకాలం క్రితమే ముహూర్తం నిర్ణయించుకున్నట్లు ఒకపుడు విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే పట్టాభిషేకం నిలిచిపోయింది. కారణం ఏమిటంటే హరీష్ రావే అని పార్టీలో బాగా ప్రచారమైంది. పార్టీలో కేటీఆర్ కన్నా హరీష్ సీనియర్+మెజారిటి నేతల మద్దతున్న నేతగా ప్రచారంలో ఉంది. మెజారిటి నేతల మనోభావాలను, హరీష్ ను కాదని కేటీఆర్ కు పార్టీపగ్గాలు అప్పగిస్తే పార్టీలో ఇబ్బందులు మొదలవుతాయన్న ఆలోచనతోనే కేటీఆర్ పట్టాభిషేకాన్ని కేసీఆర్ వాయిదా వేసినట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
పార్టీపగ్గాలు కేటీఆర్ కు అప్పగించినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని హరీష్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే హరీష్ మద్దతుదారులు మాత్రం కేటీఆర్ కు పగ్గాలు అప్పగించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఒకపుడు పార్టీలోనే ప్రచారంజరిగింది. ఏదేమైనా పార్టీపగ్గాల కోసం కేటీఆర్ తో హరీష్ ఏనాడు పోటీపడిన దాఖలాలు లేవు. అయితే తన కార్యాచరణతోనే కేటీఆర్ కు హరీష్ ఎప్పటికప్పుడు పోటీగా ఉంటున్నారు. జనాల్లో చొచ్చుకుపోవటం, పార్టీ నేతలతో మమేకం అవటం, జిల్లాల పర్యటన తదితరాల్లో కేటీఆర్ తో పోల్చుకుంటే హరీషే చొచ్చుకుపోతున్న విషయం అందరుచూస్తున్నదే. కేసీఆర్ కొడుకు అన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ కేటీఆర్ కు అండగా ఉన్నకారణంగా హరీష్ కూడా ఎప్పటికప్పుడు తగ్గి ఉంటున్నట్లు కనబడుతోంది.
కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లుగా ఫార్ములా కార్ రేసు కేసు ఇపుడు కేటీఆర్ మెడకు చుట్టుకోబోతోంది. కేటీఆర్ పైన ఏసీబీ యీక్షన్లోకి దిగితే అప్పుడు అనివార్యంగా హరీషే పార్టీని నడిపించే బాధ్యతలను తీసుకోవాల్సుంటుంది. కేసీఆర్ కు ఇష్టమున్నా లేకపోయినా హరీష్ కు కీలక బాధ్యతలను అప్పగించటం తప్పదు. అప్పుడు కారుస్టీరింగ్ హరీష్ చేతిలోకి వచ్చేస్తే కేసీఆర్ బ్యాక్ సీటుకు మాత్రమే పరిమితమవుతారు. ఇపుడు కూడా పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్ బ్యాక్ సీటుకు మాత్రమే పరిమితమైనా ఉద్దేశ్యపూర్వకమనే అనుకోవాలి. ఎప్పటికైనా పార్టీపగ్గాలు కేటీఆర్ కే అప్పగించాలి కాబట్టి ఇప్పటినుండే కేసీఆర్ బ్యాక్ సీటుకు పరిమితమవుతున్నారని పార్టీనేతలకు అర్ధమైపోయింది.
అయితే కారుస్టీరింగ్ కేటీఆర్ చేతిలో ఉండటం హరీష్ చేతిలో ఉండటం వేరు. కేటీఆర్ కొడుకు కాబట్టి పర్వాలేదు అదే హరీష్ మేనల్లుడు. ఒకసారి కారు స్టీరింగ్ కల్వకుంట కుటుంబం నుండి జారిపోతే మళ్ళీ తిరిగి దక్కుతుందా అన్నదే పాయింట్. ఎందుకంటే కేటీఆర్ కన్నా హరీష్ కు చొరవ ఎక్కువ, మెజారిటి నేతలకు ఆమోదయోగ్యుడు కాబట్టే. అయితే ఇక్కడే హరీష్ కు కూడా పెద్ద సమస్య పొంచి ఉంది. అదేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అవకతవకల్లో కేసీఆర్ తో పాటు హరీష్ పాత్ర కూడా కీలకమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిచెప్పింది. కాళేశ్వరం అవినీతిపై విచారించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐని కోరింది. కాళేశ్వరంకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, విజిలెన్స్ కమిషన్ రిపోర్టును సీబీఐ తెప్పించుకుని అధ్యయనం చేసింది. అద్యయనం అయితే చేసింది కాని తన నిర్ణయాన్ని మాత్రం ఇప్పటివరకు సీబీఐ చెప్పలేదు.
ఒకవేళ విచారణకు సీబీఐ రంగంలోకి దిగితే అప్పుడు కేసీఆర్ తో పాటు హరీష్ మీద కూడా కేసులు నమోదవుతుంది. కేసులు నమోదైతే ఏదోరోజు అరెస్టులు కూడా తప్పవు. అప్పుడు పార్టీ పగ్గాలను అందుకునేది ఎవరు ? పార్టీని నడిపించేది ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది. కేటీఆర్ కొడుకు హిమాంశు అనివార్యంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడా ? పార్టీ పగ్గాలు అందుకుంటాడా ? నేతలు హిమాంశు నాయకత్వాన్ని ఆమోదిస్తారా ? అనే ప్రశ్నలకు కాలమే సమాధానంచెప్పాలి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఏసీబీ యాక్షన్ మొదలవ్వగానే కారు స్టీరింగ్ హరీష్ చేతిలోపడక తప్పదనే అనిపిస్తోంది, ఏమి జరుగుతుందో చూడాలి.

