Khammam | జులై 15లోగా మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణం
మున్నేరు వాగు సమస్యకు జులై 15 వతేదీలోగా శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు రూ.690 కోట్లను కేటాయించింది.
మున్నేరువాగు రిటైనింగ్ వాల్ భూసేకరణ వేగవంతంగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఏడు రోజుల్గోగా నివేదిక అందించాలని మంత్రి కోరారు.
- దశాబ్దాల నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముప్పు సమస్యకు మరో ఏడు నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
- మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల ఆర్‌సిసి రిటైనింగ్‌వాల్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జులై 15 వ తేదీలోగా ఎట్టి పరిస్దితులలోనూ పనులను పూర్తి చేసి తీరాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 234 ఎకరాల భూమి అవసరం ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు. 64 ఎకరాలు ప్రభుత్వ భూములు, మరో 170 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయని వెంటనే ఈ భూములను సేకరించడానికి యజమానులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన భూసేకరణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. వర్షాకాలంలో మున్నేరు వాగు పొంగి పొర్లడం వల్ల ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ప్రజలు తరచూ వరద సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి పరిస్థితిని నియంత్రించడానికి రిటర్నింగ్ వాల్ నిర్మాణం ఒకటే పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి నెల రెండు రోజులు ఈ పనులను తనిఖీ చేస్తానని, ప్రతి రోజూ ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఫీల్డ్ లెవల్లో ఏర్పాటు చేయాలని, ప్రతి రోజు పనుల పురోగతి వివరాలు వాట్సాప్ లో అప్ డేట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ఎంజాయ్ మెంట్ సర్వే రెండు రోజులలో పూర్తి చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ కు తెలిపారు. ఎన్.ఎస్.పి. సంబంధించిన భూములు, ఖమ్మం అర్బన్ లోని భూములు ఎంత సేకరించాలి, దానికి నిర్దేశించుకున్న ప్రణాళిక ఇటువంటి పూర్తి వివరాలు నివేదికలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
మున్నేరు నది బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలు, ఖమ్మం అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలకు సంబంధించి వారం రోజులలో పూర్తి నివేదిక అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారిని మంత్రి ఆదేశించారు. భూ సేకరణ కోసం సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపేందుకు నిపుణుల కమిటీ నియమించుకోవాలన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా చూడాలని మంత్రి సూచించారు.
Next Story