ముగ్గురు పిల్లలను చంపి .. తానూ ఆత్మహత్య
x

ముగ్గురు పిల్లలను చంపి .. తానూ ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ తండ్రి ఘాతుకం


నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలకు సంరక్షకుడిగా ఉండాల్సిన తండ్రి తన పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులకు పిల్లల ఆచూకీ మాత్రం లభించలేదు. పిల్లలను చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యతో గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఈ ఘటనకు దారి తీసింది.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో గుత్తా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలతో మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయేముందు వెంకటేశ్వర్లు భార్యతో గొడవపడి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎపిలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన వెంకటేశ్వర్లు బ్రతుకుతెరువు కోసం నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకుని స్థానికంగా ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

భార్యతో గొడవపడ్డ వెంకటేశ్వర్లు తన ముగ్గురుపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బైక్ ఎక్కించుకుని వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. వెంకటేశ్వర్లు బైక్ ఎక్కించుకుని తన పిల్లలను శ్రీశైలం వైపు వెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయి. మోక్షిత (8), రఘువర్షిణి(6), శివ ధర్మ(4)లను మరో చోట హత్య చేసి తాను మాత్రం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది.పిల్లలను మాత్రం అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను హత్య చేసిన తర్వాత తానూ పురుగులమందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.వ్యవసాయపనుల కోసం వచ్చిన వ్యవసాయ కూలీలకు పొలంలో వెంకటేశ్వర్లు విగత జీవిగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బైక్ పై వెంకటేశ్వర్లు అచ్చంపేట వైపు వెళ్లి అక్కడే పిల్లలను చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లల డెడ్ బాడీలు దొరకలేదు.

వెంకటేశ్వర్లు భార్య, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story