
కిషన్, బండి ఇద్దరు పనికిరాని మంత్రులా?
బీజేపీ నేతలు పరమానందయ్య శిష్యుల్లా మాట్లాడుతున్నారన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్‌పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ కులం విషయంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ కులం, మతం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్దికోసమే బీజేపీ తాపత్రయపడుతోందని, సంబంధంలేని రాహుల్ గాంధీ కులం, మతం అంటూ మాట్లాడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడలేమ్మ మద్దెలపై ఏడ్చిందన్నట్లుగా బీజేపీ తీరుందన్నారు. వారికి చేతకాని పని కాంగ్రెస్ చేసి చూపిస్తే. దాన్ని అంగీకరించకుండా ఎదురుదాడి చేస్తూ వింతవింత విమర్శలు చేస్తోందని చురకలంటించారు. బీజేపీ నేతలంతా కూడా పరమానందయ్య శిష్యుల మాదిరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘బీజేపీ బిల్లా, రంగాలు కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. రాజకీయ లబ్ది కోసం కొత్త నాటకం ఆడుతున్నారు. రాహుల్ గాంధీ కులం, మతం అంటూ రాజకీయం చేస్తున్నారు. పరమానందయ్య శిష్యుల్లా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ఈ నాటకం. మీ వల్ల రాష్ట్రానికి రూపాయి ఉపయోగం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పనికిరాని మంత్రులు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు. రాహుల్ గాంధీ కులం ఏంటని అడగడం మీ రాజకీయ దివాలకోరుకు నిదర్శనం. కేసీఆర్ ను మైమరిపించేలా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం నెహ్రు కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కించపరిస్తే మిమ్ముల్ని ఎవరు క్షమించరు. కాంగ్రెస్ పునాదుల మీద దేశం ఏర్పడ్డది. కులాల ,మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు.
రేవంత్ ఏమన్నారంటే
‘‘మోదీ వాస్తవానికి బీసీ కాదు.. లీగల్లి కన్వర్ట్ బీసీ. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. సీఎం అయ్యాక బీసీలలో ఆయన కులాన్ని కలుపుకున్నారు. జనాభా లెక్కలు ఎందుకు చెయ్యలేదు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కల తో పాటు కుల గణన చెయ్యాలి. చట్టం సవరణ కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయాలి’’ అని అన్నారు రేవంత్. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలంతా రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా రాహుల్ గాంధీ కులమేంటో రేవంత్ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ చర్చ రోజురోజుకు తీవ్రతరమవుతున్న క్రమంలోనే దయాకర్ రావు ఘాటుగా స్పందించారు.