
‘ఆయుర్వేదం అంటే ఆకులు, మూలికలు కాదు.. అదొక ఫిలాసఫీ..’
140 కోట్ల మంది ప్రాణాల్ని కాపాడిన వైద్య విధానమే ఆయుర్వేదమన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన వైద్య పరిజ్ఞానం ఆయుర్వేదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుర్వేదంలో ఒక భాగమైన యోగ ప్రపంచానికి అందించామని అన్నారు. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలోనూ ఆయుర్వేదం, యోగా మనకు ఎంతో భరోసా కలిగించాయని ఆయన చెప్పారు. ఆయుర్వేదం.. మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదు. భారతీయ జీవన విధానంలో.. వెల్‌నెస్, ఫిజికల్&మెంటల్ బ్యాలెన్స్ కు సంబంధించిన కంప్లీట్ ఫిలాసఫీ గా మనం చూడాలని చెప్పారాయన. జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్-2025లో పాల్గొన్న కిషన్ రెడ్డి ఆయుర్వేదం ప్రాధాన్యత గురించి అనేక అంశాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగానే విశ్వ ఆయుర్వేద పరిషత్, తెలంగాణ చాప్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ విజ్ఞానం భారత్ సొంతం..
‘‘వేల ఏళ్ల క్రితం ప్రపంచం కనీసం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశం సొంతం. వేల ఏళ్ల క్రితమే.. ఆపరేషన్లు, కృత్రిమ అవయవాలు, టాక్సికాలజీ, డయాగ్నస్టిక్ టెస్టులు, కాటరాక్ట్ ఆపరేషన్లు చేసిన ఘనమైన చరిత్ర మనది. ఇందుకు మనందరం గర్వపడాలి. చరకుడు, సుశ్రుతుడు, వాగ్‌భట్టు వంటి ఎందరో మహానుభావులు.. ఈ ప్రాచీన భారత విజ్ఞానం ద్వారా నాటి సమాజానికి వైద్యం చేశారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు.. వైద్యం, ఆపరేషన్లు మొదలైన వాటిలో యావత్ ప్రపపంచానికి మార్గదర్శనం చేశాయి. ‘ఫాదర్ ఆఫ్ సర్జరీ’ అయిన సుశ్రుతుడు నాటి కాలంలోనే ఆపరేషన్లను చేస్తే.. చరకుడు.. ఫిజియాలజీ గురించి, వివిధ థెరపీల గురించి.. సమస్త మానవాళికి జ్ఞానాన్ని అందించారు. ఇలాంటి మహనీయుల పరిశోధనల ఫలితంగానే.. నాటినుంచి నేటి వరకు వైద్య రంగంలో, చికిత్సా రంగంలో భారతదేశం ఉన్నతమైన స్థానంలో కొనసాగుతోంది’’ అని అన్నారు.
ఆయువర్వేదాన్ని అనచివేసే ప్రయత్నాలు..
‘‘నేడు బహుళ జాతి కంపెనీలు అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదాన్ని పద్ధతుల్ని యోగాని అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మనకు ఇదొక సవాల్ దీన్ని తిప్పి కొట్టాలి ఈ సమయంలో మన సాంప్రదాయ వైజ్ఞానిక విద్యని యోగాను కాపాడుకోవాలి. ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక లాబీ ప్రపంచంలో నడుస్తుంది. ఈ లాబిని తట్టుకొని ఆయుర్వేదానికి ప్రాధాన్యత తీసుకురావాలంటే మనం సమర్థవంతంగా తిప్పి కొట్టాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా యోగాను ఆయుర్వేదాన్ని మనం కాపాడుకోవాలి మన బాధ్యత దానికి మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో రూ.16.05 కోట్ల కేటాయింపు
‘‘మన హైదరాబాద్ లోని రామంతపూర్‌లోనూ.. ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం.. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అవసరమైన భూసేకరణను పూర్తిచేసి.. అవసరమైన DPRను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. ఇప్పటికే.. తెలంగాణలో 420 ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు.. ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి’’ అని తెలిపారు.
‘‘440 ఆయుష్ డిస్పెన్సరీల్లో.. 224 ఆయుర్వేదం, 122 యునానీ, 94 హోమియపతి కేంద్రాలున్నాయి. ఇవి కాకుండా.. 366 NRHM డిస్పెన్సరీలు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఇందులో.. 199 ఆయుర్వేదం, 62 యునానీ, 105 హోమియోపతి డిస్పెన్సరీలున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్లు.. ఆరోగ్య భారత నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఆయుష్ మినిస్ట్రీని బలోపేతం చేసేందుకు, ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టానికి ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్’తో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా.. తెలంగాణలో ఆయుష్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్.. రూ.16.05 కోట్లు కేటాయించింది’’ అని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్..
‘‘భారతీయ లోకల్ మెడిసినల్ ప్రోడక్ట్స్ తయారీతోపాటుగా.. ఈ రంగంలో స్టార్టప్స్ కారణంగా.. అంతర్జాతీయ వెల్‌నెస్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కు డిమాండ్ పెరిగింది. అందుకే, ఇవాళ మోదీ గారి నేతృత్వంలో.. ఆయుర్వేదం భారతదేశపు ‘సాఫ్ట్ పవర్’గా.. ప్రపంచవ్యాప్తంగా ‘గుడ్‌విల్’ను పెంచుతూ.. కల్చరల్ డిప్లమసీకి బాటలు వేస్తోంది. మన పెద్దలు చెప్పిన ‘వసుధైవ కుటుంబకం’ నినాదాన్ని.. మనసా, వాచా, కర్మణా పాటిస్తూ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతున్నాం. ఇవాళ 100కు పైగా దేశాల్లో ఆయుర్వేదాన్ని ‘ప్రివెంటివ్ కేర్’గా వాడుతున్నారు. ఇది మనందరికీ గర్వకారణం’’ అని అన్నారు.