
తెలంగాణ కైట్ క్యాపిటల్ ఎక్కడుందో తెలుసా?
సంక్రాంతి సమీపిస్తున్నా పతంగుల సందడి కరువైన ధూల్ పేట్
ఆకాశం రంగు రంగుల గాలిపటాలతో నిండిపోవడం, ప్రతి ఇంటి పైకప్పుపై కేరింతలు, ఉత్సాహపు అరుపులు వినిపించడం... సంక్రాంతి పండుగ ప్రతి చోటా ఇలాగే కనిపిస్తుంది. ఈ పండుగకు గాలిపటాలే ప్రధాన ఆకర్షణ. తెలంగాణలో గాలిపటం సంక్రాంతికి పర్యాయపదం. దీపావళి టపాకాయలెలాగో, సంక్రాంతికి గాలిపటం అంతే. ప్రతి ఇల్లూ గాలిపటం ఎగరేస్తుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటం ఎగేరేసేందుకు ఉబలాటపడతారు.
ఈ సంకాంత్రి సందడి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక ఇరుకు గల్లీల ఏరియాలో మొదలవుతుంది. అక్కడి నుంచే సంక్రాంతి పతంగుల పండగ నగరమంతా, రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. సంక్రాంత్రి సంబరాన్ని అక్షరాలా అంబారాన్నంటేది ఈ గల్లీల నుంచే. ఆ ఏరియా పేరే ధూల్ పేట (Dhootpet). రాష్ట్రమంతా ఎగిరే ‘కాగితపు పతంగులు’ తయారుయ్యేది ఈ ధూల్ పేట లోనే. అందుకే సంక్రాంతి సంబరాలలో ధూల్ పేట పేరు విస్మరించలేము.
ధూల్ పేట ఏరియా ఓల్డ్ సిటిలోని మంగల్ హాట్ సమీపాన ఉంటుంది. ఇది గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగం. ఇక్కడ నివసించే ప్రజలంతా ఎపుడో నూరు నూటాయాభై యేళ్ల కిందట హైదరాబాద్ కు వలసి వచ్చిన స్థిరపడిన వాళ్లు. వస్తూ వస్తూ వాళ్లు హైదరాబాద్ పతంగులు తయారు చేసే విద్య, ఉత్సవ విగ్రహాలు తయారు చేసే విద్య మోసుకొచ్చారు. హైదరాబాద్ కు అరుదైన గుర్తింపు తెచ్చారు.
సంక్రాంతి సీజన్ మొదలుకాగానే, హైదరాబాద్ వీధులన్నీ ధూల్ పేట వైపు తిరుగుతాయి, కుర్రకారు మొత్తం ధూల్ పేట రావలిందే. ఈ ప్రాముఖ్యం వల్లనే ‘ఫెడరల్ తెలంగాణ’ కూడా తెలంగాణ కైట్ క్యాపిటల్ (Telangana Kite Capital) ధూల్ పేట్ సందర్శించింది. ధూల్ పేట్ కు మేము నాంపల్ మీదుగా వెళ్లాము. నాంపల్లి నుంచి గోషామహల్ రోడ్, సీతారామ్ బాగ్, మంగళ్ హాట్ రోడు నుంచి ధూల్ పేట్ చేరాము.ఫెడరల్ తెలంగాణా బృందం ధూల్‌పేటలోని అత్యంత పురాతన గాలిపటాల తయారీదారులలో ఒకరిని సంప్రదించింది. 60 ఏళ్ల కళాకారుడైన గోపాల్ సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి గాలిపటాల తయారీలో బిజీగా కనిపించాడు. గాలిపటాల తయారీలో తన ప్రయాణం గురించి అడిగినప్పుడు, గోపాల్‌సింగ్ ఇలా అంటాడు.
సంక్రాంతికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నప్పటికీ, గాలిపటాల వ్యాపారులలో సందడి కనిపించడం లేదు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకుల ఉత్పత్తి తగ్గడం వల్ల, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మార్కెట్లలో గాలిపటాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వెదురు, ప్లాస్టిక్ వంటి వివిధ గాలిపటాల తయారీ ముడిసరుకుల కొరత కారణంగా ధూల్‌పేట్, బేగం బజార్, గుల్జార్ హౌస్, సికింద్రాబాద్‌తో సహా అనేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. "ఈ సంవత్సరం గాలిపటం ఫ్రేమ్ చేయడానికి ఉపయోగించే వెదురు కర్రల కొరత, ప్లాస్టిక్ కొరత కారణంగా నేను మంచి రకాల గాలిపటాలను నిల్వ చేసుకోలేకపోయాను. ఈ సంవత్సరం కూడా మాకు మంచి ఆర్డర్లు వచ్చాయి, కానీ తక్కువ స్టాక్ కారణంగా, మేము డిమాండ్‌ను తీర్చలేమోనని భయపడుతున్నాము," అని గోపాల్ సింగ్ అన్నారు.
చైనా పతంగుల నుంచి సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ధూల్‌పేట్ లోని గోపాల్‌సింగ్ కుటుంబం నాలుగు తరాలుగా ఈ వృత్తి కొనసాగిస్తోంది. గోపాల్‌సింగ్ 40 సంవత్సరాలుగా గాలిపటాలు తయారు చేస్తున్నారు. “మేము మా ముడిసరుకులను అహ్మదాబాద్, ఇండోర్ నుండి తెప్పిస్తాము. గాలిపటాలను ఇక్కడే ధూల్‌పేట్‌లో తయారు చేస్తాము. మా కుటుంబం 120 సంవత్సరాలకు పైగా గాలి పటాలను తయారు చేస్తోంది. మా తాత దీనిని ప్రారంభించారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. గాలిపటాలతో పాటు, మేము గణేష్ విగ్రహాలను కూడా తయారు చేస్తాము," అని గోపాల్ సింగ్ ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు. ఇక్కడి నుంచి, డిజైన్‌ను బట్టి 2 రూపాయల నుండి 250 రూపాయల వరకు వివిధ ధరలలో అవి నగరంలోని దుకాణాలకు వెళ్తాయి.
ఇటీవలి సంవత్సరాలలో వ్యాపారం మందకొడిగా మారింది. ప్లాస్టిక్ గాలిపటాల కంటే కాగితపు గాలిపటాల ధర ఎక్కువగా ఉండటంతో కొంత మంది ఇతర వృత్తులకు మారారు. కానీ గత సంక్రాంతికి పర్వాలేదనిపించే వ్యాపారం జరిగిన తర్వాత, ఈ సంవత్సరం మరిన్ని ఆర్డర్లు వస్తాయని మళ్ళీ పుంజుకుంటామని మేము ఆశిస్తున్నాం అని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్ కమల్.
రాజ్ కమల్ , గోపాల్ సింగ్ గత 40 సంవత్సరాలుగా గాలిపటాలు తయారు చేస్తున్నారు. “మేము తయారు చేసే గాలిపటాలకు మంచి పేరుంది. గాలిపటాల తయారీలో ప్రసిద్ధి చెందాము. 75 రకాల చిన్నవి నుండి పెద్దవి వరకు అనేక రకాలను అందిస్తాము. ఈ పని మాకు ఆహారం అందిస్తుంది. నాకు జీవనోపాధిని అందిస్తుంది. మంచిగా అనిపిస్తుంది,” అని రాజ్ కమల్ చెప్పారు.
ధూల్ పేట్ లో 40 శాతం కాగితం పతంగులు తయారు చేస్తుండగా, 60 శాతం అహ్మదాబాద్, ఢిల్లీ, మురాదాబాద్, రాజస్తాన్, కల్ కత్తా నుంచి తెచ్చిన ప్లాస్టిక్ గాలి పటాల్ని ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ విక్రయిస్తున్న పతంగుల ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. "ఇక్కడ ఒక్కో పతంగు ధర రూ.2 ల నుంచి మొదలై రూ.250 వరకు ఉంది. కొన్ని షాపుల్లో రూ.5వేల ధర కలిగిన పతంగులు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎక్కువగా డిమాండ్ లేదు. ఒక్కో మాంజా ఖరీదు వాటి సైజును బట్టి రూ.150 నుంచి రూ.2 వేల వరకు ఉంది," అని జైభవానీ పతంగ్‌షాఫ్ నిర్వాహకులు రీతిక్ సింగ్, మిలన్ కుమార్ ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
ఈ మార్కెట్‌లో రక రకాల పతంగులు లభిస్తున్నాయి. వాటిలో "గుడ్డి, డోరీ, గోల్కాఫ్, దూలా దుల్హన్, లంగోర్, చాంద్ సితారా, చాంద్ తారా ఇలాంటి పేర్లతో పతంగులు తయారు చేసేవారు. ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు డోరేమాన్, ఫిష్హట్, ప్లేన్, లైనింగ్, రకరాల జంతువులు, పులులు, సింహాలు, గుర్రాలతో తయారు చేసిన ప్లాస్టిక్ పతంగులు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ పతంగులతో పాటు కొన్ని షాపుల్లో బట్టతో తయారు చేసిన పతంగులు కూడా విక్రయిస్తున్నారు," అని నర్సింగ్ తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని రకాల పతంగులు వచ్చినా.. ధూల్ పేట్ పేపర్ పతంగులు, మాంజాకు ఉండే క్రేజే వేరు. ఒక పతంగ్ తయారీ చేయాలంటే దాని వెనుక ఎనిమిది మంది పనిచేయాలి. మేము నాలుగు తరాలుగా పతంగ్‌లు తయారు చేస్తున్నామని రాజ్ కమల్ చెప్పారు.
"ఆసఫ్ జాహీల పాలనా కాలంలో హైదరాబాద్ పాతబస్తీలోని గ్రౌండ్ లలో పతంగుల పండుగ ఘనంగా నిర్వహించే వారు. ఆరవ నిజామ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు వచ్చింది. గ్రౌండ్ లలో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చే వారు. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్, ప్రధాన మంత్రి నవాబ్ ఖుర్షీద్ జా బహదూర్ మధ్య పతంగ్‌ల పోటీ వుండేది. కట్ అయిన పోయిన పతంగ్‌ను తీసుకురావడానికి గుర్రపు స్వారీ చేస్తూ సైనికులుండేవారు. కట్ అయి పడిపోయిన పతంగ్ తెచ్చిఇచ్చిన సైనికుడికి ఒక బంగారు అష్రఫీ నజరానాగా ఇచ్చేవారు," అని దక్కన్ హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ మహ్మద్ సఫీవుల్లా ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
పాతబస్తీలో 1985 వరకు పతంగుల పోటీలు ప్రతి యేటా నిర్వహించే వారు. అయితే రానురాను పతంగ్‌ల పోటీలు కొన్నిప్రాంతాలకే పరిమితం కాగా ప్రస్తుతం చాలా మంది ఏదో ఎంజాయ్ మెంట్ కోసం పండుగ రోజున పతంగులు ఎగురవేస్తున్నారని డాక్టర్ సఫీవుల్లా చెప్పారు. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పోటీలు నిర్వహించే వారు.

