సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందడి ఏర్పడింది. ఈ ఉత్సవాల్లో పది దేశాలు, 25 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు పాల్గొంటున్నారు.
రంగురంగుల గాలిపటాలు
పద పదవే వయ్యారి గాలిపటమా అంటూ 19 దేశాల నుంచి తరలివచ్చిన 47 మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ తరలివచ్చి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గాలిపటాలు ఎగురవేశారు. వివిధ రంగులు, వివిధ రకాల పక్షుల ఆకారాలతో కూడిన గాలిపటాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మైదానంలో గాలిపటాలు ఎగురవేసి సంతోషం వెలిబుచ్చారు. ఒకవైపు వీనుల విందుగా వినిపిస్తున్న సంగీతం మధ్య ఉవ్వెత్తున గాలిపటాలను ఎగురవేస్తూ యువత కేరింత కొట్టారు. 19 దేశాల నుంచి ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ వివిధ ఆకారాల్లోని గాలిపటాలతో వచ్చి కైట్ ఉత్సవంలో పాల్గొంటున్నారు.14 రాష్ట్రాల నుంచి 54 మంది జాతీయ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్ లో సందడి చేశారు.
నోరూరిస్తున్న వెయ్యి రకాల మిఠాయిలు
వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యిరకాల మిఠాయిల రుచి తెలంగాణ వాసులకు చూపిస్తున్నారు.దేశ, విదేశాలకు చెందిన మహిళలు వైవిధ్య మిఠాయిలతో ఈ స్వీట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి వెయ్యిమంది మహిళలు తయారు చేసిన వివిధ మిఠాయిలను ఈ ప్రదర్శనలో ఉంచారు. దేశంలొని వారే కాకుండా ఇరాన్, టర్కీ, ఆఫ్ఘనిస్థాన్ తదితర 9 దేశాలకు చెందిన వారు వారి వారి మిఠాయిలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.నింగిలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలను చూస్తూ, నోరూరించే మిఠాయిలను తింటూ మైదానంలో ప్రజలు కలియ తిరిగారు.
వినోద భరితం ఈ ఫెస్టివల్
సికింద్రాబాద్‌లో జరిగే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌లో నగరంలో ఆకాశంలో ఎగురుతున్న ఉత్కంఠభరితమైన గాలిపటాల నుంచి ప్రపంచవ్యాప్తంగా నోరూరించే స్వీట్ల వరకు, ఈ పండుగ సంస్కృతి, సంప్రదాయం, వినోదం పరిపూర్ణ సమ్మేళనంగా నిలిచింది.కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ప్రజలు ఈ ఉత్సవంలో ఆనందంగా గడిపారు.
గాలిపటాలు సురక్షితంగా ఎగురవేయండి
‘గాలిపటాలు ఎగురవేసేటప్పుడు సురక్షితంగా ఉండండి’ అని తెలంగాణ విద్యుత్ శాఖ హెచ్చరించింది.విద్యుత్ లైన్లు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయడం ప్రమాదకరమని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని టీజీఎస్ పీడీసీఎల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేటప్పుడు భద్రత చర్యలు పాటించాలని సూచించారు.చైనా మాంజాలను వాడవద్దని ఆయన కోరారు.
ప్రతీ ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి : సీఎం
భోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు...ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతీ ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.