ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలు...ఎప్పుడో తెలుసా ?
x
parliament Bhavan

ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలు...ఎప్పుడో తెలుసా ?

ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎంపిలుంటే ఎలా ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల చర్చలో ఈ ప్రతిపాదనవచ్చింది. అయితే, కొత్తదేం కాదు, గతంలో ఉండిందో.. అదేందో చూద్దాం...


ఒక పార్లమెంటు స్ధానానికి ఎంతమంది ఎంపీలుంటారు ? ఇదేం పిచ్చిప్రశ్న ఒక నియోజకవర్గానికి ఒక్కరే ఎంపీ ఉంటారు కదా అని అనుకుంటున్నారా ? ఇపుడు అయితే ఒక ఎంపీనే ప్రాతినిధ్యంవహిస్తున్నారు కాని ఒకపుడు కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీలుండేవారు. 1952, 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీలుండేవారు. రెండు సార్వత్రిక ఎన్నికల్లో కలిపి 11 నియోజకవర్గాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. పార్వతీపురం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గాల్లో ఇద్దరేసి ఎంపీలుండేవారు. ఒకరు జనరల్ కోటాలో ఎన్నికైతే మరొకరు రిజర్వుడు కోటాలో ఎన్నికయ్యేవారు. ఆరు నియోజకవర్గాలకు 1957లో మాత్రమే ఇద్దరేసి ఎంపీలుంటే విశాఖపట్నం, చిత్తూరు, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండలో 1952, 57లో కూడా ఇద్దరేసి ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు.

ఏ నియోజకవర్గాలు ?


పార్వతీపురంలో బీ సత్యనారాయణ జనరల్ ఎంపీగా ఉంటే, డీ. సూరిదొర ఎస్టీ ఎంపీగా ఉన్నారు. 1952లో వైజాగ్ ఎంపీగా లంక సుందరం జనరల్ ఎంపీ అయితే జీ మల్లుదొర రిజర్వుడు కేటగిరి ఎంపీగా ఉండేవారు. ఇక కాకినాడలో బీఎస్ మూర్తి జనరల్ ఎంపీ అయితే మొసలికంటి తిరుమలరావు రిజర్వుడు ఎంపీ. రాజమండ్రి నియోజకవర్గంకు కానేటి మోహన్ రావు, ఎన్ రెడ్డినాయుడు ప్రాతినిధ్యం వహించారు. ఏలూరు స్ధానంలో కొండ్రు సుబ్బారావు, బీఎన్ మూర్తి ఇద్దరూ ఎంపీలుగా ఉండేవారు. ఒంగోలు సీటునుండి ఎం నానాదాసు, పీ వెంకటరాఘవయ్య ఎంపీలుగా ఉండేవారు. నెల్లూరు స్ధానంలో 1957లో బీ అంజనప్ప, ఆర్ఎల్ఎన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఇక చిత్తూరులో 1952లో టీఎస్వీ రెడ్డి, ఎంవీజీ శివ ఎంపీలుగా ఉన్నారు. అలాగే 1957లో ఎంవీ గంగాధర శివ, అనంతశయనం అయ్యంగార్ ప్రాతినిధ్యం వహించారు.

1952 ఎన్నికల్లో నల్గొండలో రావి నారాయణ రెడ్డి, సుంకం అచ్చాలు ప్రాతినిధ్యం వహించారు. 1957 ఎన్నికల్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు, డీ రాజయ్య ఎంపీలుగా ఉండేవారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1952లో రామస్వామి, జనార్ధనరెడ్డి ఎంపీలయ్యారు. 1957లో జే రామేశ్వరరావు, పీ. రామస్వామి ఎంపీలుగా ఉండేవారు. రామస్వామి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇక కరీంనగర్ నుండి 1952లో బద్దం ఎల్లారెడ్డి, ఎంఆర్ కృష్ణ ప్రాతినిధ్యం వహించారు. 1957 ఎన్నికల్లో ఎంఆర్ కృష్ణ, ఎం శ్రీ రంగారావు ఎంపీలుగా ఉన్నారు. ఎంఆర్ కృష్ణ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.

అప్పట్లోనే ఇద్దరు ఎంపీలతో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇద్దరితోనే సమస్యలంటే ఒక నియోజకవర్గంలో అయితే ముగ్గురు ఎంపీలు ఉండేవారని తెలుసా ? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటే మనకు మొదటి ఎన్నికలు జరిగింది 1952లో. అప్పట్లో పార్లమెంటు స్ధానాల సంఖ్య 400 ఉండేవి. అప్పుడే రిజర్వేషన్ల ప్రక్రియ అమలు మొదలైంది. పార్లమెంటులాంటి అత్యున్నత చట్టసభలో కూడా అణగారిన వర్గాలు అంటే ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం చాలా అవసరమని నాటి పాలకులు అభిప్రాయపడ్డారు.

అయితే అణగారినవర్గాలకు కేటాయించాల్సిన నియోజకవర్గాలు ఏవన్న విషయమై శాస్త్రీయంగా ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అందుకనే స్ధూలంగా కొన్ని నియోజకవర్గాలను ఎంపికచేశారు. అంటే 400 నియోజకవర్గాల్లో 314 నియోజకవర్గాలకు ఒక ఎంపీనే ప్రాతినిధ్యం వహిస్తే మిగిలిన 86 నియోజకవర్గాలకు ద్విసభ్య ఎంపీలు ప్రాతినిధ్యంవహించారు. ఈ 86 నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. ఇందులో కూడా పై వర్గాల జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించారు. అంటే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఒక జనరల్ ఎంపీ, ఒక రిజర్వుడు ఎంపీ ఉండేవారన్నమాట.


ఇద్దరేసి ఎంపీలు ప్రాతినిధ్యంవహించిన స్ధానాలు ఉత్తరప్రదేశ్ లో 17, మద్రాసు రాష్ట్రంలో 13, బీహార్లో 11, బొంబాయి రాష్ట్రంలో 8 ఉన్నాయి. పశ్చిమబెంగాల్ నార్త్ నియోజకవర్గంలో అయితే ఏకంగా ముగ్గురు ఎంపీలుండేవారు. మొత్తం జనాభా ప్రాతిపదికన ఒక జనరల్, ఇద్దరు రిజర్వుడు ఎంపీలు నార్త్ బెంగాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రెండో ఎన్నిక జరిగిన 1957లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు పార్లమెంటు స్ధానాల సంఖ్య 400 నుండి 494కి పెరిగింది. 1957 నాటికి ద్విసభ్య ఎంపీల నియోజకవర్గాల సంఖ్య తగ్గింది. ఎందుకంటే 1952లో ద్విసభ్య నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అందుకనే సమస్యలు తలెత్తిన నియోజకవర్గాలను సింగిల్ ఎంపీ నియోజకవర్గంగా మార్చారు.

ఎందుకు తగ్గించారు ?

అందుకనే 86 ద్విసభ్య నియోజకవర్గాలు సంఖ్య 1957 ఎన్నికలకు 57కి తగ్గింది. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 18 స్ధానాలు, ఆంధ్రప్రదేశ్ లో 8, బీహార్లో 8, పశ్చిమబెంగాల్లో 8, బొంబాయి రాష్ట్రంలో 8, మద్రాసు రాష్ట్రంలో 7 నియోజకవర్గాలుండేవి. ఆ ఐదేళ్ళ కాలంలో కూడా మరికొన్ని తలనొప్పులు ఎదురయ్యాయి. దాంతో ప్రభుత్వంలోని పెద్దలు, మేథావులు కూర్చుని మాట్లాడుకుని తర్వాత ఎన్నికల నుండి ఒక నియోజకవర్గానికి ఒక ఎంపీనే ఉండాలని నిర్ణయించారు. ద్విసభ్య ఎంపీల విధానాన్ని అప్పటికప్పుడే రద్దుచేశారు. అందుకనే 1961లో జరిగిన ఎన్నికల నుండి ఒక స్ధానానికి ఒక ఎంపీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read More
Next Story