మోదీ మెచ్చిన తెలంగాణ టీచర్ కు అండగా జనం
మోదీ మెచ్చిన టీచర్ పేద విద్యార్థులకు విద్యలో ఆటంకం కలగకుండా ఉండేందుకు పేద విద్యార్థులకు విద్యా సహాయం కార్యక్రమం చేపట్టారు.
మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం వేడుక వేళ తెలంగాణకి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహుల గూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన కోడిపాక రమేష్ ఈ వేడుకల్లో స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. దేశంలో ఒక మూలన ఉన్న ప్రభుత్వ బడి పంతులుకి ఈ విశిష్ట గౌరవం దక్కడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆయనకి ఈ గౌరవం దక్కడం వెనుక కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడి గవర్నమెంట్ స్కూల్స్ ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన కృషి, వినూత్న ఆలోచనలే కారణం.
కోడిపాక రమేష్ సేవలకు గానూ.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికవడంతో పాటు సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. మారుమూల గ్రామాల్లో, గిరిజన వాడల్లో విద్యార్థులకు చదువు విలువ తెలిపి, వారు బడిబాట పట్టేందుకు ఆయన రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో చదువు వదిలేయకుండా, విద్యార్థులకు డబ్బు పొదుపు అలవాటు చేసి, ఆ డబ్బుని తమ విద్య అవసరాల కోసం ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులు పోషకాహార లోపాన్ని అధిగమించేలా.. ప్రతియేటా సెప్టెంబర్ లో దాతల సహాయంతో విద్యార్థులకు పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నారు.
పోస్టు కార్డులు రాయించడం, ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్లడం, పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం, స్టూడెంట్స్ తో బుక్ స్టాల్ల్స్ ఏర్పాటు చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పేద విద్యార్థులకు విద్యలో ఆటంకం కలగకుండా ఉండేందుకు పేద విద్యార్థులకు విద్యా సహాయం కార్యక్రమం చేపట్టారు. స్కూల్ అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు లాంటివి డొనేట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు.
ఈ క్రమంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ప్రధానోపాధ్యాయులు కోడిపాక రమేష్ అడగగానే స్పందించిన కాంగ్రెస్ నేత తాడిశెట్టి విద్యాసాగర్... ఆయన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు కంపాస్ బాక్స్ లు, పలకలు, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాల కవర్స్, స్టికర్స్,పెన్సిల్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ పంపించారు. పాఠశాల అభివృద్హికి అడగగానే సహకారం అందించినందుకు హెడ్ మాస్టర్ కోడిపాక రమేష్ ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పురోగతికి ప్రజలు కూడా సామజిక బాధ్యతతో తమవంతు సహకారం అందించాలని, తద్వారా పేద విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆయన పిలుపునిస్తున్నారు.