Komatireddy | కోమటిరెడ్డికి మంత్రిపదవి ఆశపెట్టింది వీళ్ళేనా ?
x
Komatireddy Rajagopal Reddy

Komatireddy | కోమటిరెడ్డికి మంత్రిపదవి ఆశపెట్టింది వీళ్ళేనా ?

కోమటిరెడ్డి చెప్పిన నలుగురిలో ఏ ఒక్కరికైనా మంత్రిపదవి కాదు కదా కనీసం ఎంఎల్ఏ టికెట్ అయినా ఇంకొకళ్ళకు ఇప్పించేంత సీన్ ఉందా ?


కొద్దిరోజులుగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇంతకీ ఈయన వార్తల్లో వ్యక్తిగా ఎందుకయ్యారంటే మంత్రిపదవి రాలేదన్న కోపాన్ని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) మీద రకరకాలుగా చూపిస్తున్నారు. రేవంత్ ఏప్రకటనచేసినా వెంటనే దానికి విరుద్ధంగా ఎంఎల్ఏ మాట్లాడుతున్నారు. మంత్రిపదవి అందలేదన్న ఆగ్రహంతో కోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఊగిపోతున్నారు. అయితే ఆకోపంలో లాజిక్కులు మిస్సయిపోయారు. ఇంతకీ అవేమిటంటే కోమటిరెడ్డికి మంత్రిపదవి రాకపోవటానికి రేవంత్ కు ఎలాంటి సంబంధంలేదు.

కోపం ఒకరిమీద ఉంటే దాన్ని మరొకరి మీద చూపించకూడదన్న కనీస ఆలోచన ఎంఎల్ఏలో లోపించింది. 2023 ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి బీజేపీలో ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న విషయం గ్రహించి బీజేపీలో నుండి బయటకు వచ్చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆ విషయం గ్రహించిన కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజగోపాల్ ను కలిసి కాంగ్రెస్ లో చేరమని కోరారు. దాంతో కోమటిరెడ్డి కొన్ని హామీలను పొంది బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత మునుగోడు అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. ఇక్కడవరకు బాగానే ఉన్నా అసలు సమస్యంతా ఇపుడే మొదలైంది.

అదేమిటంటే తనకు మంత్రిపదవి ఇస్తామని చెప్పి హామీఇచ్చిన కాంగ్రెస్ నేతలు మాట తప్పారంటు నానా గోలచేస్తున్నారు. తనకు అప్పట్లో హామీఇచ్చినట్లే ఇపుడు మంత్రిపదవి ఇవ్వాల్సిందే అని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే అందరిలోను ఒక అనుమానం మొదలైంది. మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చిన వాళ్ళమీద చూపించాల్సిన కోపాన్ని కోమటిరెడ్డి ముఖ్యమంత్రి మీద ఎందుకు చూపిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఒకవేళ రేవంత్ ఏమన్నా ఎంఎల్ఏకి మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చారా అనే సందేహాలు మొదలయ్యాయి.

అయితే కోమటిరెడ్డి చెప్పిన ప్రకారం మంత్రిపదవి ఇస్తానని రేవంత్ అసలు హామీనే ఇవ్వలేదు. మరి మంత్రిపదవిని హామీ ఇచ్చింది ఎవరు ? ఎవరంటే ఇపుడు డిప్యుటి సీఎం మల్లుభట్టి విక్రమార్క, అప్పటి పార్టీ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, అప్పటి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఈనలుగురు తనకు మంత్రిపదవిని హామీ ఇచ్చినట్లు స్వయంగా రాజగోపాలరెడ్డే చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. కోమటిరెడ్డి చెప్పిన నలుగురిలో ఏ ఒక్కరికైనా మంత్రిపదవి కాదు కదా కనీసం ఎంఎల్ఏ టికెట్ అయినా ఇంకొకళ్ళకు ఇప్పించేంత సీన్ ఉందా ? మంత్రిపదవి ఇప్పిస్తామని వీళ్ళు చెబితే కోమటిరెడ్డి ఎలా నమ్మారు ? అన్నదే అందరిలోను సందేహం.

సరే, మంత్రిపదవి ఇప్పిస్తామని హామీఇచ్చింది పైనలుగురు అయితే ప్రతిరోజు రేవంత్ ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్ధంకావటంలేదు. కోరుకున్న వాళ్ళకు ఎంఎల్ఏ, ఎంఎల్సీ టికెట్లు లేదా మంత్రివర్గంలోకి తీసుకోలేక రేవంతే అవస్తలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపధ్యంలో కోమటిరెడ్డి గోల పార్టీలో బాగా ఎక్కువైపోతోంది. పైగా ప్రస్తుత పరిస్ధితుల్లో రెడ్లకు మంత్రివర్గంలో చోటుకల్పించే అవకాశాలు చాలాచాలా తక్కువని కోమటిరెడ్డికి అంతమాత్రం తేలీదా ? తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లానుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ మూడో రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందా ? ఇపుడు తెలంగాణలో బీసీ వాదన బలంగా వినబడుతోంది. కాబట్టి అవకాశాలు ఉంటే బీసీలకు ఉంటుందే కాని రెడ్లకు అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఎవరైనా రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలంటే ప్రాతినిధ్యంలేని నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల నుండి ఉంటుందే కాని నల్గొండ నుండైతే ఉండదు. ఈ విషయాలేవీ ఆలోచించకుండా ప్రతిరోజు రాజగోపాలరెడ్డి మంత్రిపదవి కోసం రేవంత్ ను టర్గెట్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

Read More
Next Story