Komatireddy | కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏమైంది ?
x
Komatireddy brothers

Komatireddy | కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏమైంది ?

ఒకపుడు రేవంత్ కు అన్న వెంకటరెడ్డి బద్ధశతృవుగా ఉండి ఇపుడు గట్టి మద్దతుదారుడుగా మారారు.


కోమటిరెడ్డి బ్రదర్స్ గా పాపులరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళకు ఎప్పుడు ఎవరిమీద ప్రేమపుడుతుందో ? ఎప్పుడు ఎవరిపైన ఆగ్రహం వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇపుడు విషయం ఏమిటంటే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Cabinet) క్యాబినెట్లో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి. తమ్ముడు రాజగోపాలరెడ్డి(Komatireddy brothers) మునుగోడు ఎంఎల్ఏ. మంత్రిపదవి కోసం తెగప్రయత్నించి భంగపడిన సీనియర్ ఎంఎల్ఏ. ఒకపుడు రేవంత్ కు అన్న వెంకటరెడ్డి బద్ధశతృవుగా ఉండి ఇపుడు గట్టి మద్దతుదారుడుగా మారారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అవ్వగానే అధిష్ఠానం మీద అలిగి కోపంచేసుకుని రేవంత్ ను నానా మాటలని రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి కమలంపార్టీకి రాజీనామా చేసి మళ్ళీ రేవంత్ కు జిందాబాద్ కొట్టి కాంగ్రెస్ లో చేరారు. అలాంటి రాజగోపాలరెడ్డి ఇపుడు రేవంత్ అంటేనే మండిపోతున్నారు. రేవంత్ ప్రతి ప్రకటనను ఎంఎల్ఏ ఖండిస్తుంటే మంత్రి వెంటకరెడ్డి మాత్రం రేవంత్ కు మద్దతుగా నిలబడుతున్నారు. జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న ఫేక్ జర్నలిస్టులను లాగి చెంపమీద కొట్టాలనిపిస్తుందన్న రేవంత్ వ్యాఖ్యలను రాజగోపాలరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం, ఉద్యమం, జర్నలిస్టులు, సోషల్ మీడియా అంటు ఏదేదో మాట్లాడేసి రేవంత్ మాటలను ఖండిస్తు ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు వైరల్ అయిపోయి పార్టీలో సంచలనంగా మారింది.

నిజానికి రేవంత్ వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం రాజగోపాల్ కు లేదు. ఎందుకంటే రేవంత్ చెంపపగలగొట్టాలని అనుకున్నది ఫేక్ జర్నలిస్టులను మాత్రమే. ఇందులో రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టాల్సింది ఏమీలేదు. అయినా సరే రాజగోపాల్ ట్విట్టర్లో బుర్రకుతోచింది ఏదో రాసిపడేసేటప్పటికి వైరల్ అయిపోయింది. ఇంతకుముందు ఏదో సందర్భంలో రేవంత్ మాట్లాడుతు వచ్చేఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పారు. అప్పుడు కూడా వెంటనే రాజగోపాల్ రెచ్చిపోయాడు. రాబోయే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిని అనిచెప్పుకోవటం కాంగ్రెస్ విధానానికి విరుద్ధమని ఏదేదో మాట్లాడేశాడు. ఇక్కడ అర్ధం అవుతున్నది ఏమిటంటే రేవంత్ ఏది మాట్లాడినా అందుకు విరుద్ధంగా మాట్లాడాలని రాజగోపాల్ డిసైడ్ అయినట్లు. మంత్రిపదవి దక్కలేదన్న ఆగ్రహం రాజగోపాల్ రెడ్డిలో బాగా కనబడుతోంది.

కొసమెరుపు ఏమిటంటే సూర్యాపేటలో ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా రేవంత్ కు మంత్రి ఫోన్ చేశారు. ఫోన్లో మాట్లాడుతు క్యాంపు కార్యాలయం ప్రారంభించిన విషయాన్ని చెప్పి ‘‘ముఖ్యమంత్రిగా మీరు కంటిన్యు అవటమే కాకుండా రాబోయే ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉండాల’’ని గణపతి హోమం చేయించినట్లు చెప్పారు. ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే అన్నా-తమ్ముళ్ళు ఒకళ్ళకు మరొకళ్ళు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకపుడు ఇద్దరిదీ ఒకేమాట ఒకేబాటగా సాగింది. అలాంటిది ఇపుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఏమైందని పార్టీలో చర్చించుకుంటున్నారు.

Read More
Next Story