MLC కవిత అరెస్ట్ పై నేతల రియాక్షన్
x
Kavitha

MLC కవిత అరెస్ట్ పై నేతల రియాక్షన్

ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె అరెస్ట్‌పై కేటీఆర్, హరీశ్ సహా కీలక నేతలు స్పందిస్తున్నారు. వారి రియాక్షన్ ఎలా ఉందంటే..



బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో ఢిల్లీకి తరలించనున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఆమె నివాసంలో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు చేశారు. సోదాలు ముగిసిన అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్ తీసుకుని అధికారులు కవిత నివాసానికి చేరుకున్నారు. ఐదు గంటల పాటు చేసిన సోదాల్లో ఈడీ అధికారులు 16 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీకి తరలించడానికి ఎయిర్‌పోర్ట్ తీసుకెళ్తున్నారు. ఈ స్కాం కేసులో కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి ఈరాత్రికే ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు.

ఈడీ సోదాలు ప్రధాని మోడీ పనే!

కవిత నివాసంలో ఈరోజు జరిగిన ఈడీ సోదాలు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్లానే అని కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ‘‘ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుండగా ఈరోజు కావాలనే కవిత ఇంట్లో ఈడీ సోదాలు చేయించారు. లిక్కర్ కేసులో పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసిన సమయంలోనే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఒక్క రోజు ముందే ఎందుకు అరెస్ట్ చేశారు?’’అని ప్రశ్నించారు. ఇదంతా మోడీ, అమిత్ షా చేసిన మ్యాచ్ ఫిక్సింగేనని అనుమానం వ్యక్తం చేశారు.

కవితను ఎలా అరెస్ట్ చేస్తారు: కేటీఆర్

కవితను అరెస్ట్ చేసిన సమాచారం అందిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు‌కు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో వాదించి వారు ఇంటి లోపలకు వెళ్లారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కవితను అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారు. కోర్టులో ఇచ్చిన మాటను తప్పుతున్న అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా శుక్రవారమే సోదాలు చేయడం ఏదో అనుకోకుండా జరిగింది కాదని, వారు పక్కా ప్రణాళికతోనే ఈరోజును ఫిక్స్ చేసుకున్నారని ఆరోపించారు. ‘‘పక్కా ప్లాన్‌తోనే శుక్రవారం సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు కవితను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కుదరదు. అందుకే ఈరోజు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. తమ ప్లాన్ చెడిపోకూడదని సోదాలు ముగిసిన తర్వాత కూడా ఎవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు’’అని ఆగ్రహించారు కేటీఆర్.

ఈ బెదిరింపులకు భయపడం: ప్రశాంత్ రెడ్డి

కవిత అరెస్ట్ ప్రధాని మోడీ ప్లానే అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేమని తెలిసే దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని మోడీ ఈ ప్లాన్ రచించారని అన్నారు. ‘‘ఈడీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలను భయబ్రాంతులకు గురి చేయాలని ఈడీ చూస్తోంది. ఇది ఈడీ చేస్తున్న విఫలప్రయత్నమే అవుతుంది. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ భయపడరు. ఈడీ తీరుకు వ్యతిరేకంగా చట్టపరంగా కోర్టుల్లో పోరాడతాం. మాకు ప్రజలకు అండగా ఉంటారు’’అని తెలిపారు ప్రశాంత్ రెడ్డి.


Read More
Next Story