koneru konappa
x

కారులో RSP చిచ్చు.. కాంగ్రెస్ గూటికి కోనేరు కోనప్ప..

లోక్ సభ ఎన్నికల వేళ BRS, BSP పొత్తు ప్రకటనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో చేరడం ఖాయమైనట్లు స్పష్టం అవుతోంది.


లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ప్రకటనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మంగళవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తుపై ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో కారు పార్టీలోని కొందరు ముఖ్య నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత కోనేరు కోనప్ప పార్టీకి రాజీనామా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. దీంతో రేపో మాపో కోనప్ప కాంగ్రెస్ కండువా కప్పుకోడం ఖాయమైనట్లు స్పష్టం అవుతోంది.


కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై కోనప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనడం లేదు. ఇదే తరుణంలో కేసీఆర్ బీఎస్పీతో చేతులు కలపడం ఆయనకి కోపాన్ని తెప్పించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప నిలబడిన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచే బీఎస్పీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆయన వలనే ఓట్లు చీలి కోనప్ప ఓడిపోయారని అంతా చర్చించుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆర్ఎస్పీ కాగజ్ నగర్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే బీఎస్పీ తో పొత్తు విషయం కానీ, పోటీ విషయంలో కానీ కోనప్పతో సంప్రదింపులు జరపకపోవడం ఆయన్ని, ఆయన అనుచరులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు హైదరాబాద్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం 5 గంటలకు భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు.


గుర్రుగా ఉన్న మరికొందరు ఆదిలాబాద్ జిల్లా నేతలు..?


తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అవకాశం దొరికితే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే పార్టీ ఫిరాయించే ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ తో బీఎస్పీ జత కట్టడం పార్టీలో చిచ్చు రాజేసింది. అదును చూసి దెబ్బ వెయ్యాలనుకుంటున్న నేతలకు ఆయుధం అందించినట్లు అయింది. ఇప్పటికే కోనేరు కోనప్ప రాజీనామా ప్రకటించగా.. ఆయన బాటలో మరికొందరు ఆదిలాబాద్ జిల్లా నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీఎస్పీ తో పొత్తు విషయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. మరి వీరు పార్టీ మారతారా లేదా అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. అయితే, ఇంద్రకరణ్ రెడ్డి, కోరేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. అనంతరం మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు గులాబీ అధిష్టానం తమని సంప్రదించకుండా బీఎస్పీ తో చేతులు కలపడంపై అసంతృప్తితో ఉన్నారు.

Read More
Next Story