
కేసీఆర్‌ది కోహ్లీ కన్నా పెద్ద రికార్డ్.. కొండ సురేఖ సెటైర్లు
14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అని కొండా సురేఖ ప్రశ్నించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సెటైర్లు పేల్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా అందుకున్న కేసీఆర్.. అసెంబ్లీకి రాకపోవడం, ప్రజా సమస్యలపై ఎక్కడా గళమెత్తి ప్రశ్నించకపోవడంపై కొండా సురేఖ ప్రశ్నించారు. ఈమేరకు తనదైన శైలిలో ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది. మాజీ సీఎంను మంత్రి రోస్ట్ చేస్తున్నారంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ కొండా సురేఖ.. కేసీఆర్‌పై సెటైర్లు పేల్చారు. పాకిస్థాన్‌పై సెంచరీ చేసి కోహ్లీ సాధించిన రికార్డు కంటే ఫామ్ హౌస్‌లో ఉండి కేసీఆర్ చేసిన రికార్డ్ ఇంకా పెద్దదంటూ చురకలంటించారు.
కొండా సురేఖ పోస్ట్ ఇదే..
‘‘దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించడం హర్షణీయం. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం. 14 వేల పరుగులు చేసి విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు కొట్టగా... మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకపోవడం... ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే... 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని మన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా?’’ అంటూ పంచ్‌లు పేల్చారు మంత్రి.