
‘కవిత కూడా అవినీతి చేశారు’
నేను బీఆర్ఎస్ వీడటానికి అసలు కారణం వారేనన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కవితకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ వీడటానికి కూడా హరీష్ రావే కారణమన్న కవిత వ్యాఖ్యలను కొండావిశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. తాను బయటకు రావడానికి హరీష్‌కు సంబంధమే లేదని, కేసీఆర్, కేటీఆర్‌ల వైఖరి తట్టుకోలేకే వచ్చేశానంటూ కీలక విషయాలు వెల్లడించారాయన. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని కూడా కవితకు సూచించారు. అంతేకాకుండా కవిత కూడా అవినీతి చేశారని చెప్పకనే చెప్పారు. తానొక్కడే కాదని మరికొందరు నేతలు కూడా కేటీఆర్, కేసీఆర్‌ల తీరుతెన్నులు నచ్చక, వారితో కలిసి పనిచేయలేకనే పార్టీ వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యారని, బయటకు వచ్చేశారని చెప్పారు. ‘‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాను. కవిత ఇప్పుడు అమాయకురాలి మాదిరిగా మాట్లాడుతున్నారు. ఆమె అవినీతి చేయలేదా? ఈ రాష్ట్రాన్ని ఒక ఫ్యామిలీ రూల్ చేసింది. కాళేశ్వరం పాపమంతా కేసీఆర్‌దే. హరీష్ రావు పాత్ర సంతకాలకే పరిమితమైంది’’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అసలు కవిత ఏమన్నారు..
పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా బుధవారం కవిత.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్‌లపై ఆరోపణలు గుప్పించారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకోసమే తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని, తనను బయటకు పంపారని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి చేసిన హరీస్ రావు తన సొంత డబ్బులో 20 మంది ఎమ్మెల్యేలకు మద్దుతగా నిలిచారన్నారు. వారిని అడ్డుపెట్టుకుని పార్టీని కౌవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హరీస్ రావు నాయకత్వం, ఒంటెద్దుపోకడ తట్టుకోలేకే చాలా మంది నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని, జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, విజయరామారావు, కొండావిశ్వేశ్వర్ కూడా ఒకరని కవిత సంచలన వ్యాఖ్యలు చెప్పారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రమంతా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోపణలకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బదులిచ్చారు.